close

తాజా వార్తలు

అతడే ట్రంప్‌ ఆయుధం..!  

 తన తురుపు ముక్క లేకుండానే వచ్చిన ట్రంప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ప్రత్యేకం

 ట్రంప్‌కు ఆయుధాలతో చేసే యుద్ధాలంటే అసలు ఇష్టం ఉండదు.. డబ్బు ఖర్చు.. కొత్త శత్రువులను కొని తెచ్చుకోవడం.. ప్రాణ నష్టం.. పైగా చిల్లిగవ్వ కూడా రాదు.. చేతిచమురు వదలడం తప్ప. 
అందుకే ఆఫ్గన్‌, ఇరాక్‌ల నుంచి బలగాల ఉపసంహరణకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడిపోయారు.. ఒకప్పుడు మిత్రులైన కుర్దులకు కూడా వెన్నుపోటు పొడిచి దళాలను ఉపసంహరించారు. 

  ట్రంప్‌ ఒక వ్యాపారవేత్త.. నష్టాల నుంచి కూడా ఫీనిక్స్‌ పక్షి వలే ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. బిజినెస్‌లో మజా ట్రంప్‌కు తెలిసినంతగా మరే నేతకు తెలియదేమో.. అందుకే వాణిజ్య యుద్ధాలకు తెరలేపారు. దీనికి తన ఆయుధంగా రాబర్ట్‌ లైట్‌జర్‌ అనే పెద్దమనిషిని పెట్టుకొన్నారు. 

ఎవరీ రాబర్ట్‌ లైటైజర్‌..?

72 ఏళ్ల వయసున్న లైటైజర్‌ అమెరికా వాణిజ్య వ్యవహారాల్లో తలపండిన వ్యక్తి. ఆయన న్యాయవిద్య పట్టా అందుకొన్నారు. ఆయన్ను తొలిసారి నాటి ఆర్కెన్‌ సెనెటర్‌ బాబ్‌ డోలే 1978లో సెనెట్‌ ఫైనాన్స్‌ కమిటీలో సభ్యుడిగా తీసుకొన్నారు. లైటైజర్‌ పనితీరుతో చాలా మంది పెద్దలను ఆకట్టుకొన్నారు. 1980 నాటికి ఆ కమిటీ స్టాఫ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. 1983లో రోనాల్డ్‌ రీగన్‌ ప్రభుత్వం వచ్చాక లైటైజర్‌ను డిప్యూటీ యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటీవ్‌గా నియమించారు. దీంతో అప్పట్లో దాదాపు 24 వాణిజ్య  ఒప్పందాల్లో అమెరికా తరఫున ఆయన చర్చలు జరిపారు. ముఖ్యంగా స్టీల్‌, ఆటోమొబైల్‌, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలే ఉన్నాయి. హార్లీ డేవిడ్‌సన్‌ కోసం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంపై జపాన్ నుంచి ఆటోమొబైల్‌, స్టీల్‌, సెమీకండెక్టర్ల దిగుమతులపై రీగన్‌ సర్కారు ఆంక్షలు విధించడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో ప్రముఖ న్యాయసేవల సంస్థ స్కాడ్డెన్‌లో దాదాపు 30ఏళ్లు పనిచేశారు. అమెరికా మార్కెట్ల విస్తరణకు, దేశీయ సంస్థల హక్కుల రక్షణ కోసం పనిచేశారు. ముఖ్యంగా అమెరికా స్టీల్‌ పరిశ్రమను లైటజర్‌ బాగా కాపాడరని చెప్పాలి.

వచ్చిన మూడు రోజుల్లోనే..

ట్రంప్‌ అధికారం చేపట్టగానే ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ చెయ్యగలిగే ఘటికుల కోసం వెతికి లైటైజర్‌ పేరును ప్రతిపాదించారు. సెనెట్‌ కూడా దీనికి 84-14 ఓట్లతో ఆమోదముద్ర వేసింది.  2017 మే 15వ తేదీన ప్రమాణం చేశారు. ఇక మిత్రదేశం.. శత్రుదేశం అంటూ ఎలాంటి తేడా చూపించకుండా ట్రంప్‌ అందరిపై వాణిజ్య ఆంక్షలు విధించారు. ‘మాతో వ్యాపారం కావాలంటే మాకేమిస్తారు.. మీరేం వదులుకుంటారు..’ ఇదే సూత్రం పాటించారు. అంతే చైనా.. ఐరోపా.. భారత్‌.. మెక్సికో.. కెనడా.. ఇలా ట్రంప్‌ దెబ్బకు చాలా దేశాలు అవస్థలు పడుతున్నాయి. మరోపక్క ఆఫీస్‌లోకి వచ్చీరాగానే లైటైజర్‌ వాణిజ్య ఒప్పందాల పునఃసమీక్ష మొదలుపెట్టారు. మూడ్రోజుల తర్వాత నార్త్‌అమెరికా ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ను పునః సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోలు తీవ్ర ఆందోళన చెందాయి. చివరికి అమెరికాకు అనుకూలంగా యూఎస్‌ఎంసీఏ ఒప్పందాన్ని చేసుకొన్నారు.

ఈ వాణిజ్య యుద్ధం దెబ్బకు చైనా కుదేలైపోయింది.. ఇంకా బెట్టు చేస్తే అభివృద్ధిని నేలపై కూర్చోపెడతాడీ ట్రంప్‌ అని భావించి చర్చలకు వచ్చింది. ఇక ట్రంప్‌ తన తురుపు ముక్క లైటైజర్‌ రంగంలోకి దింపారు. ఇక గేమ్‌ మొదలైంది.. దాదాపు ఏడాదికిపైగా ఎడతెగని చర్చలు జరిగాయి.. కొన్ని సందర్భాల్లో అర్ధంతరంగా ఆగిపోయాయి.. చివరికి బతుకు జీవుడా అనుకొంటూ చైనా మొన్న జనవరిలో వాణిజ్య  ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో అంశాలు అమెరికాకే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. ఇంకేముంది  అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ దీనినో ప్రధాన విజయంగా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు. ట్రంప్‌ కార్యవర్గంలో లైటైజర్‌ను అత్యంత శక్తిమంతమైన అధికారిగా భావిస్తారు. వాణిజ్య విధానాలను లైటైజరే ఎక్కువగా ప్రభావితం చేస్తారని అక్కడి మీడియా చెబుతుంటుంది. ట్రంప్‌ కార్యవర్గంలో భారీ సంఖ్యలో  కీలక అధికారులు రాజీనామాలు చేసి తప్పుకొంటున్నా.. లైటైజర్‌ మాత్రం అప్పటి నుంచి కొనసాగుతుండటం గమనార్హం. చైనా వాణిజ్య ఒప్పందం తర్వాత లైటైజర్‌ గురించి ట్రంప్‌ మాట్లాడుతూ ‘‘పాపం లైటైజర్‌ రేయింబవళ్లు నిద్ర మానుకోని ఈ ఒప్పందం కోసం కృషిచేశారు. చాలా స్మార్ట్‌, చాలా షార్ప్‌. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పగలను. నాకు అద్భుతమైన వ్యక్తి లభించాడు’’ అని పొగడ్తలతో ముంచెత్తారు. 

ఇప్పుడు భారత్‌తో..

తాజాగా భారత్‌ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదరుతుందని అంతా భావించారు. ఈ వాణిజ్య ఒప్పందంపై కూడా లైటైజర్‌ బృందమే చర్చలు జరుపుతోంది. కానీ, ట్రంప్‌ పర్యటనకు కొన్ని గంటల ముందు ప్రకటించిన అతిథుల జాబితాలో లైటైజర్‌ పేరులేదు. దీంతో వాణిజ్య ఒప్పందం ఇప్పటికైతే కుదరలేదని తేలిపోయింది.

ఒత్తిడి పెంచేందుకు..

భారత్‌పై ఒత్తిడి పెంచి దారిలోకి తెచ్చేందుకు పేద దేశాల జాబితా నుంచి భారత్‌ను గత ఏడాది అమెరికా ఏకపక్షంగా తొలగించింది. దీంతో జీఎస్‌పీ  కింద పొందే ప్రయోజనాల్ని భారత్‌ కోల్పోతోంది. పైపెచ్చు మన ఉక్కు, అల్యుమినియం ఎగుమతులపై అధిక పన్నుల్ని ట్రంప్‌ సర్కారు ఉపసంహరించట్లేదు. దీనికి నిరసనగా దాదాపు 28 అమెరికా ఉత్పత్తులపై మనదేశం కూడా గత ఏడాది జూన్‌లో సుంకాల్ని విధించింది. ఇందులో బాదం, యాపిల్స్‌ లాంటివీ ఉన్నాయి. భారత్‌తో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటున్నామని ట్రంప్‌ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మనదేశం ఈ చర్యకు దిగింది. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. వివాదాల్ని పరిష్కరించుకోడానికి భారత వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైటైజర్‌ మధ్య కొన్ని వారాలుగా ఫోన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఇవి కొలిక్కి వస్తేనే భారత్‌ ఎగుమతుల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. చూద్దాం.. ఈ అమెరికా బేరగాడు ఎలా స్పందిస్తారో..!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.