జీవించు... నీ కోసమే

‘‘అక్కయ్యా, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా. ఎన్నేళ్ళయిందో నీ దగ్గర రెండు రోజులు ఉండి’’ ఉత్సాహంగా చెప్తున్న శశితో- ‘‘అవును కదా! మీ వసు కార్డు వేసి, ఫోన్‌ చేసి చెప్పింది... మరి మీ ఆయనో?’’ అడిగింది శశి అక్క ఉష.

Updated : 26 May 2024 08:27 IST

శ్రీపతి లలిత

‘‘అక్కయ్యా, మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా. నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా. ఎన్నేళ్ళయిందో నీ దగ్గర రెండు రోజులు ఉండి’’
ఉత్సాహంగా చెప్తున్న శశితో-
‘‘అవును కదా! మీ వసు కార్డు వేసి, ఫోన్‌ చేసి చెప్పింది... మరి మీ ఆయనో?’’ అడిగింది శశి అక్క ఉష.
‘‘ఆయన పెళ్ళివాళ్ళతో వస్తారు, పెళ్ళయ్యాక ఉండటం నాకు అవదు, మళ్ళీ వ్రతానికి హైదరాబాద్‌ వచ్చేయాలి కదా. అందుకే ముందే వద్దామని. స్టేషన్‌ నుంచి నేను వచ్చేస్తానులే, ఎవరూ రావద్దు’’
ఆగకుండా చెప్తున్న శశితో ‘‘అలాగే... రైలు ఎక్కగానే ఫోన్‌ చెయ్యి’’ అంటూ ఫోన్‌ పెట్టేసింది ఉష.
తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనంద పడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా ‘సరే’ అన్నదేమిటీ అనిపించినా అంత పట్టించుకోలేదు శశి.
శశి, ఉష అక్కాచెల్లెళ్ళు. ఉష భర్త సూర్యం- ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా రిటైర్‌ అయ్యారు. వైజాగ్‌ ‘లాసన్స్‌ బే’లో ఇల్లూ మంచి పెన్షనూ... పిల్లలు అమెరికాలో సెటిల్‌ అయ్యారు.
శశి భర్త చంద్రం- రాష్ట్ర ప్రభుత్వంలో మాములు స్థాయిలో చేసి రిటైర్‌ అయ్యాడు. శశి కూడా కాలక్షేపం కోసం దగ్గర్లో ఉన్న స్కూల్లో టీచర్‌గా చేరి, ప్రిన్సిపాల్‌గా రిటైర్‌ అయ్యింది. సైనిక్‌పురి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలు ఇద్దరూ హైదరాబాద్‌లోనే విడిగా ఉంటారు.
‘వసు’ అనబడే వసుంధర, శశి ఆడపడుచు. ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్‌లో జరుగుతోంది.
అక్క చెప్పినట్టే శశి ట్రైన్‌ ఎక్కేముందు ఫోన్‌ చేసి చెప్పింది. ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది.
శశి వెళ్ళేసరికి ఏడు అవుతోంది. ఆటో దిగుతుంటే ఉష చీపురు పట్టుకుని గుమ్మం దగ్గర చిమ్ముతోంది. చెల్లిని చూడగానే ప్రేమగా ‘‘రావే!’’ అంటూ లోపలికి పిలుచుకెళ్ళింది.
ఇంట్లో అడుగుపెడుతూనే దడుచుకుంది శశి.
హాల్లో సోఫాల నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి. మధ్యలో టీపాయ్‌ మీద న్యూస్‌పేపర్ల కుప్పలు, ఎక్కడ కూర్చోవాలో తెలీలేదు. తన బ్యాగ్‌ ఒక పక్కన పెట్టి, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే- అంతా మెతుకులూ చెత్తా.
అదేమీ పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి ‘‘కాఫీ పెడతాను’’ అంటూ ఉష ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్‌తో తుడిచి శశిని కూర్చోమంది. శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి, గబగబా బట్టలు మెషీన్‌లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది.
ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమే పనిమనిషి అనుకుంటారు. వెలిసిపోయిన చీరా వదులుగా వేళ్ళాడుతున్న జాకెట్టూ రేగిన జుట్టూ.
ఫ్రిజ్‌లో నుంచి కూరలు తీస్తూ ‘‘భోజనాలు త్వరగా చేద్దాం, టిఫిన్‌ చెయ్యను’’ అంటే- ఆకలిగా ఉన్నా శశి ‘సరే’ అని, ‘‘బావగారు ఎక్కడ?’’ అని అడిగింది.
‘‘వాకింగ్‌కి వెళ్ళి, అటునుంచి మా అపార్ట్‌మెంట్‌ దగ్గర ఏదో రిపేర్‌ ఉంటే చేయిస్తాను అన్నారు, ఓ గంటలో వస్తారు’’ అంది.
‘‘కూరలు నేను తరుగుతాను అక్కా, నువ్వు స్నానం చేసిరా’’ అంటూ శశి కూరలు అందుకుంది.
ఉష స్నానం చేసి వచ్చేలోగా పని అమ్మాయి వచ్చింది. ఇంక ఉష ఆమె వెనకాలే తిరుగుతూ, ‘ఇక్కడ తుడవలేదు, గిన్నెలు సరిగ్గా కడగలేదు’ అని ఒకటే నస.
‘‘నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ’’ అంటూ ఆ అమ్మాయి విరుపులు, విచిత్రంగా అనిపించింది శశికి.
ఆ అమ్మాయి వెళ్ళాక, సగం పని ఉషే చేస్తుంటే ‘‘ఎందుకు అక్కా, అన్నీ నువ్వు చేస్తావు? ఆ అమ్మాయి చేత చేయించు’’ అంది శశి.
‘‘వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి, మా ఇద్దరికీ ఏమంత పని? నాకూ ఏదో ఎక్సర్‌సైజ్‌ ఉండాలిగా’’ అంటూ వంట ముగించింది.

*             *            *

ఉన్న రెండురోజుల్లో శశి గమనించింది ఏమంటే- అక్క ప్రతి పైసా లెక్క చూడటం, ‘పెన్షన్‌ మీద బతకాలి’ అంటూ ఏది చౌకో అది తినడం... మంచి బట్టలు లోపలపెట్టి, పాతవి తీసి అవే కట్టడం... ఆఖరికి కారు తియ్యాలంటే పెట్రోల్‌ ఖర్చు అని- బావని బస్సులో తిరగమనడం... శశికి అనుమానం వచ్చింది. ‘నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా’ అనిపించింది.
అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది... ‘‘బావా, నేనడిగానని ఏమీ అనుకోకండీ, మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా?’’
‘‘నువ్వింకా అడగలేదేమిటీ అనుకున్నాను శశీ. దేముడి దయవల్ల మాకు ఇబ్బంది లేదు. నా పెన్షన్‌ దాదాపు లక్ష వస్తుంది. పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా, రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క. దాని అద్దెలు ఏభైవేలు వస్తాయి. కానీ, డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ‘ముందు ఇంకా అవసరం ఉంది’ అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు. ఇష్టమైనవి తింటూ హాయిగా కావాల్సిన చోట్లకి తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దామంటే వినదు. ఇంట్లో వంటమనిషినీ డ్రైవర్‌నీ పెట్టుకునే స్తోమత ఉంది కానీ, నన్ను బస్సులో తిరగమంటుంది. అన్ని పనులూ తను చెయ్యలేక చేస్తూ బాధపడుతుంది. ఏమి చెయ్యాలో తెలియడం లేదు’’ బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన.
పెళ్ళి హడావిడి అయ్యాక, శశి రెండు మూడుసార్లు, అక్కకి ఫోన్‌ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది.
ఉషకి కూడా ఇంట్లో చేసుకుని విసుగు వచ్చింది. పైగా సూర్యం కూడా ‘ఎక్కడికీ వెళ్ళక చాలా రోజులు అయింది, వెళ్దాం’ అనడంతో ఇద్దరూ హైదరాబాద్‌ వచ్చారు.

స్టేషన్‌లో శశి భర్త చంద్రం, వీళ్ళ కోసం ప్లాట్‌ఫామ్‌ మీద వేచి చూస్తున్నాడు.
వీళ్ళు రైలు దిగగానే ‘‘రండి, వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌, మీ చెల్లెలు మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తోంది’’ అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు.
ఉష అది చూసి ‘‘అయ్యో, మన సామాను’’ అంటూ కంగారు పడుతుంటే- చంద్రం నవ్వుతూ ‘‘మనవాడే వదినా, సాయి. మన డ్రైవర్‌’’ అన్నాడు.
‘‘డ్రైవరే’’ అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉష.
కారు ఇంటిముందు ఆగాక అందరూ దిగారు. కాలనీ అంతా చెట్లూ విశాలమైన రోడ్లూ నీట్‌గా ఉంది. శశి, చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది.
‘‘మేము మీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చాం, ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా?’’ అన్న సూర్యంతో-
‘‘ఏమీ లేదు అన్నగారూ, కాస్త రెగ్యులర్‌గా రిపేర్లు చేయించడం... అయిదేళ్ళకి ఒకసారి రంగులు వేయించడం, అంతే’’ అన్నాడు చంద్రం.
‘తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం’ అని ఉష ఆలోచిస్తే,
‘పదిహేను ఏళ్ళు అయింది, రిపేర్లు చేయించి కూడా చాలాకాలం’ అని గుర్తు వచ్చింది. ‘అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది’ అనుకుంది.
ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది. తక్కువ సామాను ఉన్నా, అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి.
సోఫాలూ వాటి మీద కుషన్లూ కిటికీలకు తెల్లటి కర్టెన్లూ వేసి, ఎక్కడా బూజూ దుమ్మూ లేకుండా నీట్‌గా ఉంది.
సాయి, సామానులు తీసుకొచ్చి ఒక బెడ్‌రూమ్‌లో పెట్టాడు. డైనింగ్‌ టేబుల్‌ మీద ప్లేట్లూ గ్లాసులూ అమర్చి ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న వాజ్‌లో ఇంట్లో పూసిన తెల్ల, ఎర్ర గన్నేరు పెట్టి ఉన్నాయి. ఇంట్లోంచి మంచి అగర్‌బత్తి పరిమళం వస్తోంది.

సెలెబ్రిటీల ఇంట్లో మనమూ ఉందామా!

‘‘ప్రయాణం బాగా జరిగిందా?’’ అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది.
అప్పటికే స్నానం చేసి, ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది. తల శుభ్రంగా దువ్వుకుని చిన్న క్లిప్‌ పెట్టుకుంది. పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టూ కింద చిన్న కుంకుమబొట్టూ ఉంది.
ఉషకి, తాను శశి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది.
‘‘అక్కా, ఫ్రెష్‌ అయ్యి రండి... టిఫిన్‌ రెడీగా ఉంది’’ అంది.
‘‘ఏకంగా స్నానం చేస్తాను’’ అని అంటే బాత్‌రూమ్‌ చూపించింది. లోపల శుభ్రమైన టవలూ కొత్త సబ్బూ కొత్త టూత్‌బ్రష్షూ పేస్టూ చిన్న నాప్కినూ అన్నీ ఉన్నాయి. బాత్‌రూమ్‌ కూడా మంచి ఫ్రెషనర్‌ వాసన వస్తూ మెరుస్తోంది.
ఉష, సూర్యం స్నానం చేసి తయారయ్యి వచ్చేసరికి టేబుల్‌ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు.
ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికీ ఆకలిగా ఉంది. శశి, చంద్రం కూడా కూర్చున్నారు. అందరూ కూర్చోగానే, ఒకామె 35-40 మధ్యలో ఉంటుంది- ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్‌ అన్నీ ప్లేట్లల్లో గిన్నెల్లో సర్ది పెట్టింది. చూస్తే పని అమ్మాయిలా లేదు. ‘ఎవరూ ఈ అమ్మాయి’ అని
అడగడానికి సంశయించి- ‘‘ఇంత పొద్దున్న హోటల్‌ నుంచి తెప్పించావా శశీ’’
ఆశ్చర్యంగా అడిగింది ఉష.
‘‘హోటలా! నా చెలికత్తె సువర్ణ ఉండగా, హోటల్‌ ఎందుకు దండగ’’ సినీ ఫక్కీలో అంది శశి. అందరూ నవ్వేశారు.
టిఫిన్‌ తిని లేచేలోగా, అందరికీ కాఫీ తీసుకు వచ్చింది సువర్ణ. వీళ్ళు కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ బల్ల అంతా సర్దింది.
ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్‌ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది.
సాయి వచ్చి ‘‘సార్‌ వెళ్ళనా?’’ అడిగాడు- చంద్రం, శశి వంక చూసి.
‘‘వెళ్ళు సాయీ. ఇవాళ ఇంక అవసరంలేదు, మేము రెస్ట్‌ తీసుకుంటాం’’ అన్నాడు.
అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో ‘‘సాయి, సువర్ణ భర్త, అతను ఆటో నడుపుతాడు. మాకు కావాలంటే కార్‌ డ్రైవింగ్‌కి వస్తాడు’’ అంది. సువర్ణ కూడా, ఒక గంటలో చకచకా అన్ని పనులూ చేసి, వండిన వంట అంతా, కంచాలూ గ్లాసులతో సహా బల్లమీద పెట్టి ‘‘అమ్మా, వెళతాను, సాయంత్రం త్వరగా వస్తాను’’ అంటూ వెళ్ళింది.
‘‘అన్ని పనులూ ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావ్‌?’’ నవ్వుతూ అడిగిన అక్కతో-
‘‘ముప్ఫై ఏళ్ళు ఇంట్లో పనీ స్కూల్‌ పిల్లల పనీ చేసి అలసిపోయాను అక్కా. ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్‌. నాకు నచ్చిన సినిమాలు చూస్తా, పుస్తకాలు
చదువుతా, ఫ్రెండ్స్‌తో మాట్లాడతా, నాకు నచ్చినట్టు ఉంటా.’’
‘‘మరి సువర్ణ అంత చేస్తోందిగా జీతం ఎక్కువ ఇస్తావా?’’ అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు.

 

*             *            *

‘‘సాయి, సువర్ణలకి ఇద్దరు పిల్లలు.
వాళ్ళు శశి స్టూడెంట్స్‌, చాలా బాగా చదువుతారు. మొదట, సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు, వాళ్ళకి ఈ స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంటు స్కూల్లో చదివేవాళ్ళు. శశి తన స్కూల్‌ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది.
ఆ ఫీజు కూడా శశే కట్టేది. ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్‌ చేసి విప్రోలో ఉద్యోగం, కొడుకు ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం. ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది. సువర్ణ జీతం వేరే- నెలకి పదివేలు’’ అన్నాడు.
కళ్ళు తేలేసింది ఉష. ‘‘పదివేలా!
మీ ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయా?’’ ఎగతాళిగా అడిగింది.
‘‘చెట్లకి ఏమి కాస్తున్నాయో చూశావా అక్కా... మా ఇంట్లో అన్ని కూరలూ పళ్ళూ కాస్తాయి. ఆ పని కూడా సువర్ణ చేస్తుంది. ఉదయం, ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులూ తానే చేస్తుంది. సరుకులు చూసుకుని కావాలంటే తేవడం, బట్టలు సర్ది అవసరమైనవి ఇస్త్రీకి ఇవ్వడం... ఒకటేమిటి, సమస్తం చేస్తుంది. మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే- వాళ్ళకి ఇష్టమని కారప్పూస, బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది. అసలు సువర్ణ ఒక్కపూట రాకపొతే నాకు గడవదు. ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం, పిల్లల పెళ్ళిళ్ళకీ పురుళ్ళకీ ఎంత చేసిందో చెప్పలేను.

సాయి ఆటో కొనుక్కున్నాడు. కానీ
మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. డబ్బులు అడగడు, ఇచ్చినా తీసుకోడు, అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంత’’ అంది శశి.
‘‘మరి మీకు వచ్చే పెన్షన్‌...’’ ఉష
నసుగుతుంటే-
‘‘మా ఇద్దరి పెన్షన్లూ కలిపినా బావగారి కంటే తక్కువే అక్కా. కానీ మాకు సరిపోతుంది. మేము పిల్లలని అడగం, వాళ్ళకి మేము ఇవ్వం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. మెడికల్‌ ఇన్సూరెన్సు ఉంది, రిటైర్‌ అయినప్పుడు వచ్చిన డబ్బులు
మా పేరు మీదే డిపాజిట్‌ చేశాం, ఎమర్జెన్సీకి ఉంటాయి. ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి.
దానధర్మాలు చేసినా, ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒకపూట తిండి, నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది.
మన ఇంట్లో పని చేస్తున్నవాళ్ళు కూడా పేదవాళ్ళే. సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి. దానికి తగ్గ ఫలితం మనం కళ్ళారా చూడవచ్చు, మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం? దానికి లిమిట్‌ ఏముంది? చదువు చెప్పించాము, వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది.’’
శశి చెప్పింది విని సూర్యం కూడా ‘‘నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశీ. ఎక్కడికో వెళ్ళి తెలీనివారికి సాయం చేసేకంటే, నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చెయ్యడం కరెక్ట్‌’’ అన్నాడు.
ఈ మాటలు విని ఉష ఆలోచనలో పడింది. శశికి కావాల్సింది కూడా అదే.
భోజనాలయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు. మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి, టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తోంది.
శశి వైజాగ్‌లో ఉన్న కాసేపు, తను ఇంటిపననీ వంట పననీ ఒక్క నిమిషం కూర్చుని కబుర్లు చెప్పకుండా, విసుగ్గా తిరిగిన విషయం గుర్తు వచ్చింది ఉషకి. అదే, శశి చక్కగా తమతో కూర్చుని స్థిమితంగా కబుర్లు చెప్తోంది.
సాయంత్రం స్నానాలు చేసి, బైట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురూ. సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది. సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే, దండ కట్టి అక్కకి ఇచ్చి తాను పెట్టుకుంది.
వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్‌ సైకిలు ఆగింది, ఒక అబ్బాయీ అమ్మాయీ లోపలికి వచ్చారు, ‘‘గుడ్‌ ఈవెనింగ్‌ టీచర్‌’’ అంటూ.
‘‘సువర్ణ పిల్లలు... జ్యోతి, దీపు’’ అంటూ పరిచయం చేసింది శశి.
దీపు అన్న అతను చంద్రం చెయ్యి పట్టుకుని పల్స్‌ చూస్తూ ‘‘మందు వేసుకున్నారా? బీపీ కొంచెం ఎక్కువగా ఉంది, చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్‌?’’ అంటూ శశి వంక చూశాడు.
‘‘పర్లేదులే దీపూ, ఒక రోజు తింటే ఏమీ అవదు మీ సారుకి, వదిలెయ్యి’’ అని,
‘‘ఈ మధ్య చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది, పిల్లలు దీపూకి అప్పచెప్పారు. తనేమో మరీ స్ట్రిక్ట్‌’’ నవ్వుతూ అంది శశి.
‘‘బల్ల మీద పకోడీలు ఉన్నాయి, ఇద్దరూ తినండి. దీపూ నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు, ఇంటికెళ్ళి శ్రద్ధగా చదువు’’ అన్న శశిని చూసి ‘‘అలాగే టీచర్‌’’ అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరూ.
ఇది అంతా వింతగా ఉంది ఉషకి.
‘‘ఇదేమిటి తల్లీ, ఆ కుటుంబం మొత్తాన్నీ నువ్వు దత్తత తీసుకున్నావా? ఈ రకంగా దోచి పెడుతున్నావు’’ అంది ఉష.
‘‘దీపూ ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది. సరిగ్గా సమయానికి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. లేకపోతే, తనకి పెరిగిన బీపీకి హార్ట్‌ఎటాక్‌ వచ్చేది. మా పిల్లలు ఇక్కడే ఉన్నా, వాళ్ళ ఆఫీస్‌ పనులు వాళ్ళవి. అదీకాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారని ధైర్యం.
మాకు కూడా పిల్లల దగ్గర ఆ హడావిడిలో ఉండేకంటే, ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. కుదిరినప్పుడు మేము వెళ్తాం,
వాళ్ళూ వస్తారు. ఓపిక ఉన్నంతవరకు ఇలా ఉంటేనే నయం.

*             *            *

నేను చెప్పానని బాధపడకుగానీ, మొన్న వచ్చినప్పుడు చూశాను, పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులూ నువ్వే చేసుకుని అలసిపోతున్నావు. మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు. ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ? నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పంచేయడమేగా.
మీకు కారులో తిరిగే స్తోమత ఉంది,
కానీ బావగారిని బస్‌లో వెళ్ళమంటావు. ఆయనకి కూడా వయసు పెరిగి, ఓపిక తగ్గలేదా? కూరలు ఇంటిపక్కనే పెద్ద షాప్‌లో రేటు ఎక్కువ అని మార్కెట్‌కి పంపుతావు. ఇద్దరికి ఎంత ఎక్కువ...
పక్క షాపువాడూ బతకాలిగా.
మీ పిల్లలు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్‌ వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు ఉన్నన్ని రోజులూ వాటిని చూస్తావు, తర్వాత ఎలాగూ అమ్మేసేదే.
ఆ మాత్రానికి- రిపేర్లూ అదీ ఇదీ అని నువ్వు ఎందుకు అంత హైరానాపడాలి.
కావాలంటే ఆ ఫ్లాట్‌లో నువ్వే ఉండు.
పెద్ద ఇల్లు... చేయలేము... అంటే అమ్మేయండి.

పూల్‌ మఖానా... పోషకాలు తెలిస్తే అస్సలువదలరు

రూపాయి, రూపాయి కూడబెట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చేకంటే, ఆ డబ్బుతో నువ్వూ బావగారూ హాయిగా సుఖపడండి, కావాల్సిన ప్రదేశాలకి తిరగండి, దానధర్మాలు చెయ్యండి. ఇలా అవసరమున్న పేద పిల్లలని చదివిస్తే పుణ్యం, పురుషార్థం.
నేను ఈమధ్య శ్రీ మహేష్‌ పాయి రాసిన ఒక వ్యాసం చదివాను... ‘ఇండియన్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఆర్‌ డైయింగ్‌ రిచ్‌,
బట్‌ నాట్‌ లివింగ్‌ రిచ్‌’ అని. దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్నా ఖర్చు పెట్టక, పేదగా బతికి, చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్టు తెలుస్తోంది.
ఆదా చేయడం, ఆస్తులు ఏర్పరుచుకోవడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాలకోసం దాచడం అవివేకం.
పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేయి, అది ఉంచుకుంటారా, అమ్ముకుంటారా
అనేది ఇంక వాళ్ళిష్టం. నువ్వు దానికి కాపలాదారుగా ఉండొద్దు. జీవించినంతకాలం హాయిగా ఉండు. నువ్వు తిను, నలుగురికి పెట్టు. ఎవరి సంతోషం కోసమో కాదు-
నీ తృప్తి, ఆనందంకోసం, నీకోసం జీవించు, నువ్వు కూడబెట్టిన డబ్బును నువ్వే అనుభవించు’’... ఆగి అక్క వంక చూసింది శశి- తను అంటున్నదానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ.
‘‘నిజమే శశీ, పిల్లలు కూడా ఇదే చెప్తారు, ‘మా సంపాదన మాకు చాలు, ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి’ అని, నిన్ను చూశాక నాకూ అనిపిస్తోంది... ‘వందకీ వెయ్యికీ లెక్క చూసుకుని కష్టపడటం నిజంగా అవసరమా’ అని.
ఒక్కసారిగా మారిపోవటం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలుపెడతాను’’ అన్న
ఉషని చూసి-
‘‘చంద్రం, ఇక్కడేదో పెద్ద మాల్‌ ఉందిట, రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలూ షూసూ కొని దారిలో హోటల్లో భోంచేసి...’’ అంటున్న సూర్యాన్ని
మధ్యలోనే ఆపి-
‘‘మొన్ననేగా ఒక షర్ట్‌ కొన్నారు, ఇప్పుడు అవసరమా’’ కోపంగా అంటున్న ఉషని బిత్తరపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక పకా నవ్వింది ఉష.
ఆమెతో జత కలిపారు అందరూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..