తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు
close

తాజా వార్తలు

Updated : 08/06/2020 13:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

హైదరాబాద్‌‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు ఇవాళ తిరిగి తెరుచుకున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన ఆలయాలు ప్రత్యేక పూజలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మసీదుల్లో సైతం వేకువజామున నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. ముందుగా ఆలయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో ప్రయోగాత్మక దర్శనాలు చేపట్టిన అధికారులు.. ఈనెల 10 నుంచి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టుల తర్వాతే భక్తులను ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు.

కలియుగ వైకుంఠం తిరుమలలో మార్చి 20 తర్వాత నిలిపివేసిన స్వామి దర్శనాలను తాజా లాక్‌డౌన్‌ సడలింపులతో తితిదే తిరిగి ప్రారంభించింది. ముందుగా తితిదే ఉద్యోగులు, స్థానిక భక్తులతో ప్రయోగాత్మకంగా దన్శనాలను ప్రారంభించింది. గంటకు 500 మంది చొప్పున రోజుకు 6వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీంతో స్వామి దర్శనానికి తితిదే ఉద్యోగులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ ఆయలంలోనూ భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రీశైలం మహాక్షేత్రంలోనూ ట్రయల్‌ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామి దర్శనాలు కల్పించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలోనూ దర్శనాలు ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయ నిర్వాహకులు ఉదయం 8.30 గంటల నుంచి ఉచిత లఘు దర్శనాలను కల్పిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ దర్శనాలకు స్థానికులతోపాటు ఆలయానికి చెందిన ఉద్యోగులను అనుమతించారు. భద్రాచలం రామాలయంలోనూ భక్తులకు దర్శనాలు కల్పించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఆలయ ప్రాంగణంలో వలయాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లోని బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ, వరంగల్‌ భద్రకాళీ ఆలయం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలోపాటు ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో స్వామి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని