
తాజా వార్తలు
అమెరికా మహిళలు: ఊదా రంగే ఎందుకు ?
వాషింగ్టన్: కమలా హారిస్, మాజీ ప్రథమ మహిళలు మిషెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్..ఇలా అత్యున్నత స్థానంలో ఉన్న అమెరికన్ మహిళలంతా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఊదారంగుతో మెరిసిపోయారు. అలాగే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కూడా మంగళవారం రాత్రి ఇదే రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఈ రంగుపై ఇంత మక్కువ ఏంటనే అనుమానం చూపరులకు రాకమానదు. అయితే, ఈ ఊదారంగును వారు ఫ్యాషన్ సింబల్‌గా మాత్రమే చూస్తారనుకుంటే పొరపాటే. మనమంతా ఒక్కటే అనే సందేశం ఇచ్చేందుకే వారు ఆ రంగును ఎంచుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అమెరికాలో రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలు ప్రధానమైనవి. రిపబ్లికన్ రెడ్, డెమొక్రాటిక్ బ్లూ కలయికను సూచించేదే ఊదారంగు. ఈ రంగును అక్కడి ప్రజలు ద్వైపాక్షితకు గుర్తుగా భావిస్తారు. పరస్పరం భిన్నాభిప్రాయాలున్న రాజకీయ పార్టీల మధ్య సహకారాన్ని ఈ రంగు ప్రతిబింబిస్తుంది. అందుకే అక్కడి మహిళా నేతలు అధికారిక కార్యక్రమాల్లో ఊదా, దానికి దగ్గర్లో ఉండే రంగు దుస్తుల వైపే మొగ్గు చూపుతుంటారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్..ఈ ఊదా రంగు దుస్తుల్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ప్రజలందరూ కలిసికట్టుగా నడవాలనే దానికి సంకేతంగా తాను ఊదారంగును ధరించానని హిల్లరీ క్లింటన్ అన్నారు. ఆమె తన భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కలిసి వేడుకకు విచ్చేశారు. ఇక, మిషెల్ ఆహార్యంపై ఫ్యాషన్ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఐక్యతకు సంకేతంగా మాత్రమే కాకుండా.. అమెరికాలో జరిగిన మహిళల ఓటు హక్కు ఉద్యమంతోనూ ఈ రంగుకు సంబంధం ఉంది. ఆ సమయంలో వాడిన జెండాలో దీనికి స్థానం ఉంది.
కాగా, అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతతో ఈ వేడుక జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం బైడెన్ ప్రసంగిస్తూ..అందరి అధ్యక్షునిగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
ట్రంప్ లేఖ..గొప్పగా ఉంది: బైడెన్
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్