గ్రాఫిక్‌ డిజైనర్‌గా...

Eenadu icon
By Features Desk Published : 30 Oct 2025 00:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బీకాం, గ్రాఫిక్‌ అండ్‌ వెబ్‌డిజైన్‌లో డిప్లొమా చేశాను. మూడేళ్లుగా గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు ఉండవంటున్నారు. ఇది నిజమేనా?

సూరజ్‌

గ్రాఫిక్‌ అండ్‌ వెబ్‌ డిజైన్‌ డిప్లొమా విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉండవు అనేది చాలావరకు నిజమే! ఈ రంగంలో ప్రభుత్వ శాఖల్లో శాశ్వత నియామకాలు అతి తక్కువగా ఉన్నప్పటికీ, కాంట్రాక్ట్, ప్రాజెక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రైవేటు రంగంలో మంచి భవిష్యత్తు ఉంది.

డిజిటల్‌ టెక్నాలజీ, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గ్రాఫిక్‌ డిజైన్‌ ఉపాధి కల్పించే రంగంగా మారింది.

ప్రభుత్వ శాఖలు ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి, పథకాలను ప్రచారం చేయడానికి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి పోస్టర్లు, బ్రోచర్లు, డిజిటల్‌ బోర్డులు, వీడియో గ్రాఫిక్స్‌ వంటి అనేక రూపాల్లో సమాచారాన్ని అందించడంలో గ్రాఫిక్‌ డిజైనర్లు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా సమాచార, ప్రచార శాఖలు, పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగాలు, ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టులు, పర్యాటక, విద్య, ఆరోగ్యశాఖలు గ్రాఫిక్‌ డిజైన్‌లో నైపుణ్యం ఉన్నవారిని నియమించుకుంటాయి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా ప్రైవేట్‌ రంగం, మీడియా సంస్థలు, స్టార్టప్స్, క్రియేటివ్‌ ఏజెన్సీల్లో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించండి. సరైన నైపుణ్యాలు, అనుభవం ఉంటే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా సులభంగా అవకాశాలు లభిస్తాయి. తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగాల ద్వారా కొంత అనుభవాన్ని పొంది, ఆ తర్వాత ప్రభుత్వ శాఖల్లో శాశ్వత కొలువుల కోసం ప్రయత్నించవచ్చు.

  • ప్రజా అవగాహన కార్యక్రమాల కోసం పోస్టర్లు, ప్రచార సామగ్రి తయారీలో గ్రాఫిక్‌ డిజైనర్ల అవసరం ఉంటుంది.
  • ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా పేజీల డిజైన్‌ కోసం కూడా గ్రాఫిక్‌ డిజైనర్లు అవసరం.
  • విశ్వవిద్యాలయాల్లో పోస్టర్లు, బ్రోచర్లు, వెబ్‌సైట్ల డిజైన్‌ కోసం డిజైన్‌ నిపుణుల అవసరం ఉంటుంది.
  • ఆరోగ్య, విద్య, పర్యాటక శాఖల్లో వివిధ పథకాల ప్రచారం కోసం కాంట్రాక్ట్‌ పద్ధతిలో గ్రాఫిక్‌ డిజైనర్లను తీసుకుంటారు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు