చూడచక్కని మంచు కుందేలు!

హాయ్‌ నేస్తాలూ! చిన్న పిల్లలమైన మనకు బుజ్జి బుజ్జి కుందేళ్లంటే చాలా ఇష్టం కదూ! అవి తింటున్నా.. గెంతుతున్నా చూడ్డానికి భలేగా ఉంటుంది కదా! అయితే ఈ రోజు మనం ఓ చూడచక్కని మంచు కుందేలు గురించి తెలుసుకుందాం సరేనా!

Published : 31 Mar 2024 00:18 IST

హాయ్‌ నేస్తాలూ! చిన్న పిల్లలమైన మనకు బుజ్జి బుజ్జి కుందేళ్లంటే చాలా ఇష్టం కదూ! అవి తింటున్నా.. గెంతుతున్నా చూడ్డానికి భలేగా ఉంటుంది కదా! అయితే ఈ రోజు మనం ఓ చూడచక్కని మంచు కుందేలు గురించి తెలుసుకుందాం సరేనా! అయితే ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్‌... చకచకా ఈ కథనం చదివేయండి.

చూడ్డానికి ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ కుందేలు పేరు.. స్నూ షూ రాబిట్‌. ఈ జాతి కుందేళ్లు ఉత్తర అమెరికాలో కనిపిస్తాయి. వీటి వెనక కాళ్ల పాదాలు మామూలు కుందేళ్లతో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటాయి. శీతాకాలంలో కురిసే మంచులో ఇవి కూరుకుపోకుండా, తేలిగ్గా గెంతేలా ఉండటం కోసమే ఈ ఏర్పాటన్నమాట. వీటికున్న పెద్ద పాదాల కారణంగానే వీటికి ‘స్నూ షూ రాబిట్స్‌’ అనే పేరు వచ్చింది. మరో విషయం ఏంటంటే చలి నుంచి రక్షించుకోవడానికి వీటి పాదాల మధ్యన ఒత్తైన వెంట్రుకలు కూడా ఉంటాయి.

రెండు రంగుల్లో...

విచిత్రంగా ఈ కుందేళ్లు శీతాకాలంలో తెలుపు రంగులో, వేసవికాలంలో గోధుమ వర్ణంలో కనిపిస్తాయి. ఈ ఏర్పాటే వీటిని శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో అయితే ఇవి పూర్తిగా మంచులో కలిసిపోయి, ఇతర జీవులను ఏమార్చుతాయి. వీటి చెవులు కూడా మిగతా కుందేళ్లతో పోల్చుకుంటే చిన్నగా ఉంటాయి. వేసవిలో గడ్డి, ఆకులను తిని తమ బుజ్జి బొజ్జను నింపుకొంటాయి. శీతాకాలంలో ఆహార లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చెట్ల కొమ్మలు, బెరడును తిని ప్రాణాలను కాపాడుకుంటాయి.

రాత్రి చురుకు..

ఈ స్నో షూ రాబిట్స్‌ పగటిపూట కంటే.. రాత్రివేళల్లోనే చురుకుగా ఉంటాయి. ఇవి 1.50 కేజీల వరకు బరువు తూగుతాయి. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. మగవి, ఆడవాటికంటే కాస్త చిన్నగా ఉంటాయి. వీటి జీవితకాలం దాదాపు ఆరు సంవత్సరాలు. నక్కలు, బాబ్‌క్యాట్స్‌, వీసెల్స్‌, మింక్స్‌, తోడేళ్లు, గుడ్లగూబలు, గోల్డెన్‌ ఈగల్స్‌, ఎలుగుబంట్లు ప్రధాన శత్రువులు. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, విపరీతమైన వేట వీటిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో రోజురోజుకూ వీటి జనాభా క్షీణిస్తోంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ స్నో షూ రాబిట్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని