close

తాజా వార్తలు

Updated : 11/02/2020 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామాల రూపు రేఖలు మారాలి: కేసీఆర్‌

జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌: ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని.. జిల్లా స్థాయిలో వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాలు, పరిశుభ్రతతో వెల్లివిరియడం అత్యంత ప్రాధాన్యమని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కలెక్టర్లకు అండగా ప్రభుత్వం అదనపు కలెక్టర్లను నియమించిందని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరించేవారని.. ప్రస్తుతం ఆ కమిటీలను 26 విభాగాలుగా విభజించడం ద్వారా పనిఒత్తిడి తగ్గుతుందని కేసీఆర్‌ వారికి వివరించారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు..

పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉండాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పనులన్నీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇతర ఖర్చులను పక్కనపెట్టి గ్రామాలకు నిధులు మంజూరు చేస్తున్నామని కేసీఆర్‌ వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇవ్వనున్నట్లు చెప్పారు. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. కలెక్టర్లకు సహాయకంగా ఉండేందుకే అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని.. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించినట్లు వివరించారు. 

25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పులు..

పక్షం రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని కలెక్టర్లను కేసీఆర్‌ ఆదేశించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్యదర్శులు, జడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసే పద్ధతి వివరించి విధులు, బాధ్యతలు వారికి తెలియజేయాలన్నారు. పది రోజుల గడువు ఇచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాల్సిందిగా వారికి చెప్పాలన్నారు. 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పులు రావాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. ఏ గ్రామమైనా అనుకున్న విధంగా లేకపోతే చర్యలు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన వారికి అవార్డులు, ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో నాటిన మొక్కల్లో 85 శాతం కచ్చితంగా బతికించాలన్నారు. గ్రామంలో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర పనులకుగాను ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి నిధులు అందుబాటులో ఉంచనున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు నెలకు రూ.78కోట్లు..!

అడవుల్లో కలప స్మగ్లింగ్‌ అరికట్టే విషయంలో కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్‌ ఆదేశించారు. అడవుల పునరుద్ధరణకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలన్నారు. పల్లె ప్రగతి మాదిరిగా త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశించారు. పురపాలక శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరానికి నెలకు రూ.78 కోట్లు, పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. వనస్థలిపురం హరిణ వనస్థలి పార్కును కేబీఆర్‌ పార్కులా తయారు చేయాలన్నారు. నగరంలో కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని.. డీజిల్‌ వాహనాలు తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాలు పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను మార్చే బాధ్యత సర్పంచులకు అప్పగించాలని కలెక్టర్లను కేసీఆర్‌ ఆదేశించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.