close

ప్ర‌త్యేక క‌థ‌నం

చేతికి గులాబీ ముళ్లు

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైంది. అసలే శాసనసభ ఎన్నికల్లో కుదేలైన ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు తెరాసలో చేరడంతో పాటు మండలి సభాపక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేయడంతో దెబ్బ మీద దెబ్బపడినట్లయింది. దీంతో మండలిలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీనికితోడు కొందరు ఎమ్మెల్యేలు కూడా తెరాసలో చేరిపోనున్నారనే ప్రచారం కాంగ్రెస్‌కు మరింత కలవరం కలిగిస్తోంది. దశలవారీగా ఎమ్మెల్యేల పేర్లు చర్చలోకి వస్తుండటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఆరుచోట్ల, తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూడేసిచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నెగ్గారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. వీరిలో ఐదుగురు తొలిసారి ఎన్నికైనవారున్నారు. మిగిలిన వారిలో పీసీసీ ముఖ్యులు, సీనియర్‌ నేతలు ఉన్నారు. మొత్తం మీద ఆరుగురు ఎస్టీ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని తమ ఎమ్మెల్యేలపై తెరాస దృష్టి సారించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యనేతలను తమ పార్టీకి దూరం చేసి డీలా పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కొన్ని నియోజకవర్గాలపై తెరాస దృష్టిసారించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఎంపీ స్థానాలపై దృష్టి పెట్టిన నేతలే కొన్నిచోట్ల ఫిరాయింపుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను తెరాస ఒకచోటే నెగ్గింది. కాంగ్రెస్‌ ఆరుచోట్ల, తెదేపా రెండుచోట్ల నెగ్గాయి. వైరా నుంచి ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే తెరాసలో చేరారు. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖమ్మం, వైరా మాత్రం తెరాస చేతిలో ఉండగా మిగిలిన 5 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌, తెదేపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ బలం పెంచుకోవడంపై అధికార పార్టీ దృష్టి సారించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక స్థానం కూడా దక్కలేదు. రంగారెడ్డి జిల్లాలో కీలకమైన మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నెగ్గడంతో ఇక్కడ బలం పెంచుకోవడం ఎలా అనేదానిపై తెరాస కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మూడు స్థానాల్లో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి ఉన్నారు.

ఊహించని పరిణామంతో ఆందోళన
ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌ పార్టీని వీడటాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన లలిత ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే తెరాసలో చేరడం కాంగ్రెస్‌ నాయకుల్ని గందరగోళంలో పడేసింది. 2015లో శాసన సభ్యుల కోటాలో మండలికి ఎన్నికైన ఆమెకు పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని.. అప్పట్లో పలువురు ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడినా సీనియర్లను కాదని ఆమెకే టికెట్‌ ఇచ్చిందని.. ఎమ్మెల్సీగా ఉన్నా ఆర్మూర్‌ టికెట్‌ ఇచ్చి పోటీకి నిలబెట్టిందని కొందరు నేతలు వివరిస్తున్నారు.

ఉత్త ప్రచారాలే అంటున్న సీనియర్లు
ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొత్త ఎమ్మెల్యేలకు చేసిన సన్మాన కార్యక్రమంలో గండ్ర వెంకట్రమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. వారిద్దరూ కూడా అనివార్య కారణాల వల్ల రాలేదు తప్ప ఇతర కారణాలేవి లేవని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా కలసికట్టుగానే ఉన్నారని ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. కొందరు తెరాసలోని వెళ్తారనేది ప్రచారం మాత్రమే అని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల్ని మరింత డీలాపడేలా చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని వివరిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.