అలలపై తేలే వస్తువు చలనం.. రేఖీయ సరళ హరాత్మకం!

Eenadu icon
By Features Desk Published : 04 Nov 2025 00:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ఏపీపీఎస్సీ పరీక్షల ప్రత్యేకం
ఫిజిక్స్‌

ఒక వస్తువు స్థానంలో కాలంతోపాటు మార్పు సంభవించినట్లయితే దాన్ని చలనంగా భావించవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు కదులుతున్నప్పుడు రకరకాల చలనాలను గమనించవచ్చు. వీటిని ప్రధానంగా స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒక సరళరేఖ వెంటకాలం గడిచేకొద్దీ తన స్థానాన్ని మార్చుకుంటూ, ఒక వస్తువులో జరిగే చలనాన్ని ‘స్థానాంతర చలనం’ అంటారు ఒక వస్తువులోని కణాలన్నీ ఒక స్థిరమైన బిందువు/అక్షం ఆధారంగా వక్రమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు
అది పొందే చలనాన్ని భ్రమణ చలనం అంటారు.

డోలన చలనం

ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు. రెండు బిందువుల మధ్య ఒకే మార్గంలో ఒక వస్తువు ముందుకి, వెనక్కి కదులుతూ చేసే ఆవర్తన చలనాన్ని డోలన చలనం అంటారు.

  • డోలన చలనాలు అన్ని ఆవర్తన చలనాలే. కానీ ఆవర్తన చలనాలన్నీ డోలన చలనాలు కాదు.
  • వీణను మీటినప్పుడు తీగల చలనం, లోలక గడియారంలో డోలనాలు చేసే లోలకం, కుట్టు మిషన్‌లో సూది చేసే చలనం, చేతి గడియారంలో బ్యాలెన్స్‌ చక్రం చేసే చలనం, ఒక పదార్థంలోని పరమాణువులు చేసే చలనం అనేవి డోలన చలనం అవుతూ, ఆవర్తన చలనాలుగా కూడా ఉంటాయి.
  • సౌర కుటుంబంలో గ్రహాల చలనం, సమ వృత్తాకార చలనం చేసే ఇతర వస్తువులు ఆవర్తన చలనం అయి, డోలన చలనాలు కాని వాటికి ఉదాహరణలు.

ఉదా: స్పీకర్‌లోని పలుచటి పొర చేసే చలనం, ఇంజిన్‌లోని ముషలకం (పిస్టన్‌) కదలడం, లఘు లోలకం చేసే డోలనాలు, ఊగే ఊయల చేసే చలనం.

డోలన చలనాలు - రకాలు

యాంత్రిక డోలన చలనం: యంత్రాల్లో రేఖీయ స్థానభ్రంశం లేదా కోణీయ స్థానభ్రంశాన్ని చేస్తూ జరిగే చలనాలు.

యాంత్రికేతర డోలన చలనం: విద్యుత్‌ అయస్కాంత తరంగాల్లో విద్యుత్‌ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం చేసే చలనాలు, విద్యుత్‌ వలయాల్లో ఓల్టేజ్‌ చేసే డోలనాలు

  • ఆవర్తన చలనం చేస్తున్న ఒక వస్తువు మార్గంలో ఒకానొక బిందువు వద్ద సమతా స్థితిని కలిగి ఉంటుంది. అయితే ఆ బిందువు వద్ద ఎలాంటి ఫలిత బలం ఉండదు. సమతా స్థితి ఉన్న బిందువు వద్ద వస్తువును వదిలేస్తే అది ఎప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉంటుంది. 
  • సమతా స్థితిలో ఉన్న వస్తువుకు ఆ బిందువు దగ్గర నుంచి కొంత స్థానభ్రంశాన్ని కలిగిస్తే దాన్ని మరల సమతా స్థితికి తీసుకురావడానికి ఒక పునరుద్ధరణ బలం పని చేస్తుంది. ఆ ప్రయత్నంలో డోలనాలు ఏర్పడతాయి. 
  • పౌనఃపున్యం తక్కువగా ఉంటే డోలనాలు అని, ఎక్కువగా ఉంటే కంపనాలు అని వ్యవహరిస్తారు.
  • డోలన చలనంలో ఉన్న ఒక వస్తువుకు సమతా స్థితిని కలిగించే ఒక విరామ స్థానం ఉంటుంది. ఈ బిందువు వద్ద ఫలిత బలం శూన్యం. వస్తువు చేసే డోలనాలు నశించిన తర్వాత ఈ బిందువు వద్ద వస్తువు నిలకడగా ఉంటుంది. 
  • డోలనాలు చేసే సమయంలో వస్తువు రెండు గరిష్ఠ దూర బిందువుల మధ్య చలిస్తూ ఉంటుంది. ఈ రెండు బిందువుల వద్ద వస్తువును వెనక్కి లాగే బలం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి వస్తువు లిప్త కాలం పాటు ఆ బిందువుల వద్ద ఆగినట్లు అనిపిస్తుంది.
  • విరామ స్థానం నుంచి వస్తువును పక్కకు లాగి వదిలినప్పుడు దాన్ని విరామ స్థానానికి తీసుకురావడానికి ఒక బలభ్రామకం పనిచేస్తుంది. వస్తువు విరామ స్థానాన్ని చేరేటప్పటికి దాని వేగం గరిష్ఠంగా ఉంటుంది. గమన జడత్వం కారణంగా వస్తువు రెండో గరిష్ఠ బిందువు వరకు కొనసాగుతుంది. మరలా బలభ్రామకం కారణంగా వెనక్కి మళ్లుతుంది. ఇదేవిధంగా కొనసాగుతూ వస్తువు డోలన చలనాన్ని చేస్తుంది.

ఆవర్తన కాలం

ఆవర్తన చలనాన్ని పునరావృతం చేయడానికి పట్టే కనిష్ఠ సమయాన్ని ఆవర్తన కాలం (T) అంటారు. దీనికి SI ప్రమాణం సెకన్‌.

ఉదా: ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు చేసే చలనం - ఆవర్తన చలనం

  • ఒక అయస్కాంతాన్ని దారంతో వేలాడదీసి ఉత్తర దక్షిణ దిక్కుల నుంచి పక్కకు కదిలించినప్పుడు చేసే చలనం - ఆవర్తన చలనం.
  • ఒక విల్లు నుంచి బయటకు వదిలిన బాణం - ఆవర్తన చలనం కాదు
  • ఒక నది ఇవతలి గట్టు నుంచి అవతలి వైపునకు ఈదుకుంటూ వెళ్లి, తిరిగి ఇవతలి గట్టుకు చేరిన వ్యక్తి చేసే చలనం - ఇది కూడా ఆవర్తన చలనం కాదు. ఎందుకంటే ఇది ఆవర్తన కాలాన్ని పాటించదు.

సరళ హరాత్మక చలనం

ఒక వస్తువు స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉండి, సమతాస్థితి స్థానం వైపు పనిచేసే పునరుద్ధరణ బలం వల్ల కలిగే ఆవర్తన చలనాన్ని సరళ హరాత్మక చలనం అంటారు.
సరళ హరాత్మక చలనంలో ఉన్న వస్తువు సరళరేఖలో కదులుతూ దాని విరామ స్థానానికి అటుఇటుగా చలిస్తూ ఉంటుంది.
ఈ చలనంలో వస్తువు స్థానభ్రంశాన్ని ఎప్పుడూ విరామ స్థానం నుంచే కొలవాలి.
వస్తువు స్థానభ్రంశం ఎప్పుడు విరామ స్థానానికి వ్యతిరేక దిశలోనే ఉంటుంది.

స.హ.చ - నియమాలు

  • వస్తువు చలనం ఆవర్తన చలనమై ఉండాలి.
  • నియమిత విరామ స్థానానికి అటు ఇటుగా వస్తువు కదలాలి.
  • విరామ స్థానం నుంచి వస్తువు పొందే స్థానభ్రంశానికి త్వరణం అనులోమానుపాతంలో ఉండాలి.
  • వస్తువు త్వరణం, స్థానభ్రంశం ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో ఉండాలి.

రేఖీయ సరళ హరాత్మక చలనం: కొద్దిపాటి వ్యాప్తితో ఊయల చేసే చలనం.

  • కొద్దిపాటి వ్యాప్తితో లఘు లోలకం చేసే చలనం.
  • బరువు వేలాడదీసిన స్ప్రింగ్‌ చేసే చలనం.
  • శృతి దండం (ట్యూనింగ్‌ ఫోర్క్‌)లోని prongs చేసే చలనం.
  • నీటి అలలపై తేలియాడే వస్తువు చేసే చలనం.
  • ఒక యానకంలో యాంత్రిక తరంగం ప్రయాణించినప్పుడు ఆ యానక కణాలు చేసే చలనం.

కోణీయ సరళ హరాత్మక చలనం: సమ అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం చేసే డోలనాలు

చేతి గడియారంలోని బ్యాలెన్స్‌ చక్రం చేసే డోలనాలు.

రచయిత
వట్టిపల్లి కృష్ణ కిశోర్‌, విషయ నిపుణులు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని