Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 03/08/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. KRMB: బృందంలో తెలంగాణ వారు ఉండకూడదు: ఏపీ 

ఆగస్టు 5వ తేదీన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను బోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్‌ సూచించింది.

అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలివ్వలేం: ఏపీ ఈఎన్‌సీ

2. వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా?: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసునని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ.3లక్షల కోట్ల అప్పులకు కొవిడ్‌ సంక్షోభం తోడైందన్నారు. కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ ఆర్థిక కష్టాలు, సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా? అని నిలదీశారు.

3. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే..

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

4. దిల్లీ చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగుపెట్టింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు  సింధుకు జాతీయ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

Independence Day: ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్‌ క్రీడాకారుల బృందం

5. కొత్త రాష్ట్రాల ప్రతిపాదనల్లేవ్‌!

 కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు  సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. కొందరు వ్యక్తులు, సంస్థల నుంచి అలాంటి డిమాండ్లును ఎప్పటికప్పుడు స్వీకరించినప్పటికీ  రాష్ట్రాలను విభజించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. 

6. ఆందోళన కలిగిస్తోన్న ఆర్‌ ఫ్యాక్టర్‌..!

గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. రోజువారీగా వెలుగు చూస్తోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి రేటును తెలియజేసే ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబయి, పుణె నగరాలు మినహా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో ఆర్‌-ఫ్యాక్టర్‌ 1 దాటడం కలవరపెట్టే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

7. వుహాన్‌లో మళ్లీ కరోనా కలవరం.. నగరవాసులందరికీ పరీక్షలు

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో స్థానికంగా వైరస్ కేసులు నమోదుకావడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. దాంతో ఆ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

8. అదే రగడ.. కొనసాగుతున్న వాయిదాలు..!

పెగాసస్ హ్యాకింగ్ సహా పలు అంశాలపై పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు తమ నిరసనల్ని కొనసాగిస్తున్నాయి. దాంతో ఉభయసభలు ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభ్యులు వెల్ వద్దకు దూసుకురాడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఎగువ సభను మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఆ తర్వాత రెండు గంటలకు వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభలోనూ ఇదే వైఖరి కనిపించింది.

9. జీవితకాల గరిష్ఠాలకు సూచీలు!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం నష్టాలు మూటగట్టుకున్న మదుపర్లు ఈరోజు లాభాల్లో మునిగి తేలారు. రెండు ప్రధాన సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. సెన్సెక్స్‌ తొలిసారి 16 వేల మార్క్‌ను దాటింది. ఓ దశలో సెన్సెక్స్‌ 937 పాయింట్లు లాభపడి 53,887 వద్ద.. నిఫ్టీ 261 పాయింట్లు ఎగబాకి 16,146 వద్ద జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. 

10. ఆ రాష్ట్రాల్లో మోగిన బడిగంట..
సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని పాఠశాలలు సోమవారం తెరచుకున్నాయి. 50% మంది విద్యార్థులనే అనుమతించి, కొవిడ్‌-19 నియమావళిని అనుసరించి తరగతులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరు కాగా, పట్టణాల్లో గరిష్ఠంగా 30% హాజరు మాత్రమే నమోదైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని