కరోనా పోవాలని కాళీమాతను ప్రార్థించా: మోదీ

తాజా వార్తలు

Published : 27/03/2021 11:16 IST

కరోనా పోవాలని కాళీమాతను ప్రార్థించా: మోదీ

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా షట్‌ఖిరా జిల్లాలోని ఈశ్వరీపూర్‌లో గల ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని మోదీ సందర్శించారు. శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన మోదీకి.. అక్కడి సిబ్బంది సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం కాళీమాతను దర్శించుకున్న ఆయన నేలపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. చేతితో తయారుచేసిన ప్రత్యేక బంగారు ముకుటాన్ని(కిరీటాన్ని) అమ్మవారికి అలంకరించారు.

‘‘నేడు ఈ శక్తిపీఠాన్ని దర్శించుకునే అదృష్టం లభించింది. కొవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని నేను కాళీమాతను ప్రార్థించాను’’ అని మోదీ తెలిపారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. భారత్‌, పొరుగు దేశాల్లోని 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న బంగ్లాదేశ్‌ వెళ్లారు. శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన కుమార్తెలయిన ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహానాలకు అందజేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని