నీలాల నింగికి పచ్చలహారం..!

‘ఎత్తైన కొండలూ పరుగులు తీసే నీలిమబ్బులూ పచ్చని తేయాకు తోటలూ జాలువారే తెల్లని జలపాతాలూ...

Updated : 12 May 2024 09:27 IST

‘ఎత్తైన కొండలూ పరుగులు తీసే నీలిమబ్బులూ పచ్చని తేయాకు తోటలూ జాలువారే తెల్లని జలపాతాలూ... ఎటు చూసినా ప్రకృతి సౌందర్యంతో పలకరించే మున్నార్‌ను ఒక్కసారయినా చూడాల్సిందే...’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన శాంతిశ్రీ బెనర్జీ.

క వారం రోజులైనా పచ్చని ప్రకృతిలో గడపాలనుకుంటూ నెట్‌లో ఎన్నో ప్రాంతాలను పరిశీలించి మున్నార్‌ను ఎంపిక చేసుకున్నాం. ముందుగా ఫ్లయిట్‌లో మదురైకి చేరుకున్నాం. అక్కణ్ణుంచి మున్నార్‌ వెళ్లడానికి నాలుగు గంటలు పడుతుందని ట్యాక్సీ మాట్లాడుకున్నాం. కొండలమీదకి వెళ్లేసరికే కాస్త చీకటిపడింది. లేదంటే ఆ ప్రయాణాన్ని మరింత ఆనందించే వాళ్లం. అక్కడికీ పశ్చిమ కనుమల అందాల్ని మిస్‌ కాకూడదని ఆ సంజె చీకట్లలోనే కళ్లు విప్పార్చుకుని చూశాం. ఎత్తైన కొండలూ లోయలూ దట్టమైన అడవులూ వాటిమీద తెలుపూ నీలం రంగుల్లో తేలియాడే మబ్బులతో అలరారే ఆ ప్రదేశం ఎంతో ఆకట్టుకుంది. దారిపొడవునా పచ్చని కొండల మీదుగా వీచే చల్లనిగాలి మమ్మల్ని మరోలోకంలో విహరించేలా చేసింది.
గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదుగా 1600 కి.మీ.మేర విస్తరించిన ఈ పశ్చిమ కనుమల అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అందుకే యునెస్కో సైతం వారసత్వ సంపద జాబితాలోకి చేర్చింది. చీకటి పడుతుండగా తమిళనాడును దాటుకుని కేరళలోకి ప్రవేశించాం. అప్పటికే ఆలస్యం కావడం... డ్రైవర్‌ వేగంగా పోనివ్వడంతో అంత అందమైన ప్రకృతిలోనూ భయమేసింది. కొండ మలుపులకి కడుపులో తిప్పినట్లయింది. మున్నార్‌కు చేరేసరికి రాత్రి ఎనిమిదయ్యింది.

ఆనందమే అందం

అక్కడకు వెళ్లాక ముందుగానే రిజర్వ్‌ చేయించుకున్న క్లబ్‌హౌస్‌కి చేరుకున్నాం. అక్కడివాళ్లు మాకు చందనంతో బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. కొండమీద ఉన్న ఓ భవనంలో గది కేటాయించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక పక్క బిల్డింగ్‌లో ఉన్న డైనింగ్‌ హాల్‌కి డిన్నర్‌ చేయడానికి వెళ్లాం. భోజనం బాగుంది. మర్నాడు ఉదయాన్నే గదిలోనే టీ చేసుకుని తాగుతూ బాల్కనీలోకి వచ్చాం. ఒక్కక్షణం మమ్మల్ని మేం మరిచిపోయాం. కళ్లు చెదిరే ప్రకృతి సౌందర్యం... మేం ఊహించిన దానికన్నా అందంగా ఉంది మున్నార్‌.

దక్షిణ కశ్మీర్‌!

కేరళలోని ఇడుక్కి జిల్లా దేవికుళం తాలూకాలో సముద్ర తీరానికి సుమారు 1600 మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల్లో ఉంది మున్నార్‌. ఎత్తైన చెట్లూ కొండలూ లోయలతో నిండిన దీన్ని దక్షిణ కశ్మీర్‌ అనీ పిలుస్తుంటారు. ముథిరాపుళ- నల్లతన్ని- కుండలి అనే మూడు నదుల సంగమ ప్రదేశం కాబట్టి దీనికి మున్నార్‌ అనే పేరు వచ్చిందట. మలయాళంలో మూను అంటే మూడు, ఆరు అంటే నది అని అర్థం.
స్నానపానాదులు ముగించుకుని టాక్సీలో బయలుదేరాం. ఉదయం ఎనిమిది వరకూ ఎటుచూసినా పొగమంచే. తరవాతే కాస్త తెరపిచ్చింది. చుట్టూ కనుచూపుమేర తేయాకు తోటలే... కొండలమీద పచ్చని తివాచీలు పరిచినట్లుగా టీ తోటలూ... వాటి చెంతనే ఆకాశాన్ని ముద్దాడే యూకలిప్టస్‌ వృక్షాలూ కళ్లు తిప్పుకోనీయలేదు. మున్నార్‌కు 26 కి.మీ. దూరంలో ఉన్న అనాయిరంకల్‌ డ్యామ్‌ని చూడాలని బయలుదేరాం. దారిలో నారింజ తోటల్ని చూసుకుంటూ వ్యూ పాయింట్స్‌ దగ్గర ఆగి ఫొటోలు తీసుకుంటూ ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాం. దీన్ని 1960లలో పెరియార్‌ నదిమీద కట్టారు. ఇక్కడ విద్యుచ్ఛక్తి ఉత్పత్తి జరుగుతుంది. అక్కడి స్పీడ్‌ బోటు ఎక్కి చుట్టూ చూస్తే- రిజర్వాయర్‌కు ఒకవైపు టీ తోటలూ మరోవైపు అడవులూ ఎవరో కూర్చినట్లుగా చూడముచ్చటగా అనిపించాయి. పదిహేను నిమిషాలున్న ఆ రైడ్‌ని ఎంతో ఎంజాయ్‌ చేశాం. సమీపంలోని స్పైస్‌ గార్డెన్‌కి వెళ్లాం. ఓ మలయాళీ అమ్మాయి మమ్మల్ని తోటంతా తిప్పి రకరకాల సుగంధద్రవ్యాలూ, ఔషధ మొక్కలను చూపిస్తూ ఏ మొక్కను ఏ జబ్బుకి వాడతారో చక్కగా వివరించింది. ముఖ్యంగా యాలకులు, వెనీలా... వంటి మొక్కల్ని చూసిన తృప్తి కలిగింది. ఆపై తోట ముందున్న షాపునకు వెళ్లాం. అక్కడ సుగంధద్రవ్యాలూ ఆయుర్వేద మందులూ రుద్రాక్షలూ తైలాలూ చాక్లెట్లూ కేరళలో నేసిన చీరలూ కాఫీ, టీ పొడులూ... వంటివన్నీ ఉన్నాయి. మాక్కావాల్సినవన్నీ కొనుక్కుని వెనుతిరిగాం.

రాశిఫలం (మే 12 - మే 18)

మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి మున్నార్‌కి రెండు కిలోమీటర్ల దూరంలోని పూలతోటకి వెళ్లాం. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వనం కేరళ అటవీశాఖ సంరక్షణలో ఉంది. ప్రవేశ రుసుము కేవలం 20 రూపాయలే. టిక్కెట్టు తీసుకుని లోపలకు వెళితే రంగురంగుల పువ్వులు ఆహ్వానించాయి. గులాబీలతోపాటు అనేక ఔషధ మొక్కలూ కాక్టస్‌ రకాలూ ఉన్నాయి. కొండల మధ్యలో ఆ పూలవనం ఆహ్లాదకరంగా అనిపించింది.
తరవాత అక్కడికి తొమ్మిది కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కి వెళ్లాం. సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ముథిరాపుళ నదిమీద 1940ల చివర్లో కట్టిన ఈ డ్యామ్‌ నుంచే మున్నార్‌కు అవసరమైన విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది. ఈ డ్యామ్‌ కట్టడంవల్ల ఏర్పడిన సరోవరంలో మోటారు బోట్‌ విహారాన్నీ ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లడానికి చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. అవన్నీ ఎగుడుదిగుడుగా ఉన్నాయి. మెట్లు దిగిన కష్టాన్ని అరగంటపాటు నెమ్మదిగా సాగిన ఆ పడవ ప్రయాణంతో మరిచిపోయాం. ముందుకు పడిపోకుండా వీపునకు బెలూన్లలాంటివి కట్టారు. ఎత్తయిన కొండల మధ్యలో ఉండటంవల్ల ఆ ప్రాంతం శోభాయమానంగా కనిపిస్తోంది. తేయాకు తోటల సౌందర్యం వర్ణనాతీతం. ప్రశాంతంగా ఉన్న నీటి అలల్ని చూస్తూ చుట్టూ పసుపూ ఆకుపచ్చ కలగలిసిన రంగుల్లో కనిపిస్తోన్న అక్కడి చెట్ల సోయగాల్ని చూడటానికి రెండు కళ్లూ చాలవనిపించింది. తరవాత తేయాకుతోటల్లో విహరిస్తుండగా కొండకింద ఉన్న జలాశయానికి ఆనుకుని ఉన్న పచ్చికల్లో ఏనుగుల గుంపు కనిపించింది. అవి హాయిగా సంచరిస్తున్నాయి. అక్కడ నుంచి సమీపంలోని షూటింగ్‌ పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. కాసేపు చిరుజల్లులూ మరికాసేపు నీరెండతో ఉండే ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందుకే తరచూ అక్కడ షూటింగులు జరుగుతుంటాయట. తరవాత మట్టుపెట్టి డ్యామ్‌కీ కుండల సరస్సుకీ మధ్యలో ఉన్న ఎకో పాయింట్‌కి చేరుకున్నాం. అక్కడ గట్టిగా అరిస్తే, అవతలికొండ నుంచి ప్రతిధ్వనులు వస్తున్నాయి. సహజమైన ఈ శబ్దాన్ని వినడానికే కాదు, ఇక్కడి కొండ అందాల్ని చూడ్డానికీ ఫొటోలు తీసుకోవడానికీ బోటింగ్‌కీ చాలామంది సందర్శకులు వచ్చారు.

యాలకుల పరిమళాలే!

దారిలోని రెస్టరంట్‌లో భోజనం చేసి కన్నన్‌ దేవన్‌ హిల్‌ ప్లాంటేషన్‌ కంపెనీకి చెందిన టీ మ్యూజియానికి వెళ్లాం. ఈ మ్యూజియం... మున్నార్‌లోని తేయాకు తోటల చరిత్రను ఆసాంతం తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలో టీ ఆకుల నుంచి టీ పొడి తయారయ్యే విధానాన్ని చూపిస్తారు.
మర్నాడు రాజమలైలో ఉన్న ఎరావికుళంలోని నేషనల్‌పార్క్‌కి బయలుదేరాం. ఇది కేరళలోని తొలి జాతీయ పార్కు. దీనికి వెళ్లే దారంతా యాలకుల తోటలూ వాటి సుగంధాలే. చెట్టు మొదల్లో ఉన్న యాలకుల్ని చూస్తే వింతగా అనిపించింది. బస్సెక్కి పార్కుకి చేరుకున్నాం. వాతావరణం చల్లగా ఉంది. 97 చదరపు కి.మీ. విస్తీర్ణం ఉన్న ఈ ఉద్యానవనం ట్రెక్కింగ్‌కి అనుకూలం. వన్యప్రాణులూ కనిపిస్తాయిక్కడ. అంతరించడానికి సిద్ధంగా ఉన్న నీలగిరి తహర్‌లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. సాంబార్‌, సింహంతోక ఉండే మెకాకె, లంగూర్‌ కోతులూ, అరుదైన పుష్పజాతులూ... ఇలా ఎన్నో మనల్ని పలకరిస్తాయి. ఈ ప్రాంతంలో ఉన్న జలపాతం చాలా పెద్దది. నీటి తుంపరలతో మేఘాల దోబూచులాటలతో ఆ ప్రాంతం మమ్మల్ని మైమరపించింది. దక్షిణ భారతావనిలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం ఆనముడి కూడా ఈ పార్కులోనే ఉంది. మలయాళంలో ఆనముడి అంటే ఏనుగు పర్వతం అని అర్థం. దీని ఎత్తు 8,842 అడుగులు. దాన్ని చూసి సమీపంలోని కురింజిమల శాంక్చ్యురీకి వెళ్లాం. 32 హెక్టార్లలో విస్తరించిన ఈ ప్రాంతంలో పన్నెండేళ్లకోసారి మాత్రమే పుష్పించే నీలకురింజి మొక్కలు నలువైపులా కనిపిస్తాయి. పూలు లేకున్నా కనీసం ఆ మొక్కల్ని అయినా చూశాం అనుకుంటూ వెనుతిరిగాం.
ఆ సాయంత్రం మున్నార్‌ టెంపుల్‌ రోడ్డులో సందర్శకుల కోసం ప్రదర్శిస్తోన్న కథకళి చూడ్డానికి వెళ్లాం. దీనికోసం కళాకారులు పదేళ్ల వయసు నుంచీ కనీసం ఆరేళ్లపాటు శిక్షణ తీసుకుంటారు. ఈ నృత్యాన్ని ఒకప్పుడు ఆలయాల్లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారేవరకూ ప్రదర్శించేవారట. ఈ కళాకారుల హావభావాలూ వస్త్రాలంకరణా ఎంతో అబ్బురంగా అనిపిస్తాయి. ఆ రోజు నరకాసుర కథను ప్రదర్శించారు. ఆ మర్నాడే మా తిరుగుప్రయాణం. ఓపికా తీరికా ఉండాలే కానీ మున్నార్‌ చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో... వాటిల్లో కొన్నయినా చూడగలిగామన్న సంతృప్తితో ఆనందంగా వెనుతిరిగాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..