ఆ ఘనత...ఆదిశంకరాచార్యులదే!

అద్వైత సిద్ధాంత బోధకుడిగా... హిందువులకు నిత్యస్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా... ఆలయస్థాపనకు నడుంబిగించిన సాధకుడిగా... జగద్గురువు ఆదిశంకరాచార్యులు తలపెట్టని కార్యంలేదు.

Updated : 12 May 2024 09:03 IST

అద్వైత సిద్ధాంత బోధకుడిగా... హిందువులకు నిత్యస్తోత్రాలను అందించిన అపర సరస్వతిగా... ఆలయస్థాపనకు నడుంబిగించిన సాధకుడిగా... జగద్గురువు ఆదిశంకరాచార్యులు తలపెట్టని కార్యంలేదు. మే 12న శంకర జయంతి సందర్భంగా జగత్తుకే గురువుగా ఖ్యాతి గాంచిన ఆదిశంకరుల గురించి కొన్ని విశేషాలు...

దాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో అవతరించాడని అంటారు. కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మించిన శంకరాచార్యులు చిన్నతనం నుంచీ ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తల్లే కుమారుడికి ఉపనయనం చేయించింది. చిన్నతనంలోనే వేదవేదాంగాలనూ, ధర్మశాస్త్రాలనూ ఆపోసన పట్టిన శంకరులు తల్లి అనుమతితో సన్యాసాన్ని స్వీకరించి గురువును అన్వేషిస్తూ యాత్రను సాగించారు. గోవింద భగవత్పాదులను గురువుగా భావించి పాదపూజ చేశారు. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని ప్రపంచానికి తెలియజేశారు. ముప్ఫైరెండేళ్లు మాత్రమే జీవించిన శంకరాచార్యులు.. అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు ఆసేతు హిమాచలం ప్రయాణించారు. తమిళనాడులోని కంచి నుంచి అసోం వరకూ... కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ల నుంచి కాశీ దాకా... గంగానది నుంచి పూరీ జగన్నాథ్‌ వరకూ.. ఇలా భారతదేశం నలుమూలలా దాదాపు మూడుసార్లు ఆధ్యాత్మిక యాత్రను కాలినడకన సాగించారు. ఆ ప్రయాణం సాగిస్తూనే సన్యాస వ్యవస్థను పదిరకాలుగా వర్గీకరించారు. నేటికీ సన్యాసాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత శంకరాచార్యులదే. జీవాత్మ-పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైతసిద్ధాంతాన్ని బోధించిన శంకరులు చివరకు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శివైక్యాన్ని పొందారని చెబుతారు.

దేశభక్తుల ఆలయం!

సామాన్యులూ చదువుకునేలా...

సమస్త జగత్తుకూ గురువుగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్న శంకరాచార్యులు భక్తిమార్గంలో ప్రయాణించాలనుకునేవారికి ఎన్నో స్తోత్రాలను అందించారు. బాలబ్రహ్మచారిగా ఓసారి శంకరాచార్యులు భిక్షకోసం ఓ ఇంటికి వెళ్లారట. ఆ క్షణంలో ఆ పేదింటి ఇల్లాలి దగ్గర భిక్ష వేసేందుకు ఏమీ లేక.. తాను ఉపవాసం విడిచినప్పుడు తినేందుకు ఉంచుకున్న ఉసిరికాయనే శంకరాచార్యులకు ఇచ్చిందట. దానికి చలించిపోయిన శంకరాచార్యులు ఆ క్షణం లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని అక్కడే చదివారట. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి బంగారు ఉసిరికాయల్ని ధారగా కురిపించిందని కథ. ఆ కనకధార స్తోత్రంతోపాటు సామాన్యుల నుంచి తలలు పండిన పండితుల వరకూ అంతా చదువుకునేలా దాదాపు 108 స్తోత్రాలూ, గ్రంథాలూ రచించారు. మనం రోజువారీ చదువుకునే శివానందలహరి, మహిషాసురమర్దిని, భజగోవిందం, కాలభైరవాష్టకమ్‌, గణేశ పంచరత్నం, అన్నపూర్ణస్తోత్రం... వంటివన్నీ అందించింది ఆయనే. మహాభాగవతంలో అంతర్భాగమైన భగవద్గీత ప్రాధాన్యాన్ని గుర్తించి... గీతాభాష్యం రచించింది కూడా శంకరభగవత్పాదులే.

రాశిఫలం (మే 12 - మే 18)

ఆలయ స్థాపనకూ శ్రీకారం..

తన ప్రయాణంలో భాగంగా శ్రీరంగం వెళ్లిన జగద్గురువులు అక్కడ జనాకర్షణ యంత్రాన్ని స్థాపిస్తే... తిరుమలలో ధనాకర్షణ యంత్రాన్ని ఏర్పాటు చేశారట. అదే విధంగా కొల్లూరు మూకాంబిక, విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక, కంచి కామాక్షి.... ఇలా శక్తి స్వరూపిణులు కొలువైన దేవాలయాల్లో శ్రీచక్రాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా శంకరాచార్యులదే. ఇక, కంచిలోని యోగలింగం, శృంగేరిలోని భోగలింగం, నేపాల్‌లోని వరలింగం, కేదార్‌నాథ్‌లోని ముక్తిలింగం, చిదంబరంలోని మోక్షలింగాన్ని స్థాపించిన అపర శంకరులూ ఆయనే. బద్రీనాథ్‌కు వెళ్లిన శంకరాచార్యులకు స్వప్నంలో బదరీనారాయణుడు కనిపించి... అలకనందలో తన ఉనికి తెలియజేశాడట. దాంతో ఆ విగ్రహాన్ని వెలికితీసి అక్కడే ప్రతిష్ఠించారట. ఆ తరువాత దేశంలోని నాలుగుదిక్కుల్లో మఠాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో బద్రికాశ్రం జ్యోతిర్‌పీఠం, పశ్చిమంలో శారదాపీఠం, తూర్పులో గోవర్ధనపీఠం, దక్షిణాదిన కర్ణాటకలోని చిక్‌మగళూరులో శృంగేరీ శారదాపీఠాన్ని స్థాపించిన శంకరులకు కశ్మీర్‌లో ప్రత్యేక ఆలయమూ ఉంది. ఇలా అనుక్షణం ధర్మస్థాపనకోసం, అద్వైత సిద్ధాంతంకోసం తపించిన శంకరులు సన్యసించేముందు తన తల్లికి మాట ఇచ్చినట్లుగా.. ఆర్యాంబ మరణించినప్పుడు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించి పుత్రుడిగా తన ధర్మాన్ని చాటుకోవడం కొసమెరుపు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు