close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రశాంతంగా ముగిసిన ‘పుర’ పోలింగ్‌

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.  రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసలో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. 7613 పోలింగ్‌ కేంద్రాల్లో బుధవారం పోలింగ్‌ కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2.  సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు!

ఏపీ శాసన మండలిలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఛైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారు. దీనిపై తెదేపా సభ్యులు హర్షం వ్యక్తం చేయగా.. వైకాపా సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

3. విలీనంపై ప్రశ్న..పవన్‌ స్పందన ఏంటంటే..!

ఏపీలో చేపట్టే ఏ కార్యక్రమం అయినా రెండు పార్టీలు కలిసే చేస్తాయని భాజపా-జనసేన నేతలు స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకుని రాజకీయ పరిస్థితులు, కార్యాచరణపై చర్చిస్తామన్నారు. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీలు ప్రకటించిన తర్వాత తొలి సమావేశం 28 నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి విలీనం అంశాన్ని ప్రస్తావించగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముందు ప్రస్తావించగా ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అయోమయం సృష్టించొద్దని వారించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. దోషులను ఉరితీసేందుకు 7రోజులే గడువివ్వండి

మరణశిక్ష విధించిన దోషులకు ఉన్న న్యాయపరమైన హక్కులను సవరించాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన తర్వాత 14 రోజులు కాకుండా వాళ్లను ఏడు రోజుల్లోనే ఉరి తీసేందుకు అనుమతివ్వాలని కేంద్రం తన పిటిషన్‌ ద్వారా కోరింది. దోషులకు క్యురేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకునేందుకు ఎక్కువ సమయం ఉండటంతో వాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చట్టంతో ఆడుకుంటున్నారని కేంద్రం ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రాజధాని కేసుల వాదనకు రోహత్గీకి రూ.5కోట్లు

హైకోర్టులో రాజధాని కేసులను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు  జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీబీఎస్‌ఈ పరీక్షలకు కాలిక్యులేటర్‌ అనుమతి

సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్‌(సీబీఎస్‌సీ) పరీక్షలు రాసే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ వెంట కాలిక్యులేటర్లు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది నుంచి 10, 12వ తరగతి పరీక్షలు రాసే దివ్యాంగులు తమ వెంట బేసిక్‌ కాలిక్యులేటర్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. సీఎస్‌డబ్ల్యూఎన్‌(చిల్డ్రన్‌ విత్‌ స్పెషల్‌ నీడ్స్‌) విభాగం కింద ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలలకు లేఖలను పంపించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘దమ్ముంటే సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించండి’

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ కొనసాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ కొన్ని భూముల వివరాలు చదివి వినిపించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మాట్లాడుతూ..  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై  దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని.. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కారణం.. మీరు గతంలో పనిచేసిన సంస్థ.. మీరు ఉద్యోగం నుంచి వైదొలగిన తేదీని ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. కేవలం సదరు కంపెనీలకే ఇప్పటి వరకు ఆ అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాజధాని పోరాటం రైతుల హక్కు: గల్లా అరుణ

రాజధాని రైతులు తమ హక్కుల కోసం పోరాడాలే కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కుమారి అన్నారు. మందడంలో మహిళా రైతుల దీక్షాశిబిరాన్ని ఆమె సందర్శించి అమరావతికోసం పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ‘రాజధానిని కాపాడుకోవడం భూములిచ్చిన రైతులుగా మీ హక్కు.. అందుకోసం ఎవ్వరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు’ అని గల్లా అరుణ రైతులకు ధైర్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 90 శాతం తెరాసవే: పల్లా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని తెరాస ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం.. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో ప్రతిపక్షాలు మరోసారి విఫలమయ్యాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు తెరాసకు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.