
తాజా వార్తలు
నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా: మమత
నందిగ్రామ్: రానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రస్తుతం భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత సువేందు అధికారి పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానమైన నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘ నేను నందిగ్రామ్ నుంచి పోటీచేస్తాను. అది నాకు అదృష్టాన్నిచ్చే ప్రాంతం.’’ అని మమత సోమవారం జరిగిన ఓ ఎన్నికల సమావేశంలో తెలిపారు. భవానిపుర్ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు మమత వెల్లడించారు.
2007లో నందిగ్రామ్‌లో సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మరణించారు. ఈ సంఘటన అప్పటి వరకూ లెఫ్ట్ చేతిలో ఉన్న అధికారాన్ని తృణమూల్ కాంగ్రెస్‌కు వచ్చేలా చేసింది. ఆ సమయంలో మమత మా, మాటి, మనుష్ (అమ్మ, మట్టి, మనుషులు) నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాతి ఎన్నికల్లో టీఎంసీ విజయకేతనం ఎగరేసింది. సువేందు అధికారి కుటుంబానికి నందిగ్రామ్, జంగల్ మహల్ ప్రాంతంలో గట్టి పట్టుంది. ఆయన భాజపాలో చేరడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు దీదీ ఈ సారి నందిగ్రామ్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇవీ చదవండి..
భారత్-పాక్ సరిహద్దులో గణతంత్రవేడుకలు రద్దు
మహరాష్ట్రకు అంగుళం భూమి కూడా ఇవ్వం