అందరిలో ఒకడు కాదు.. అతనొక్కడు!

తాజా వార్తలు

Updated : 01/06/2021 11:04 IST

అందరిలో ఒకడు కాదు.. అతనొక్కడు!

సహనానికి మారుపేరు.. నిరీక్షణకు నిలువుటద్దం

152 మ్యాచ్‌లు.. 3176 పరుగులు.. ఒక శతకం, 16 అర్ధశతకాలు = 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు ఇవి చెప్పుకునేంత గొప్ప గణాంకాలేం కావు. అయినా అతడిని తక్కువ చేసి చూడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అతడు సహనానికి మారుపేరు. నిరీక్షణకు నిలువుటద్దం. అతడే టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌. 19 ఏళ్ల ప్రాయంలో జాతీయ జట్టులోకి వచ్చినా ఆటపై ఇష్టంతో ఇంకా కొనసాగుతున్నాడు. నేడు డీకే 36వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి ఆట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..


మైఖేల్‌ వాన్‌ మర్చిపోడు‌..

అది 2004 టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన. మూడు వన్డేల సిరీస్‌లో గంగూలీ సేన అప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు కోల్పోయి సిరీస్‌ ఓడిపోయింది. చివరగా మూడో వన్డేలోనైనా విజయం సాధించి వైట్‌వాష్‌ పరాభవాన్ని తప్పించుకోవాలని చూస్తోంది. కానీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 204 పరుగులే చేసింది. గంగూలీ(90), ద్రవిడ్‌ (52) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్‌ కూడా ఓడిపోతుందని అంతా అనుకున్నారు. అయితే, అలాంటి  పరిస్థితుల్లోనే డీకే మెరుపు స్టంపింగ్‌ చేశాడు. టీమ్ఇండియా విజయం సాధించింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌(74), ఆష్లే గైల్స్‌(39)తో కలిసి పోరాడాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 92 పరుగులు జోడించి మ్యాచ్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటవ్వడంతో భారత్‌ 23 పరుగులతో గెలిచింది. కాగా, ఇక్కడ చెప్పుకోవాల్సింది డీకే గురించే. హర్భజన్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లిన బంతిని మెరుపు వేగంతో అందుకొని డైవింగ్‌ చేస్తూ కార్తీక్‌.. వాన్‌ను స్టంపౌట్‌ చేశాడు. మ్యాచ్‌ విజయంలో అదే కీలక మలుపు. అలా తన తొలి వన్డేలోనే డీకే మెరుపు స్టంపింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇది రికార్డు శతకాల్లో ఒకటి..

2007 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆదిలోనే బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలై లీగ్‌ దశ నుంచే నిష్క్రమించిన సంగతి అందరికీ గుర్తున్నదే. ఆ తర్వాత భారత్‌ మే నెలలో అదే బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం ఆ దేశానికి వెళ్లింది. అప్పుడు తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టులో భారత్‌ 239 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక్కడ విశేషమేమిటంటే టీమ్‌ఇండియా తరఫున టాప్‌ నలుగురు బ్యాట్స్‌మెన్‌ శతకాలు చేయడం. అంతకుముందెన్నడూ అలాంటిది జరగలేదు. ఓపెనర్లు దినేశ్‌ కార్తీక్‌(129), వసీమ్‌ జాఫర్‌(138), రాహుల్‌ ద్రవిడ్‌(129), సచిన్‌ తెందూల్కర్‌(122) దంచికొట్టడంతో జట్టు స్కోర్‌ 610/3 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో డీకే సాధించిన ఏకైక శతకం ఇదే కావడం విశేషం. ఇక బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 118, రెండో ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేసి ఆలౌటవ్వగా భారత్‌ విజయం సాధించింది.


21 ఏళ్ల తర్వాత గెలిపించాడు..

ఇక 2007లో టీమ్‌ఇండియా మూడు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టు, మూడో టెస్టు డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. అది 21 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియాకు తొలి టెస్టు సిరీస్‌ విజయం. అయితే, ఇక్కడ కూడా చెప్పుకోవాల్సింది డీకే గురించే. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 43.83 సగటుతో మూడు అర్ధశతకాలు సాధించాడు. దాంతో మొత్తం 263 పరుగులు చేసి భారత్‌ తరఫున ఆ సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై అండర్సన్‌, సైడ్‌బాటమ్‌, ట్రెమ్‌లెట్‌, పనేసర్‌ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని అతనొక్కడే అనేలా నిలిచాడు. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేయగా భారత్‌ 481 పరుగులు చేసింది. డీకే(77), వసీమ్‌ జాఫర్‌(62), గంగూలీ(79) రాణించారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 355 పరుగులు చేయగా 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఒక్క సిక్స్‌తో ‘3D’ని కాపాడాడు..

ఇక 2018 నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో డీకే బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్‌ను టీమ్‌ఇండియా అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోరు. ఎందుకంటే డీకే చివరి బంతికి సిక్సర్‌ కొట్టి మరీ గెలిపించడమే కాకుండా ఒక రకంగా 3D ఆటగాడు విజయ్‌ శంకర్‌ను అభిమానుల ఆగ్రహం నుంచి కాపాడాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 166/8 స్కోర్‌ చేసింది. అయితే, ఛేదనలో భారత్‌ తడబడి ఓటమి అంచుల దాకా వెళ్లింది. కోహ్లీ లేని కారణంగా కెప్టెన్సీ చేసిన రోహిత్‌ శర్మ(56) అర్ధశతకంతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు ధావన్‌(10), రైనా(0), కేఎల్‌ రాహుల్‌ (24), మనీశ్‌ పాండే (28), విజయ్‌ శంకర్ ‌(17) విఫలమయ్యారు. అయితే, చివర్లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ గెలిచే అవకాశమున్నా విజయ్‌ పలు బంతులు వృథా చేయడంతో బంగ్లాదేశ్‌ తిరిగి పోటీలోకి వచ్చింది. దాంతో అభిమానులంతా అతడిపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో డీకే(29; 8 బంతుల్లో 2x4, 3x6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి బంతికి సిక్సర్‌ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.


నాలుగోసారి ప్రపంచకప్‌ ఆడినా..

17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో డీకే ఇప్పటివరకు నాలుగు ప్రపంచకప్‌లు చూశాడు. కానీ, ఆడింది మాత్రం కేవలం ఒక్కటే. అతడు జట్టులోకి వచ్చాక 2007, 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లు జరిగినా చివరికి 2019లో ఎంపికయ్యాడు. దాంతో అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించిన 15 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ పోటీలకు ఎంపికైన ఆటగాడిగా ప్రత్యేక స్థానం సంపాదించాడు. దీన్ని బట్టే అతడి ఓర్పు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే డీకే అందరిలో ఒకడు కాదు.. అతనొక్కడు!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని