Zika virus: కేరళలో 14 కేసులు.. ఏమిటీ జికా వైరస్?

తాజా వార్తలు

Updated : 09/07/2021 18:17 IST

Zika virus: కేరళలో 14 కేసులు.. ఏమిటీ జికా వైరస్?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకొంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసుల సంఖ్య 14కి చేరడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో తొలి జికా వైరస్‌ కేసును 24 ఏళ్ల వయసున్న గర్భిణిలో నిన్న వెలుగుచూసినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి మొత్తం 19శాంపిల్స్‌ను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)కు పంపగా.. మరో 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ ప్రకటించింది. ఈ వైరస్‌ని కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్టు మంత్రి తెలిపారు. మరోవైపు, కేరళలో జికా కేసులతో పక్క రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. డెంగీ తరహా లక్షణాలే ఉన్న ఈ వ్యాధిపై జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

అసలేమిటీ జికా వైరస్‌? 

జికా వ్యాధి జికా వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO)  ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.

ఎలా వ్యాపిస్తుంది? 

ఈ వైరస్‌ కలిగిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకూ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు మైక్రోసెఫాలి (తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారు.

లక్షణాలేంటి?

జ్వరం, చర్మంపై దద్దుర్లు; కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్‌ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలు కనబడతాయి.  

ఎలా నిర్ధారిస్తారు? చికిత్స ఏమిటి? 

ఈ వ్యాధిలో రక్త నమూనాలను రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌  (RT - PCR)  ద్వారా నిర్ధారించవచ్చు. జికా వ్యాధికి నిర్దిష్టమైన చికిత్సంటూ ఏమీలేదు. రోగి లక్షణాలను గమనించి వైద్యం అందిస్తారు. రోగులకు విశ్రాంతి అవసరం. వీరు ఎక్కువగా నీటిని తాగాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమల్‌ లాంటి ఔషధాలను ఇవ్వాలి. ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత రెండోసారి రాదు.

నివారణా చర్యలేంటి?

దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొడుగైన షర్ట్‌, ప్యాంట్‌ను ధరించాలి. ఎయిర్‌ కండిషన్‌, కిటికీలు ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమల తెరను వాడాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని