Amit lodha: ఒకే రాత్రి...24 హత్యలు జరిగాయి!

తెరిచి చూడాలేకానీ... ప్రతి పోలీసు అధికారి జీవిత పుస్తకంలోనూ ఉత్కంఠరేపే పేజీలు కొన్ని ఉంటాయి. అరుదుగా కొందరి కెరీర్‌ మాత్రం... ఓ రాష్ట్రం ముఖచిత్రాన్నే మార్చేలా ఉంటుంది. అమిత్‌ లోఢా కెరీర్‌ అలాంటిది. ఈ ఐపీఎస్‌ అధికారి జీవితంలోని ఓ కీలకఘట్టం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఖాకీ’ అన్న సినిమాగానూ వస్తోంది.

Updated : 27 Nov 2022 09:54 IST

Amit lodha: ఒకే రాత్రి...24 హత్యలు జరిగాయి!

తెరిచి చూడాలేకానీ... ప్రతి పోలీసు అధికారి జీవిత పుస్తకంలోనూ ఉత్కంఠరేపే పేజీలు కొన్ని ఉంటాయి. అరుదుగా కొందరి కెరీర్‌ మాత్రం... ఓ రాష్ట్రం ముఖచిత్రాన్నే మార్చేలా ఉంటుంది. అమిత్‌ లోఢా కెరీర్‌ అలాంటిది. ఈ ఐపీఎస్‌ అధికారి జీవితంలోని ఓ కీలకఘట్టం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఖాకీ’ అన్న సినిమాగానూ వస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ కథతోపాటూ తన కెరీర్‌ ప్రయాణాన్నీ మనతో పంచుకుంటున్నాడు అమిత్‌...

ఆ రోజు మా జీపు వెళుతున్న దారంతా అడుక్కో గుంత. ముప్పయ్యేళ్ళకే స్పాండిలైటిస్‌ సమస్యతో బాధపడుతున్న నాకు... ఆ గుంతల దారి మరింత నరకం చూపాలికానీ నా ఆలోచనలు అక్కడ లేవు. నేను ఈ ప్రాంతానికి బదిలీకావడానికి సరిగ్గా మూడురోజులు ముందు సీఎం నితీశ్‌కుమార్‌ ఈ జిల్లా ప్రధాన కేంద్రానికి వచ్చారు. ఇక్కడికి దగ్గర్లోని మీనాపూర్‌ అన్న గ్రామాన్ని సందర్శించారు. కారణం... ఆ గ్రామంలో ఒకే రాత్రి 24 హత్యలు జరిగాయి! ఆ హత్యలన్నీ చేసింది ఒకే గ్యాంగ్‌. ఇంకా చెప్పాలంటే... ఒక్క వ్యక్తి. పేరు అశోక్‌ మహతో. బిహార్‌ నేరసామ్రాజ్యానికి అతనో సామ్రాట్టు! నేను ఆలోచిస్తున్నది అతని గురించే...

* * *

అశోక్‌... నాలుగురోజుల కిందట తన గ్యాంగ్‌తో మీనాపూర్‌కి వచ్చాడు. అక్కడో గృహప్రవేశం జరుగుతోంది. ఆ కొత్తింటి యజమాని రామ్‌ దులార్‌ వద్దకెళ్ళిన అతను ‘నువ్వే కదా పోలీసు ఇన్‌ఫార్మర్‌?’ అని అడిగాడు. అతను ‘బాబూ... నాకేమీ తెలియదు!’ అనేలోపు అతని కళ్లెదుటే 17 మంది బంధువుల్ని పిట్టల్లా కాల్చేశాడు. చివర్లో రామ్‌ దులార్‌నీ హతమార్చాడు. ఆ తర్వాతే ఆ గ్యాంగ్‌లో ఉన్న వ్యక్తి సాలోచనగా... ‘అశోక్‌ భయ్యా! పొరబాటు జరిగింది. మనం అనుకున్న రామ్‌ దులార్‌ ఇతను కాదు!’ అన్నాడు. ‘అయ్యో... పొరపాటున ఇన్ని ప్రాణాలు తీశామే’ అని పశ్చాత్తాపపడలేదు అశోక్‌. పొరబాటునైనా సరే... తనతో ఏమాత్రం శత్రుత్వం లేకున్నా సరే... ప్రాణం తీయడంలో మజా ఉందనుకునే కిరాతకుడతను. అందుకే ‘ఇప్పుడేమైందిలే, అసలువాడిని పట్టుకుందాం’ అంటూ అటువైపు దారితీశాడు. ఈ అసలైన పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ రామ్‌ దులార్‌ ఆ రోజు ఓ పెళ్ళి వేడుకలో ఉన్నాడు. ఆ వేడుకకి వెళ్ళిన అశోక్‌ అక్కడా మారణహోమం సృష్టించాడు. అతని గుళ్ళ వర్షంలో నాలుగేళ్ళ పాప నుంచి డెబ్భైయేళ్ళ వృద్ధుల దాకా... ఏడుగురు హతమయ్యారు. అలా ఒకే రాత్రి... ఒకే గ్రామంలో 24 మందిని పొట్టనపెట్టుకున్నాడు అశోక్‌. ఆ తర్వాతి రోజే సీఎం నితీశ్‌ కుమార్‌ అక్కడికొచ్చారు. ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడూ, నిండు చూలాలైన అతని తల్లీ ఇద్దరూ... అశోక్‌ గ్యాంగ్‌ తుపాకీ గుళ్ళకి చనిపోయున్నారు. ఆ తల్లీ, ఆ పిల్లాడు ఇద్దరూ చనిపోయున్నారు. పిల్లాడైతే... భయంతో అమ్మ కొంగును గట్టిగా పట్టుకునే ప్రాణం వదిలినట్టున్నాడు. ఆ దృశ్యం ఆ రోజు సీఎంని కూడా కళ్ళనీళ్ళు పెట్టించింది! స్థానిక స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌నీ, కలెక్టర్‌నీ, ఎస్పీనీ అప్పటికప్పుడు సస్పెండు చేశారాయన. సస్పెండయిన ఆ ఎస్పీ స్థానాన్ని భర్తీ చేయడానికే నేను వెళ్ళాను.

జాబ్‌ రాక... సివిల్స్‌ రాశా

మాది రాజస్థాన్‌లోని జైపూర్‌. అమ్మానాన్నలిద్దరూ ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచీ నేను మ్యాథ్స్‌ చక్కగా చేసేవాణ్ణి. మ్యాథ్స్‌ ఇష్టపడేవాళ్ళందరూ ఇంజినీరింగ్‌కి వెళ్ళాలన్న అపోహతో... ఐఐటీ-దిల్లీలో చేరాను. కానీ నాకు ఆ మెషిన్‌లపైన ఏమాత్రం ఆసక్తి రాలేదు. అన్ని సెమిస్టర్‌లలోనూ ‘డి’
గ్రేడ్‌కే పరిమితం అయ్యాను. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో నన్ను ఏ కంపెనీ తీసుకోలేదు. బంధువులందరూ ‘జాబ్‌ ఎక్కడ? ఎంత ప్యాకేజీ?’ అని అడుగుతుంటే సిగ్గుగా అనిపించేది. వాళ్ళ ప్రశ్నల నుంచి తప్పించుకుందామనే సివిల్స్‌ రాస్తున్నానని చెప్పాను. ఊరికే చెప్పడం ఎందుకని... ప్రిలిమ్స్‌కి ప్రిపేర్‌ కావడం ప్రారంభించాను. అందులో దిగుతున్నకొద్దీ అర్థమైంది... నాకు ప్రభుత్వరంగమే సరైందని. రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించాను. శిక్షణ తర్వాత బిహార్‌ కేడర్‌ ఇచ్చారు. 2001 సంవత్సరం అది. అప్పట్లో బిహార్‌ రాజధాని పాట్నా కిడ్నాప్‌లకి అడ్డాగా పేరుమోస్తుండేది! అలా కిడ్నాప్‌కి గురైన ఓ బ్యాంకు మేనేజర్‌నీ, మరో వీఐపీ దంపతుల 11 ఏళ్ళ చిన్నారినీ సురక్షితంగా కాపాడటం నాకు బాగా పేరుతెచ్చింది! చిన్న వయసులోనే నలందా, మీర్జాపూర్‌లాంటి పెద్ద జిల్లాలకి ఎస్పీగా వెళ్ళగలిగాను. అప్పుడే ఓ సీనియర్‌తో నాకు బెడిసింది. ఆ సీనియర్‌ తన మేనల్లుడిని నా పరిధిలోని ఓ ఠాణాకి ఇన్‌ఛార్జిని చేయమన్నాడు. ‘అతనికి ఆ సామర్థ్యం లేదు సార్‌... నేను చేయలేను!’ అంటూ మొహానే చెప్పేశాను. ఆ సీనియర్‌ రాష్ట్ర డీజీపీకి సహాయకుడిగా వెళ్ళిన వారానికే... నన్ను ఎస్పీగా తొలగించారు. ఓ చిన్న బెటాలియన్‌కి కమాండెంట్‌గా నియమించారు. మూడు నెలలపాటు నా జీతాన్నీ ఆపేశారు. ‘ఈ ఐపీఎస్‌ హోదాకన్నా ప్రయివేటు ఉద్యోగాలు నయం’ అనుకుంటూ ఉండగానే... నన్ను షేక్‌పూర్‌కి ఎస్పీగా వేశారు. అప్పటికప్పుడు నా జీతం బకాయిని జమచేస్తూ... ‘అశోక్‌ని పట్టుకోవడమే నీ లక్ష్యం కావాలి... సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు దీన్ని!’ అని చెప్పారు.

బిహార్‌ వీరప్పన్‌!

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజు మీనాపూర్‌ గ్రామానికి వెళ్ళాను. హత్యాకాండ జరిగిన ఇంటి ముందు ఓ ఎనభైయేళ్ళ ముసలావిడ, ఏడేళ్ళ బాబు మాత్రం కనిపించారు. ఆరోజు వేడుక జరిగిన ఇంట ఖాళీలేక పక్కనే ఉన్న బంధువింట్లో పడుకోవడంతో బతికిపోయారట వాళ్ళు. నా అన్నవాళ్ళని కోల్పోయి ఇద్దరూ అనాథలుగా మిగిలారు. దైన్యం నిండిన వాళ్ళ కళ్లు నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నట్టు అనిపించాయి. సీఎం కోసమో, నాకోసమో కాదు... వీళ్ళకి జరిగిన అన్యాయం కోసమైనా అశోక్‌ని పట్టుకోవాలనుకున్నాను. అతని గురించి మొత్తం ఆరాతీశాను.. అశోక్‌ది షేక్‌పురాలోని ఓ కుగ్రామం. సాటి పిల్లలందరూ కోతికొమ్మచ్చులు ఆడుతుంటే ఇతను... తొండల్ని పట్టి వాటిని చంపుతూ ఆనందిస్తుండేవాడట. రక్తం చూస్తే అంతగా వెర్రెక్కిపోయేవాడు. ఓసారి గ్రామానికి చెందిన భూస్వామి స్థలాన్ని కబ్జా చేయబోతే అతను సర్వేశ్వర్‌ అన్న దాదా చేత ఇతణ్ణి చిత్తుగా కొట్టించాడు. ఆ కసితో సర్వేశ్వర్‌కి శత్రువైన పంకజ్‌సింగ్‌ గ్యాంగ్‌తో చేతులు కలిపాడు. వాళ్ళ సాయంతో సర్వేశ్వర్‌ని చంపాడు. ఆ తర్వాత తనకి సాయం చేసిన పంకజ్‌సింగ్‌నీ చంపేశాడు. అక్రమ మైనింగ్‌లూ, ఇసుక
తరలింపులపైన పట్టు సాధించాడు. ‘బిహార్‌ వీరప్పన్‌’గా పేరు తెచ్చుకున్నాడు. మా పోలీసుల లెక్కప్రకారమే అతను చంపినవాళ్ళ సంఖ్య 70కి పైన ఉంటుంది..! అయినాసరే, కులం కారణంగా అటు రాజకీయ నాయకుల మధ్యే కాదు... మా పోలీసుల్లోనూ అతనికి గట్టి మద్దతుదారులున్నారు. అశోక్‌ని పట్టుకోవడానికి ఏ పోలీసైనా బయల్దేరిన మరుక్షణమే... అతనికి తెలిసిపోతుంది! అలాంటివాణ్ణి పట్టుకోవడానికి ‘సంప్రదాయ’ పద్ధతులు సరిపోవనిపించింది. అప్పుడప్పుడే కొత్తగా పరిచయమైన ‘మొబైల్‌ ట్యాపింగ్‌’ని ఎంచుకున్నాను. అశోక్‌ మహతో, అతని అనుచరుడు పింటూ మహతోలతోపాటు మరో ఐదుగురి సెల్‌ఫోన్‌ సంభాషణలు వినడం మొదలుపెట్టాను. తొలి రోజే నాకు మూడు షాక్‌లు తగిలాయి. షేక్‌పూర్‌ టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌, డీజీపీ కార్యాలయానికి చెందిన మరో ఉన్నతాధికారీ, ఓ ఎమ్మెల్యే- అశోక్‌కి ఫోన్‌ చేసి... ఇక్కడ జరుగుతున్నవన్నీ చెబుతున్నారు! అందరూ చెప్పేది ఒకటే... ‘ఈ కొత్త ఎస్పీరహస్యంగా ఏదో చేస్తున్నాడు, జాగ్రత్త!’ అని. దానికి అశోక్‌ ‘నేను సింహాన్ని... అలాంటి చిట్టెలుకలకి భయపడను’ అంటున్నాడు. ఆ సింహానికి ఓ గట్టి ఝలక్‌ ఇవ్వాలనుకున్నాను.

ఎమ్మెల్యే పైన ఒత్తిడి

మీనాపూర్‌ హత్యల తర్వాత అశోక్‌ గ్యాంగ్‌ పారిపోగానే... వాళ్ళ కుటుంబ సభ్యులూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ, నేను ఊహించినట్టే అశోక్‌ మహతో కుడిభుజం పింటూ మహతోకి అతని భార్య ఫోన్‌ చేయడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ ఆమె ‘ఎప్పుడొస్తావ్‌?’ అనేది. ‘విసిగించకు, వీలు చూసుకుని వస్తాను. పిల్లాడితో రోజూ ఇంగ్లిషు పత్రిక తెప్పించి చదివించు... వాడు ఐపీఎస్‌ కావాలి!’ అనేవాడు. ఓ కరడుగట్టిన క్రిమినల్‌కి ఐపీఎస్‌ పట్ల ఉన్న ఆరాధన ఆశ్చర్యం కలిగించింది నాకు. అతని భార్య ఫోన్‌ సిగ్నల్స్‌ని బట్టి ఆమె మా పొరుగు రాష్ట్రం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ పట్టణంలో ఉన్నట్టు తేలింది. అది ప్రఖ్యాత బైద్యనాథ్‌ ఆలయం ఉన్న ప్రాంతం. కాబట్టి రద్దీ ఎక్కువ, వెతకడం కష్టం. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే... పింటూ భార్య ఓరోజు ఎవరితోనో ‘సనాతన్‌ నగర్‌’ అని చెబుతోంది. అది చాలు కదా...! నేనో, ఇప్పుడు నాతో ఉన్న పోలీసులో బయల్దేరితే అశోక్‌కి ఉప్పందుతుందని తెలిసి... షేక్‌పూర్‌ ఇన్స్‌పెక్టర్‌గా చేసి సస్పెండ్‌ అయిన రంజన్‌ని రహస్యంగా పంపించాను. వారం తిరక్కుండానే అక్కడికొచ్చిన పింటూ... మాకు దొరికిపోయాడు! అతని అరెస్టు పెద్ద సంచలనమైంది. అశోక్‌కి అది పెద్ద షాక్‌.

‘ఎలా... పట్టుకున్నాడు
నా తమ్ముణ్ణి!’ అంటూ - తనకు ఉప్పందించే మా పోలీసు అధికారిని ప్రశ్నించసాగాడు. ‘ఆ కొత్త ఎస్పీని బదిలీ చేస్తారా... లేదా?’ అంటూ - ఎమ్మెల్యేపైన ఒత్తిడి తెచ్చాడు. ‘సింహం’లో భయం మొదలైందని నాకు అర్థమైపోయింది. అతణ్ణి మరింతగా గందరగోళంలోకి నెట్టాలని ‘అశోక్‌ గ్యాంగ్‌లోనివాళ్లే పింటూని పట్టించారని విలేకర్లతో చెప్పాను.

సింహం గుహలోకే వెళ్ళి...

అశోక్‌కి తొత్తుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారికి మేం ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నామన్న విషయం అర్థమైనట్టుంది. అతని సూచనతో అశోక్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేశాడు. దాంతో మేం వారం గడిచినా పురోగతి సాధించలేకపోయాం. అశోక్‌ కొత్త ఫోన్‌, మరో సిమ్‌కార్డు తీసుకుని మాట్లాడుతుండొచ్చు. కానీ అది ఎలా తెలుసుకోవడం? ఓపిగ్గా వేచిచూశాం. పింటూ మహతో భార్య ఓ రోజు సంజయ్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి ‘నేను అశోక్‌ సాబ్‌తో మాట్లాడాలి’ అనడం విన్నాను. వెంటనే, సంజయ ఫోన్‌ని ట్యాప్‌ చేసి అశోక్‌ కొత్త నంబర్‌ పట్టుకుని సంభాషణలు వినసాగాం. ఓ రోజు అతను‘ఇక్కడ హైవే. లారీల రొద ఎక్కువగా ఉంది. గట్టిగా మాట్లాడు...’ అనడం విన్నాను. అతని సెల్‌ సిగ్నల్‌ నల్‌హాటీ పట్టణాన్ని చూపింది. అక్కడి హైవే పక్కన వందకు పైగా కాలనీలున్నాయి. వాటిల్లో అశోక్‌ ఎక్కడున్నాడో ఎలా తెలియాలి? నేనే అశోక్‌కి వేరే నంబర్‌తో ఫోన్‌ చేసి బిహారీ యాసలో ‘నీ గ్యాంగ్‌లోనే ద్రోహులున్నారన్నా. వాళ్ళ గురించి చెప్పాలి!’ అని చెప్పి పెట్టేశాను. రాత్రి నా ఫోన్‌ కోసం ఎదురుచూస్తుంటాడని తెలుసు. అందుకే పాత ఇన్‌స్పెక్టర్‌ రంజన్‌కి మరో ఇద్దర్ని జతచేసి నల్‌హాటీ హైవే పక్కన మకాం వేయించాను. నేను అతనికి ఫోన్‌ చేసే సమయానికి- మావాళ్ళని ఓ కారులో ఆ హైవేకి దగ్గరోని కాలనీల్లో తిరగమని చెప్పాను. అలా తిరుగుతూ ఓ ప్రత్యేక పద్ధతిలో హారన్‌ మోగించమన్నాను. నేను అశోక్‌కి ఫోన్‌ చేసేటప్పుడు ఆ ప్రత్యేక హారన్‌ నాకు వినిపిస్తే... ఆ లొకేషనే అశోక్‌ అడ్డా అన్నమాట. అంతా అనుకున్నట్టే జరిగింది. మావాళ్ళు అతనున్న బ్లాక్‌ ముందే కారు ఆపారు. ఈలోపు నేను అశోక్‌తో మాట్లాడుతూ ‘అన్నా నీ మాటలు వినపడట్లేదు... బయటకు రావా?’ అన్నాను. వాళ్ళ గ్యాంగ్‌లో ఉన్న ఇద్దరి పేర్లు చెప్పి...వాళ్ళే ద్రోహులన్నాను. అతను ‘వాళ్ళా’ అంటూ టెర్రస్‌పైకొచ్చి మాట్లాడసాగాడు. అప్పటికే అక్కడ మావాళ్లున్నారు!

అశోక్‌ని అరెస్టు చేసి షేక్‌పురాలోని మా ఇంటికి తెచ్చారు. సీఎం పర్యవేక్షణలోనే అతనిపైన కోర్టులో కేసు ఫైల్‌ చేశాం. అతను అరెస్టయిన కొన్నాళ్ళకి నన్ను బెగుషెరాయ్‌ జిల్లాకి ఎస్పీగా బదిలీ చేశారు. ఓ హోలీ రోజు పిల్లలతో మేం బయటకు వెళుతుండగా... మాపైన ‘ఎవరో’ గ్రెనేడ్‌ వేశారు. వెంట్రుకవాసిలో తప్పించుకున్నా... మా బాబుకి మాత్రం తలకి గాయమైంది. అది జైల్లో ఉన్న అశోక్‌ పనేనని తెలిసింది. నా సేవలగ్గాను 2008లో రాష్ట్రపతి నుంచి ప్రతిష్ఠాత్మక గ్యాలెంట్రీ అవార్డు అందుకున్నాను.

16 ఏళ్ళ తర్వాత...

అశోక్‌ మహతో జైల్లోనే ఉన్నాడు. పింటూ మహతో మాత్రం సత్ప్రవర్తన కారణంగా విడుదలై చిన్నవ్యాపారం చేస్తున్నాడు. కొడుకుని ఐపీఎస్‌ చదివించాలన్నది అతని కల కదా! నేను ఎస్పీగా చేస్తున్నంత కాలం ఆ చిన్నారి చదువుకి కావాల్సిన సాయం చేశాను. అతనొక్కడే కాదు... అశోక్‌ గ్యాంగ్‌లోని పిల్లలందరూ బడికి వెళ్లేలా జాగ్రత్తలూ తీసుకున్నాను. వాళ్ళని కలుద్దామని ఈ మధ్య షేక్‌పురాకి వెళ్ళాను. ‘నెక్ట్స్‌ ఇయర్‌ ప్రిలిమ్స్‌ రాస్తాను అంకుల్‌!’ అన్నాడు పింటూ మహతో కొడుకు. ‘అలాగే, మావాడూ రాస్తానంటున్నాడు. ఇద్దరూ బ్యాచ్‌మేట్స్‌ కావాలి... సరేనా!’ అన్నాను. ‘ఎస్సార్‌’ అంటూ సెల్యూట్‌ చేశాడు... అప్పుడే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..