ప్రత్యేక ఆహారశుద్ధి మండలాలపై కార్యాచరణ
close

ప్రధానాంశాలు

ప్రత్యేక ఆహారశుద్ధి మండలాలపై కార్యాచరణ

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో  టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు
పరిశ్రమల స్థాపనకు ఆహ్వానం
పలు రాయితీలు, ప్రోత్సాహకాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆహారశుద్ధి మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కార్యాచరణ మొదలైంది. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థను (తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌... టీఎస్‌ఐఐసీ) నోడల్‌ ఏజెన్సీగా నియమించి భూసేకరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను ప్రారంభించిన టీఎస్‌ఐఐసీ మరోవైపు పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు, సంస్థలు, సంఘాలు, ఇతరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో తమ ప్రతిపాదనలను పంపాలని సూచించింది.
రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు గాను వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో జనావాసాలకు దూరంగా 250 ఎకరాలు అంతకంటే భారీ విస్తీర్ణంలో ఆహారశుద్ధి ప్రత్యేక మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కూరగాయలు, పండ్లు, ధాన్యం, నూనె మిల్లులు, పప్పులు, సుగంధద్రవ్యాలు, మత్య్స, మాంసం, కోళ్లు, బిస్కటు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటికి అవసరమైన భూసేకరణ జరపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఎంపిక చేసిన భూములను టీఎస్‌ఐఐసీ సంస్థ అభివృద్ధి చేస్తుంది. మౌలికసౌకర్యాలు కల్పిస్తుంది. కాలుష్య నివారణకు ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తుంది. అభివృద్ధి అనంతరం స్థలాలను పారిశ్రామిక సంస్థలకు కేటాయిస్తుంది. దీంతో పాటు ఒకే నమూనాలతో షెడ్లను నిర్మించి, అవసరమైన వారికి అందజేస్తుంది.
* దరఖాస్తుల ద్వారా అర్హులైన వారినే ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులను సర్కారు మంజూరు చేస్తుంది.
* అనుమతి పొందినవాటికి ఆహారశుద్ధి విధానం కింద రాయితీలు, ప్రోత్సాహకాలను అందజేస్తుంది. టీఐడియా, టీప్రైడ్‌ పథకాలను వర్తింపజేస్తుంది.
* ప్రతి ఆహారశుద్ధి కేంద్ర పరిధిలో ఒక పారిశ్రామిక స్థానిక ప్రాంత ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారానే వీటి నిర్వహణ ఉంటుంది.
దరఖాస్తులు ఇలా...
ఆసక్తిగల సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సంఘాలు టీఎస్‌ఐఐసీ.తెలంగాణ.జీవోవీ.ఇన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో రూ.10 లక్షల రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. ఎంపిక కాని వారికి సొమ్ము వాపసు చేస్తామంది. దరఖాస్తులో పేరు, సామాజిక వర్గం, చిరునామా, ఫోన్‌, ఈమెయిల్‌, ఆధార్‌తో పాటు కొత్త పరిశ్రమ లేక విస్తరణ, తరలింపు పరిశ్రమ వంటి సమాచారం ఇవ్వాలని సూచించింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని