కోటి పనులున్నా...ఓటు తర్వాతే!

పనులుంటే వాయిదా వేసుకోండి. ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి. షాపింగ్‌ అయితే ఇంకో రోజు పెట్టుకోండి. కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి! దూరమైతే బండి తీయండి. దగ్గరైతే నడిచే వెళ్లండి. నలతగా ఉంటే మాత్ర వేసుకోండి. కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి!

Updated : 12 May 2024 08:59 IST

పనులుంటే వాయిదా వేసుకోండి. ప్రయాణాలుంటే రద్దు చేసుకోండి.
షాపింగ్‌ అయితే ఇంకో రోజు పెట్టుకోండి. కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి!

దూరమైతే బండి తీయండి. దగ్గరైతే నడిచే వెళ్లండి.
నలతగా ఉంటే మాత్ర వేసుకోండి. కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి!

ఓటరు ఐడీ దొరక్కపోతే.. ఆధార్‌ తీసుకెళ్లండి.
అదీ కనిపించకపోతే.. పాన్‌కార్డు జేబులో పెట్టుకోండి.
కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి!

దినఫలాలు తర్వాత చదవొచ్చు. వాట్సాప్‌ వీడియోలు వచ్చాక చూడొచ్చు.  
బ్రేక్‌ఫాస్ట్‌ గంటాగి చేయొచ్చు. కానీ, పొద్దున్నే వెళ్లి ఓటేయండి!

కోటి పనులున్నా ఓటు తర్వాతే. రాచకార్యాలైనా ఓటేసి వచ్చాకే. ఎన్నికల రోజు ‘అధికారిక సెలవు’ కాదు. అధికారం ఎవరికివ్వాలో, సెలవు ఏ పార్టీకి ప్రకటించాలో మనం నిర్ణయించుకునే రోజు. ఓ ఐదు నిమిషాలు వరుసలో నిలబడటానికి బద్ధకిస్తే, మొత్తంగా ప్రజాస్వామ్యమే వరుస తప్పుతుంది. ‘ఎందుకు ఓటెయ్యాలి?’ అని నోరు పారేసుకునే వాళ్లంతా, ఐదేళ్లూ నోరు మూసుకుని బతకాల్సి వస్తుంది. మనం ఓటేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ, మనం ఓడిపోతాం. ఆ పరిస్థితి రాకూడదు. ఓటుకు దూరం కాకూడదు. పోలింగ్‌ తేదీ గుర్తుంది కదూ. మే, 13.. రేపే!

చెరువు మాయమైంది. ఎవరి దాహం?
కొండ కరిగిపోయింది. ఎవరి స్వార్థం?
ఆనకట్ట కూలిపోయింది. ఎవరి అఘాయిత్యం?
రహదారి శిధిలమైంది. ఎవరి చేతివాటం?
భూకబ్జాలు పెరిగాయి. ఎవరి దురాశ?
గూండాయిజం పెట్రేగింది. ఎవరి అసుర ప్రవృత్తి?

భూతద్దం పట్టుకుని వెతకాల్సిన పన్లేదు. అంజనమేసి గాలించాల్సిన అవసరం లేదు. చిలక ప్రశ్నలూ గంటల పంచాంగాలతో సమయం వృథా చేసుకోవాల్సిన అగత్యమే లేదు. ఎదురుగా కనిపిస్తుంటారు. ఎదురులేదన్నట్టు రొమ్ము విరుచుకుని తిరుగుతుంటారు. వేదికల మీద దండలతో వెలిగిపోతుంటారు. చట్టసభల్లో మైకులు పట్టుకుని ఊగిపోతుంటారు. పదహారు బండ్ల కాన్వాయ్‌లో ఊరేగుతుంటారు. అధికార దర్పంతో చెలరేగుతుంటారు. ఐదేళ్ల కాలానికి అగ్రిమెంటు రాయించుకున్నట్టు.. ప్రతి టెండరూ వాళ్లకే. ఏ సెటిల్‌మెంట్‌ అయినా వాళ్ల కనుసన్నల్లోనే. నగదు బదిలీ అయితేనే బదిలీలు. కప్పం కడితేనే పోస్టింగులు. మేధావులంటే గౌరవం లేదు. న్యాయస్థానాల పట్ల నమ్మకం లేదు. జనాభిప్రాయానికి విలువే లేదు. మంచి చూడరు. మంచి వినరు. మంచి మాట్లాడరు. రెండురెళ్లు నాలుగన్నా .. జైళ్లు నోళ్లు తెరుచుకుంటాయి. బద్నాం చేయడానికి బాడుగ గొంతుకలు సిద్ధంగా ఉంటాయి. బూతులు తిడతారు. మెటికలు విరుస్తారు. బురద చల్లుతారు. విద్వేషాల వరద పారిస్తారు.  

మేక రూపం, పులి స్వభావం.
మెత్తని మాటలు, కత్తుల మూటలు.  
ఎవరు వీళ్లు? ఎక్కడి వాళ్లు?

ఆనందమే అందం

ఆకాశం నుంచేం ఊడిపడలేదు. పాతాళంలోంచేం పెల్లుబికి రాలేదు. మన నిర్లిప్తతలోంచి పుట్టుకొచ్చారు. మన నిర్లక్ష్యమే సోపానంగా ఎదిగిపోయారు. బలహీనమైన ఓటింగ్‌ శాతం వాళ్లను మరింత బలవంతుల్ని చేసింది. రాజకీయాలంటే అసహ్యమని కొందరు, అభ్యర్థుల పట్ల అపనమ్మకంతో కొందరు, పోలింగ్‌ కేంద్రాల వరకూ వెళ్లే ఓపికలేక కొందరు.. సగానికి సగం పౌరులు ఎన్నికల క్రతువులో పాల్గొనడం లేదు. మాట్లాడాల్సిన వాళ్లు మాట్లాడకపోతే డైనోసర్లు నోళ్లు తెరుస్తాయి. బుద్ధిజీవులు మేల్కొనకపోతే మూర్ఖులు చెలరేగిపోతారు. అదే జరుగు తోందిప్పుడు. మనం పాల్గొనని ఎన్నికల్లో, మనం వేయని ఓట్లతో.. ఎలాగోలా ఒడ్డున పడినవాళ్లు మన మీదే కర్రపెత్తనం చేస్తున్నారు. ఏటికేడాది వేళ్లూనుకుంటున్నారు. విషవృక్షంలా విస్తరిస్తున్నారు. అధికార మదంతో హూంకరిస్తున్నారు.

జరిగిన నష్టం చాలు.
భరించిన కష్టం చాలు.
బద్ధకాన్ని వదిలించుకుందాం.
బాధ్యతగా ఓటేద్దాం.

*   *   

‘నా ఒక్క ఓటు ఫలితాలను మారుస్తుందా?’ అని తేలిగ్గా తీసుకోవద్దు.
అవును. ఒక్క ఓటు ఫలితాలను మార్చిన దాఖలాలు అనేకం.
‘నేనొక్కడిని వెయ్యకపోతే కొంపలు మునుగుతాయా?’ అనుకోవద్దు.
నిజంగానే, కొంపలు మునుగుతాయి. ఆ మాటకొస్తే.. రాష్ట్రమూ, దేశమూ కూడా మునిగిపోతాయి.
‘నా ఒంటికి పాలిటిక్స్‌ పడవు’ అనే పలాయనవాదం వద్దు.
అయినా, ఇదేమైనా వంకాయ కూరా? పడకపోతే పళ్లెంలోంచి తీసి పడేయడానికి.
ఎన్నికలంటే.. నిన్నెవరు పాలించాలో నిర్ణయించుకోవడం. నువ్వెవర్ని వదిలించుకోవాలో తీర్మానించుకోవడం.

ప్రచారం నిషిద్ధం... ఓటుకు సిద్ధం!

పూర్వం కబంధుడనే రాక్షసుడు ఉండేవాడు. పచ్చని చెట్టు ముసుగులోని పరమ దుర్మార్గుడు అతను. మనిషి కనిపించడమే ఆలస్యం. ఆత్రంగా ఆలింగనం చేసుకునేవాడు. గబగబా ముద్దులు కురిపించేవాడు. అదంతా ప్రేమే అనుకునేవారు అమాయక జనం. ఆ భ్రమలోంచి తేరుకునేలోపే.. అసురుడి చేతులు విచ్చుకునేవి. ఇనుప గొలుసులై బంధించేవి. ఊపిరాడక, ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయేవారు సామాన్యులు. ఆ కబంధ సంతతి కలియుగంలోనూ కొనసాగుతోంది. రాజకీయాలను ఏలేస్తోంది. ఓటర్లను మోసగిస్తోంది. ‘పాలకుడంటే బలహీనులకు బలం’ అంటాడు చాణక్యుడు. కానీ, ఇలాంటి నాయకులు.. తమ నియంతృత్వ ధోరణితో బలహీనుల్ని మరింత బలహీనంగా మారుస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని అవ్యవస్థను సృష్టిస్తున్నారు. ఆ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే.. ఒకటే మార్గం. ఏ ఓటరూ ప్రజాస్వామ్య యజ్ఞానికి దూరంగా ఉండకూడదు. ఏ ఓటూ వృథాగా మురిగిపోకూడదు. ఏ ఎడమచేతి చూపుడు వేలూ సిరా చుక్క లేకుండా చిన్నబోకూడదు.  

ఓటు.. రెండువైపులా పదునుదేలిన కత్తి.
మంచిని గెలిపిస్తుంది. చెడును ఓడిస్తుంది.
ఆయుధం సిద్ధం. మీదే ఆలస్యం.

*   *   

మధ్యతరగతి ఓ వింత వలయంలో చిక్కుకుపోయింది. అవకాశాల వెంట పరుగులు తీస్తోంది. సంపాదనే సర్వస్వమన్నట్టు బతికేస్తోంది. చకచకా కార్పొరేట్‌ నిచ్చెనలు ఎక్కేయాలని ఆరాటపడుతోంది. ఎదిగే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. కానీ, ఆ పరుగులో పడిపోయి సామాజిక బాధ్యతను మరువకూడదు. ఓటు హక్కును విస్మరించకూడదు. చాలా సందర్భాల్లో మధ్యతరగతి కాలనీల్లో ఓటింగ్‌ సందడే కనిపించదు. గేటెడ్‌ కమ్యూనిటీల గేట్లు ఓ పట్టాన తెరుచుకోవు. కాబట్టే, మహానగరాల్లో పోలింగ్‌ యాభై శాతానికి మించదు. ఈ నిర్లక్ష్యం, నిర్లిప్తతల కారణంగా ఏ అనర్హుడో అందలమెక్కుతాడు. అందినకాడికి దండుకుంటాడు. అందులోనూ.. ఎదిరించే శక్తి కానీ, నిలువరించే సామర్థ్యం కానీ లేని మిడిల్‌క్లాస్‌ను లక్ష్యంగా చేసుకుంటాడు. చిట్టీలు వేసో, పొట్ట కట్టుకునో కొనిపెట్టుకున్న జాగాలను నిర్లజ్జగా కబ్జా చేస్తాడు. ఇక, బతికినంత కాలం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. బిల్డర్లను గుప్పిట్లో పెట్టుకుని అపార్ట్‌మెంట్ల ధరలు అమాంతం పెంచేస్తాడు. పాతికేళ్లలో తీరాల్సిన బ్యాంకు రుణం ముప్పై ఏళ్లయినా ముప్పు తిప్పలు పెడుతూనే ఉంటుంది. ఆ అరాచకం అక్కడితో ఆగదు. పార్టీ ఫండ్‌ కోసం, ఎన్నికల ఖర్చుల కోసం కార్పొరేట్‌ కంపెనీలకూ రేట్లు ఫిక్స్‌ చేస్తాడు. కాదంటే కష్టాలు మొదలవుతాయి. ఇవ్వడం అలవాటు చేస్తే.. లాభాల్లో వాటాల వరకూ వెళ్తుంది వ్యవహారం. ఆ ఒత్తిడిని భరించలేక.. దుకాణం సర్దేసి.. మరో నగరానికో, దేశానికో వెళ్లిపోతాయా సంస్థలు. ఆ దెబ్బ నేరుగా మధ్యతరగతి మీదే పడుతుంది. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. కొత్త కొలువులు వెతుక్కోవాలి. ఇదంతా ఓటును చులకన చేసిన ఫలితమే. చేజేతులా ఎన్నికల్ని దూరం చేసుకున్న ప్రభావమే.

రాశిఫలం (మే 12 - మే 18)

అయినా.. శివార్లలో స్థలాలు కొన్నంతమాత్రానో, ఖరీదైన కాలనీలో ఇల్లు కట్టినంత మాత్రానో, బీరువాల నిండా వెండి-బంగారాలు దాచిపెట్టినంత మాత్రానో .. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చినట్టు కాదు. వాళ్లకంటూ ఓ సురక్షితమైన సమాజాన్ని నిర్మించి ఇవ్వాలి.

ఆ కట్టడానికి పునాది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఆ ఓటును విజన్‌ ఉన్న నేతకే వేయాలి. అనుభవ సంపన్నుడినే గెలిపించుకోవాలి.

నాయకుడంటే కూల్చేవాడు కాదు, కట్టేవాడు. అది సకల సౌకర్యాలతో విలసిల్లే.. రాజధాని కావచ్చు. వేలాది కొలువులకు నెలవైన సాంకేతిక నగరీ కావచ్చు.

నాయకుడంటే ఉద్వేగాలతో విద్వేషాలు ఎగదోసేవాడు కాదు. ఉద్యమస్ఫూర్తితో భవితకు బాటలు వేసేవాడు. పరిశ్రమలు తెచ్చేవాడు. ప్రపంచ పాలకుల దృష్టిని ఆకర్షించేవాడు.

మన నాయకుడే మన బ్రాండ్‌ అంబాసిడర్‌.
నేర చరిత్ర ఉన్నవాడు కావాలా?
కొత్త చరిత్ర సృష్టించేవాడు రావాలా?  

*   *   

‘ఊళ్లో ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా?’ అని ఎవరైనా అడిగితే.. ‘ఓ ఆస్తి ఉంది. కావాలంటే చూడండి’ అంటూ జేబులోంచి ఓటరు ఐడీ తీసేవారు ఎంతోమంది.

సొంతూరి ఓటర్‌ లిస్ట్‌లో పేరుంటేనే పక్కా లోకల్‌ అయినట్టు. పల్లెతో అనుబంధం ఉన్నట్టు. ఆ ఒక్క కారణంతోనే.. ఫలానా జిల్లా, ఫలానా గ్రామానికి చెందిన ఓటరుగా కొనసాగాలనుకుంటారు. హైదరాబాద్‌, బెంగళూరు, పుణె.. కర్మభూమి ఏదైనా, ఓటు హక్కు మాత్రం జన్మభూమిలోనే. ఏటా కూటి కోసం, కూలి కోసం పట్టణాలకు ప్రయాణం కట్టే గ్రామీణుల సంఖ్యా తక్కువేం కాదు. ఆ వలస ఓటర్లంతా సొంతూళ్లకు వెళ్లిరావాల్సిన సమయం రానేవచ్చింది. ఏ కారణంగా ప్రయాణం రద్దు చేసుకున్నా..

ఓటు వృథాగా పోతుంది. పరోక్షంగా, సమర్థుడిని ఓడిస్తుంది.
ఓటు దుర్వినియోగం అవుతుంది. ప్రత్యక్షంగా, అసమర్థుడిని గెలిపిస్తుంది.

ఈ రెండు తప్పులూ ప్రజాస్వామ్యానికి పెనుముప్పులే.
ఆరునూరైనా ఓటు యాత్రకు బయల్దేరాల్సిందే.
‘దొరికితే రైలు.. దొరక్కపోతే బస్సు..
తప్పకపోతే బైకు.. తప్పనిసరైతే కారు..

ఏదో ఒక వాహనం ఎక్కేయండి. తెల్లారేలోపు ఊళ్లో వాలిపోండి. వీలైతే ఓ పూట ముందే చేరుకోండి.

పల్లె పరిస్థితుల్ని వాకబు చేయండి. స్థానిక రాజకీయాల్ని బేరీజు వేసుకోండి. పచ్చని గ్రామంలో చిచ్చు రేపిందెవరో, ప్రకృతి విధ్వంసానికి మూలాలెక్కడో నిగ్గుతేల్చండి. భూమి తల్లికి గర్భస్రావం చేసి మరీ.. ఇసుక నుంచి ఇనుము దాకా సర్వం తోడేస్తున్న తోడేళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకోండి. ఐదేళ్లలో కరెంటు చార్జీలు ఎన్నిసార్లు పెరిగాయో లెక్క తీయించండి. ఆల్కహాల్‌ పేరుతో సీసాలకొద్దీ హాలాహలాన్ని అంటగడుతున్నదెవరో బట్టబయలు చేయండి. పంచభూతాలనూ వాటాలేసుకుని పంచుకున్న రాజకీయ దళారుల కళ్లు.. సామాన్యుల భూముల మీదా పడుతున్నాయి. పేదలనే కనికరం లేకుండా.. ఎకరమూ, అరెకరమూ సైతం వదలకుండా మింగేస్తామంటున్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్ళే అవకాశమూ లేకుండా చేస్తామంటున్నారు. అదే జరిగితే.. రైతుల నోట్లో మట్టే. బతుకులు బజారున పడినట్టే. చట్టాల ముసుగులో జరుగుతున్న ఈ సర్కారీ దోపిడిని అడ్డుకోండి. సమగ్ర సత్యశోధన తర్వాతే, మీ తీర్పును ఇవ్వండి. ఎవరో సమకూర్చే వాహనం ఎక్కొద్దు. ఎవరో అందించే అతిథి మర్యాదలకు ఆశపడొద్దు. గ్రామదేవత జాతరకు వెళ్లినంత ఇష్టంగా, ఇలవేల్పు ఉత్సవాల్లో పాల్గొన్నంత భక్తిగా, ఆత్మీయుల పెళ్లికి హాజరైనంత బాధ్యతగా ఓటు యజ్ఞంలో పాల్గొనండి.

ఓటు దారి తప్పితే.. గ్రామం పట్టుతప్పుతుంది. అదే అవకాశంగా నాయకులు పావులు కదుపుతారు. మనుషుల్ని విభజిస్తారు. విద్వేషాల్ని రగిలిస్తారు. ప్రేమలు ఉప్పొంగిన చోటే రక్తం పారుతుంది. ఊరు వల్లకాడు అవుతుంది.  

మీ పల్లెను బతికించుకోవాలంటే మీ ఓటును వినియోగించుకోవాల్సిందే.

*   *   

తొలిసారి ఓటేస్తున్న నవతరానికి... హృదయపూర్వక అభినందనలు!

సెల్‌ఫోన్‌తో ఫొటో తీస్తున్నప్పుడు కూడా.. హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ అంత ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తారే. బ్రేక్‌ఫాస్ట్‌కు ఆర్డర్‌ ఇస్తున్నప్పుడు సైతం ఫుడ్‌ సైంటిస్ట్‌లా మెనూను లోతుగా పరిశోధిస్తారే. ఒక్క టీషర్ట్‌ కొనాలన్నా.. చుట్టుపక్కల మాల్స్‌ అన్నీ చుట్టేసి వస్తారే. ఓటంటే మాత్రం ఎందుకంత చిన్నచూపు. ‘నో పాలిటిక్స్‌ ప్లీజ్‌’ అని మాత్రం అనొద్దు. రాజకీయాలు వైఫై నెట్‌వర్క్‌ లాంటివి. మన చుట్టూతా తిరుగుతుంటాయి. ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేం. పిక్చర్‌ ఎడిటర్‌, మూవీ ఎడిటర్‌, గ్రాఫిక్‌ ఎడిటర్‌.. రోజూ రకరకాల టూల్స్‌ ఉపయోగిస్తారు కదూ! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లు కూడా అలాంటి ఓ టూలే! ఆ అప్లికేషన్‌తో మీ నియోజకవర్గ ప్రతినిధికి ఓటేస్తారు. అతను రేపు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రీ కావచ్చు.

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమైతే.. ఏ నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించేది అతనే. లీకేజీలు లేకుండా పరీక్షలు జరపాలన్నా, ప్రలోభాలకు అతీతంగా నియామకాలు జరగాలన్నా.. నిజాయతీపరుడినే గెలిపించుకోవాలి. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మీ కల అయితే.. మీ స్టార్టప్‌కు అనుమతులూ రాయితీలూ ప్రసాదించేదీ అతనే.

లంచాలతో పన్లేకుండా పర్మిషన్లు రావాలన్నా, కమీషన్లు ఇవ్వకుండానే సబ్సిడీలు అందాలన్నా సమర్థుడినే పీఠం ఎక్కించాలి.

మీ ఓటు పైపైకి ఓ నియోజకవర్గానికి పరిమితమైనట్టు కనిపించినా, అంతిమంగా దేశాన్నంతా ప్రభావితం చేస్తుంది.

అసెంబ్లీ ఎన్నికలైతే.. మనం గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు. శాసనసభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటాడు. మూడోవంతు ఎమ్మెల్సీలను శాసనమండలికి పంపుతాడు. రాజ్యసభ సభ్యులనూ రాష్ట్రపతినీ ఎన్నుకుంటాడు. పార్లమెంటు ఎన్నికలైతే.. మనం ఓటేసిన ఎంపీ దేశ ప్రధానికి ఎన్నుకుంటాడు. లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటాడు. రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతుల ఎన్నికలో పాల్గొంటాడు. అలా మన ఓటు.. జాతీయ రాజకీయాలనూ శాసిస్తుంది,

నాలుగు ఆఫర్‌ లెటర్లు చేతిలో ఉన్నప్పుడు, అందులోంచి అత్యుత్తమ కంపెనీనే ఎంచు కున్నట్టు.. నలుగురైదుగురు అభ్యర్థుల్లోంచి తిరుగులేని నాయకుడినే ఎన్నుకోండి. సిస్టమ్‌లోని మాల్‌వేర్‌ను డిలీట్‌ చేసినంత నేర్పుగా అసమర్థులను ఓడగొట్టండి.

ఓటు.. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించడానికి పాస్‌వర్డ్‌. సరైన వ్యక్తికే ఇవ్వాలి.
ఎలక్షన్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్‌ ఈవెంట్‌. తప్పక పాల్గొనాలి.
ఓటింగ్‌.. క్రికెట్‌ను తలదన్నే ఉత్కంఠభరితమైన పోరు.
ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదు. ఆటగాడిగా దుమ్మురేపాలి.
పోలింగ్‌ పర్సెంటేజీని శతకానికి చేరువ చేయాలి.
మంచిని గెలిపించే ప్రతి ఓటరూ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచే!

ఓటు మీకొక వరం. వదులుకోవద్దు.
ఓటు మీదైన స్వరం. మౌనంగా ఉండొద్దు.

*   *   

మండుటెండ మనిషిని వణికిస్తుంది. ఒళ్లంతా చెమటలు పట్టిస్తుంది. సత్తువనంతా లాగేస్తుంది. వడదెబ్బకు గురిచేస్తుంది. అంతే, అంతకు మించి ఏమీ చేయలేదు. అదే అవినీతిపరుడి దెబ్బ.. వేయి వడదెబ్బలకు సమానం. పొరపాటున గెలిచాడా.. ఐదేళ్లూ ఆ ప్రాంతం నిప్పుల కొలిమే. అరాచకం నీటి కరవులా బతుకుల్ని ఎండగొడుతుంది. దోపిడి డీహైడ్రేషన్‌లా వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఎండకు రోళ్లు పగిలినట్టు.. తలకాయలు తెగుతాయి. ఆ భగభగలపై.. బాధ్యత కలిగిన పౌరుడి వారుణాస్త్రం - ఓటు హక్కు.

ఆ ఓటే.. కరవాలమై
అసమర్థులను గద్దె దించుతుంది.
ముత్యాల సరమై
సమర్థుల మెడను అలంకరిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..