Mantle Gereza: కోతిలాంటి జీవిని..!

హాయ్‌ నేస్తాలూ..! ‘చూడటానికి కోతిలా ఉంది.. కానీ దీని రంగేంటి.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది’ అనుకుంటున్నారు కదూ! నాకు తెలుసు.. మీరు అనుకున్నట్లు నేను కూడా కోతి జాతికి చెందిన జీవినే..  

Published : 29 May 2024 03:37 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘చూడటానికి కోతిలా ఉంది.. కానీ దీని రంగేంటి.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది’ అనుకుంటున్నారు కదూ! నాకు తెలుసు.. మీరు అనుకున్నట్లు నేను కూడా కోతి జాతికి చెందిన జీవినే.. ఆ విశేషాలు చెబుదామనే ఇలా వచ్చాను. వెంటనే కథనం చదివేయండి మరి..!

నా పేరు మాంట్లెడ్‌ గెరెజా. నన్ను కొలొబస్‌ గెరెజా అని కూడా పిలుస్తారు. కోతుల్లో ఒక రకమైన జాతికి చెందిన జీవిని. నా స్వస్థలం ఆఫ్రికా. గునియా, నైజీరియా, ఉగాండా వంటి దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాను. నా శరీరమంతా.. నలుపు రంగులో ఉంటుంది. ముఖం చుట్టూరా, వీపు మీద ఉన్న జుట్టు తెలుపు రంగులో ఉంటుంది. చూడటానికి నేను భలే వింతగా ఉంటాను తెలుసా..! నేను పుట్టినప్పుడు పూర్తిగా తెలుపు రంగులో ఉంటాను. 5 వారాలు గడిచిన తర్వాత నలుపు, తెలుపు రంగులోకి మారతాను.

చెట్లంటే ఇష్టం..!

నేను ఎక్కువగా గుంపుతో ఉండటానికే ఇష్టపడతాను. ఒక్కో గుంపులో దాదాపు 15 గెరెజాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే.. నేను చెట్ల మీద ఉండటానికే ఎక్కువ ఆసక్తి చూపుతాను. ఆహారం దొరకనప్పుడు మాత్రమే నేల మీదకు వచ్చి వెతుక్కుంటాను. నా జీవిత కాలంలో 50శాతం సమయాన్ని.. విశ్రాంతి తీసుకోవడానికి కేటాయిస్తాను. మిగతా సమయమంతా.. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి, వేటకు, తినడానికి ఉపయోగిస్తాను.

అదే నా ఆహారం..!

నేను పండ్లు, ఆకులు, వేర్లు, రకరకాల పువ్వులను ఆహారంగా తీసుకుంటాను. ఇతర జీవుల జోలికి అస్సలు వెళ్లను. వేటల వల్ల మా జనాభా చాలా తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా సంఖ్య 2000 మాత్రమే ఉందట. నా బరువు 7.8 నుంచి 13.5 కిలోలు ఉంటుంది. పొడవు 57.6 నుంచి 61 సెంటీ మీటర్లు. దాదాపు 29 ఏళ్ల వరకు జీవిస్తాను. నా విశేషాలు భలే ఉన్నాయి కదూ.. ఉంటా మరి బై.. బై..! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని