పడవలతో రయ్‌.. రయ్‌..!

అమెరికాలో చిప్పేవా అనే సరస్సు ఒకటుంది. అందులో సహజసిద్ధంగా ఏర్పడిన ఐలాండ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే..

Updated : 09 Sep 2023 04:22 IST

అనగనగా ఒక చెరువు.. అందులో ఒక ఐలాండ్‌.. అది ఇతర వాటిల్లా కాదు.. గాలికి కదిలే ఐలాండ్‌.. ఏడాదికోసారి పడవలతో వెనక్కి నెట్టాల్సిన ఐలాండ్‌..  ‘అర్థం కావట్లేదా?’.. అయితే, ఆ వింతైన ఐలాండ్‌ గురించి మీరే తెలుసుకోండి మరి..!!

అమెరికాలో చిప్పేవా అనే సరస్సు ఒకటుంది. అందులో సహజసిద్ధంగా ఏర్పడిన ఐలాండ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. అది గాలి దిశను బట్టి తిరుగుతూ.. ఆ చెరువు మీదున్న వంతెనపైన రాకపోకలను అడ్డుకుంటుంది. దాంతో పదుల సంఖ్యలో పడవలను ఉపయోగించి, ఆ ఐలాండ్‌ను వంతెన నుంచి దూరంగా తరలిస్తారు.

కొంచెం కొంచెంగా..

చుట్టుపక్కల ప్రజల ఆహ్లాదం కోసం 1923లో కృత్రిమంగా చిప్పేవా సరస్సును నిర్మించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సరస్సు అడుగు భాగం నుంచి కుళ్లిపోయిన గడ్డి, మొక్కలు పైభాగానికి వచ్చి ఎండిపోసాగాయి. అలా కొన్నేళ్లపాటు కొంచెం కొంచెంగా సరస్సుపైన ఆ ఎండిన భాగం నలభై ఎకరాలకు విస్తరించింది. తర్వాత పెద్ద పెద్ద గాలుల వల్ల కొట్టుకొచ్చిన, పక్షులు తీసుకొచ్చిన రకరకాల విత్తనాలతో ఆ ప్రాంతంలో మొక్కలు మొలకెత్తాయి. కాలక్రమంలో ఆ ఎండిపోయిన భాగమంతా పచ్చని చెట్లతో ఐలాండ్‌లా మారిపోయింది.

చెట్ల వేర్లే కారణం..

ఆ కృత్రిమ ఐలాండ్‌లోని చెట్ల వేర్లు కిందున్న సరస్సులోకి చేరడంతో, గాలి వీచినప్పుడల్లా నీటి ప్రవాహంతోపాటు అవీ ఊగసాగాయి. అలా చెట్లన్నీ ఊగడంతో ఆ 40 ఎకరాల ఐలాండ్‌ కూడా కదలసాగింది. అది అలా తిరుగుతూ.. ఆ సరస్సు తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే వంతెనకు అడ్డుపడేది. దాంతో ఆ రెండు భూభాగాలను కలిపే ఏకైక వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయేవి. ఆహ్లాదం, ఇతర అవసరాల కోసం సరస్సు నిర్మిస్తే, కొత్త సమస్య వచ్చిపడిందేంటబ్బా?’ అని అక్కడివారంతా మొదట్లో బాధపడ్డారు.

ఏటా ఇదే తంతు..

కొన్ని రోజులకు, ఎలాగైనా ఆ ఐలాండ్‌ను వంతెనకు అడ్డు లేకుండా చూడాలని సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఒక నిర్ణయానికొచ్చారు. గాలి అనుకూలంగా ఉన్న సమయం చూసి.. దాదాపు 10 నుంచి 20 పెద్ద పెద్ద పడవలతో ఆ ఐలాండ్‌ను వంతెనకు దూరంగా నెట్టడం ప్రారంభించారు. అది ఏ ఒక్కసారికో పరిమితం కాలేదు నేస్తాలూ.. దాదాపుగా ఏడాదికోసారి ఆ కృత్రిమ ఐలాండ్‌ బ్రిడ్జి దగ్గరకు రావడం, వీళ్లంతా కలిసి పడవల సాయంతో దాన్ని దూరంగా నెట్టడం జరుగుతోంది. గతేడాది అయితే ఏకంగా 25 పడవలను ఉపయోగించారు. ఆ మార్గంలో ప్రయాణించే కొత్తవారెవరైనా ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారట. నేస్తాలూ..  ఈ ఐలాండ్‌ విశేషాలివీ.. భలే వింతగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు