ఇది విశేషాల పార్కు!

హాయ్‌ నేస్తాలూ.. మనకు ఏకాస్త సమయం దొరికినా ఎంచక్కా ఆడుకోవాలనుకుంటాం. మన ఊళ్లో ఎగ్జిబిషన్‌ పెడితే, ఎగిరి గంతేస్తాం. అదే సెలవు రోజైతే ఏదైనా పార్కుకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటాం.

Published : 14 Oct 2023 00:02 IST

హాయ్‌ నేస్తాలూ.. మనకు ఏకాస్త సమయం దొరికినా ఎంచక్కా ఆడుకోవాలనుకుంటాం. మన ఊళ్లో ఎగ్జిబిషన్‌ పెడితే, ఎగిరి గంతేస్తాం. అదే సెలవు రోజైతే ఏదైనా పార్కుకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటాం. అంతే కదా.. అయితే, ‘అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి పార్కు ఏది?’ అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..! ఇప్పుడు మనం ఆ విషయాన్నే తెలుసుకోబోతున్నాం..

ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్‌ పార్కు అమెరికాలో 1872లో ఏర్పాటు చేశారు. దాని పేరు ‘ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌’. ఎప్పుడో ఏర్పాటు చేసింది కదా.. తక్కువ స్థలంలో ఉండి, అందులోని సామగ్రి మొత్తం తుప్పుపట్టిపోయి ఉంటుందనుకోకండి ఫ్రెండ్స్‌.. దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో ఈ పార్కు విస్తరించి ఉంది. దీనికి మొత్తం అయిదు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వేసవిలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందట.  

వందలాది జలపాతాలు..

పార్కు అనగానే మన దగ్గర ఉండే జారుడు బల్లలూ, ఉయ్యాలలూ, వాటర్‌ గేమ్స్‌లాంటివి మాత్రమే అక్కడ ఉంటాయనుకోకండి. అది నేషనల్‌ పార్కు కాబట్టి.. దాదాపు 332 జాతులకు చెందిన పక్షులు, 16 జాతులకు చెందిన చేపలు, ఇంకా చాలా రకాల జంతువులు ఉన్నాయి. అలాగే 1100 రకాల సాధారణ చెట్లతోపాటు 400 రకాల అరుదైనవీ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో జలపాతాలకు లెక్కే లేదు.. సుమారు  రెండొందలకుపైగా ఉన్నాయట. ఎల్లోస్టోన్‌ పార్కు సముద్రమట్టానికి 3,463 మీటర్ల ఎత్తులో ఉంది.

అన్నీ అనుకూలిస్తేనే..  

ఇక్కడ వందలాది ప్రాచీన కట్టడాలు, పురాతన వస్తువులు, ఆనాటి వాహనాలనూ చూడొచ్చు. ఒక్కరోజులో పార్కు మొత్తాన్ని చూసేయలేం కాబట్టి పర్యాటకులు ఉండటానికి వసతులూ ఉన్నాయి. అలాగని, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడం కుదరదు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే, పార్కులోకి ప్రవేశం కల్పిస్తారట.

ఫౌంటెయిన్లు ప్రత్యేకం

ఇక్కడి భూమి లోపల ఉష్ణోగ్రతలు అధికమైనప్పుడు, లోపలున్న నీరు ఫౌంటెయిన్‌లా బయటకు చిమ్ముతోందట. దీన్నే ‘గీజర్‌’ అని పిలుస్తుంటారు. ఈ పార్కులో అటువంటివి దాదాపు 500 వరకు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అందులో అతిపెద్దది ‘ఫెయిత్‌ఫుల్‌ గీజర్‌’. అలా వేడి నీరు భూమిలోంచి ఎగజిమ్మడాన్ని చూసేందుకు చాలామంది వస్తుంటారట. పిల్లలూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్‌ పార్కు విశేషాలు భలే ఉన్నాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని