siva prasad: రికార్డు బ్రేకర్‌... శివ!

Eenadu icon
By Features Desk Published : 31 Oct 2025 01:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మీకు సైక్లింగ్‌ వచ్చా? మరి ట్రెక్కింగ్‌? ఇంకా.. శ్లోకాలు చెప్పడం లాంటివేమైనా..? ‘అంటే అవన్నీ రాకపోవచ్చుగానీ అలాంటిది ఏదో ఒకటి మాకూ వచ్చు’ అంటారు కదూ! కానీ అవన్నీ ఒక్కరే చేయడం.. అందులోనూ ఉత్తమ ప్రతిభ కనబరచడం సాధ్యమేనని నిరూపిస్తున్నాడీ నేస్తం..!

నిజామాబాద్‌కు చెందిన కొత్తకొండ శివప్రసాద్‌కు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. అమ్మ సుకన్య గృహిణి. నాన్న.. శక్తిప్రసాద్‌ ప్రైవేటు ఉద్యోగి. సాధారణంగా శివ వయసు పిల్లలంతా ఎంచక్కా రంగురంగు బొమ్మలతో ఆడుకుంటూ ఇల్లంతా హడావుడి చేస్తుంటారు. కానీ తను మాత్రం రికార్డులు సాధిస్తున్నాడు.. అది అల్లరి చేయడంలో కాదు నేస్తాలూ! తను అయిదున్నరేళ్ల వయసులోనే ఉత్తరాఖండ్‌లోని మౌంట్‌ చంద్రశిలను అధిరోహించాడు. దాని ఎత్తు 3810 మీటర్లు. అంతేకాదు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు అర్థాలను తెలుగు, ఆంగ్లంలో అలవోకగా చెబుతున్నాడు. మన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు గుక్కతిప్పుకోకుండా చెప్పగలడు. దీనితోపాటు ట్రెక్కింగ్‌కి రెండుసార్లు  ‘లండన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకున్నాడు. మన శివ గురించి చెప్పడం ఇంకా పూర్తవ్వలేదు నేస్తాలూ.. మనలో చాలామంది కాస్త దూరం నడవగానే అమ్మో నావల్ల కాదు అనేస్తారు. కానీ ఈ నేస్తం సైక్లింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. 28 నిమిషాల్లో 10కి.మీ. సైకిల్‌ తొక్కేసి అందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు. ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా శివ ఏ విషయాన్ని చెప్పినా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడట. బాగా చదువుకుని భవిష్యత్తులో ఐఏఎస్‌ అవ్వడమే తన లక్ష్యమట. మరి మనమూ తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!

ఆడెపు శ్యాంసుందర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు