సేవాభిలాషులు!

కారణాలేమైతేనేం... పిల్లల నుంచి పెద్దల వరకూ ఎందరో ఇంటికీ భద్రమైన కుటుంబ జీవితానికీ దూరమవుతుంటారు. అనాథలుగా రోడ్డున పడి అగచాట్లకు గురవుతుంటారు. అలాంటివారిని ఆదుకుని కొత్త జీవితాన్నిస్తున్న సంస్థలు ఇవి.

Updated : 12 May 2024 09:22 IST

కారణాలేమైతేనేం... పిల్లల నుంచి పెద్దల వరకూ ఎందరో ఇంటికీ భద్రమైన కుటుంబ జీవితానికీ దూరమవుతుంటారు. అనాథలుగా రోడ్డున పడి అగచాట్లకు గురవుతుంటారు. అలాంటివారిని ఆదుకుని కొత్త జీవితాన్నిస్తున్న సంస్థలు ఇవి.


అభాగ్యులైన అమ్మలకోసం...

పాతికేళ్ల క్రితం ఓరోజు యువదంపతులు రాజేంద్ర దమానె, సుచేత ఇద్దరూ తమ విధులకు బయల్దేరారు. ఆయన డాక్టరు. ఆమె వైద్య కళాశాలలో ప్రొఫెసరు. దారిలో ఒక దీనురాలు చెత్తకుండీలోనుంచి ఏదో తీసుకుని తినడం చూసి కడుపు తరుక్కుపోయింది సుచేతకి. వెంటనే తన టిఫిన్‌ డబ్బా తీసుకెళ్లి ఆమెకిచ్చారు. అప్పటినుంచి వీధుల్లో కనిపించిన అభాగ్యుల కడుపు నింపడం అలవాటుగా మార్చుకున్నారు భార్యాభర్తలు. కానీ కేవలం ఆకలి తీరిస్తే సరిపోదు, తలదాచుకోను నీడలేక అత్యాచారాలకూ అకృత్యాలకూ గురవుతూ శారీరక, మానసిక రోగులుగా మారుతున్న మహిళలకు సురక్షితమైన ఆశ్రయమూ కల్పించాలనుకున్నారు. కొడుకూ కోడళ్ల ఆశయం విని బాజీరావ్‌ దమానె తన స్థలాన్ని ఇవ్వగా ‘మౌళి సేవా ప్రతిష్ఠాన్‌’ని నెలకొల్పారు రాజేంద్ర. ‘మౌళి’ అంటే మరాఠీలో ‘అమ్మ’. ఈ ఆశ్రమం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉంది. పలు కారణాలవల్ల అనాథలుగా రోడ్డున పడిన అభాగ్యులు 300 మందికి పైనే అక్కడ చేరి సాంత్వన పొందుతున్నారు. గర్భిణులుగా ఆశ్రమంలో చేరిన వారి పిల్లలు మరో 30 మంది దాకా ఉన్నారు. అక్కడ వారికి ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు కల్పించడమేకాక అవసరమైన వైద్య చికిత్సలూ అందిస్తున్నారు. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు. పూర్తిగా కోలుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకునేవారికి వృత్తి విద్యలూ జీవన నైపుణ్యాలూ నేర్పిస్తున్నారు. వృద్ధులు తమ చివరి రోజుల్ని ప్రశాంతంగా గడిపేలా చూసి మరణించాక సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పిల్లలను బడిలో చేర్పించి చదివిస్తున్నారు. పూర్తిగా దాతల ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఈ సంస్థ నిర్వహణ కోసం సుచేత ఉద్యోగానికి రాజీనామా చేయగా రాజేంద్ర వైద్యుడిగా కొనసాగుతూనే ఆశ్రమానికి ఆర్థిక చేయూతనిస్తున్నారు.

రాశిఫలం (మే 12 - మే 18)

చిన్నారుల రక్షణకు ‘సాథీ’

ప్పిపోయిన, ఇల్లు విడిచి పారిపోయిన పిల్లల్ని ఇప్పుడంటే ఆధార్‌ సాయంతో పోలీసులు కనిపెట్టి తిరిగి తల్లిదండ్రులకు అప్పజెప్పడం పెరిగింది కానీ ముప్పయ్యేళ్ల క్రితం ఇలా లేదు. అప్పటి నుంచీ పనిచేస్తున్న సంస్థ ‘సాథీ’. ప్రమోద్‌ కులకర్ణికి అహ్మదాబాద్‌ ఐఐఎంలో చదువుతున్నప్పటి నుంచీ సంఘసేవ పట్ల ఆసక్తి. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవారు. చదువయ్యాక కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలు అందించడానికి 1992లోనే ప్రేరణ అనే సంస్థను ప్రారంభించారు. ఒకసారి రాయచూరు రైల్వే స్టేషన్‌లో కొంతమంది పిల్లలు అధికారులకు పట్టుబడిన సంఘటన మరో కొత్త సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ‘సొసైటీ ఫర్‌ అసిస్టెన్స్‌ టు చిల్డ్రన్‌ ఇన్‌ డిఫికల్ట్‌ సిచ్యువేషన్స్‌’ క్లుప్తంగా ‘సాథీ’- అనే ఈ సంస్థని ప్రమోద్‌ బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేసినప్పటికీ కొద్దికాలంలోనే 14 రాష్ట్రాలకు సేవల్ని విస్తరించారు. వందలాది యువత సంస్థకు కార్యకర్తలుగా సేవలు అందిస్తున్నారు. రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో... ఒంటరిగా పిల్లలు ఎక్కడ కనపడినా ఈ కార్యకర్తలు వారిని ఆదరించి అక్కున చేర్చుకుని ‘సాథీ’ కేంద్రాలకు చేరుస్తారు. అక్కడ వారిని సేదదీర్చి, కౌన్సెలింగ్‌ ఇచ్చి, తల్లిదండ్రుల వివరాలు కనుక్కుని, తీసుకెళ్లి వారికి అప్పజెబుతారు. అలా ఇప్పటివరకూ లక్షమందికి పైగా పిల్లల్ని అమ్మానాన్నల ఒడికి చేర్చింది ప్రమోద్‌ కులకర్ణి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాథీ. వారిలో 96శాతం చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారనీ ఉన్నతోద్యోగాల్లో ఉన్న కొందరు సంస్థకు చేయూతగా కూడా నిలుస్తున్నారనీ చెబుతారు ప్రమోద్‌.

ఆనందమే అందం


సమష్టి కుటుంబం... గాంధీభవన్‌!

కేరళలోని కొల్లం జిల్లా పత్తనపురంలో ఉంది గాంధీభవన్‌. అక్కడ ఎవరుంటారూ అంటే- అయినవారి ఆదరణకు నోచుకోని పసి పిల్లల నుంచి పండు ముదుసలుల వరకూ అన్ని వయసులవారూ ఉంటారు. శారీరక, మానసిక వైకల్యాలతో బాధపడుతున్నవారు, క్యాన్సర్‌- ఎయిడ్స్‌లాంటి రోగగ్రస్తులు, నా అన్నవారు లేని అనాథలు... ఎవరైనా సరే ఇక్కడ వారికి ఆశ్రయం దొరుకుతుంది. సమష్టి కుటుంబం తాలూకు అనుబంధాలూ ఆత్మీయతలూ దొరుకుతాయి. జీవితానికి కొత్త అర్థం తెలుస్తుంది. డాక్టర్‌ పునలూర్‌ సోమరాజన్‌ 2002లో ఏర్పాటుచేసిన గాంధీభవన్‌ ఇంటర్నేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో దాదాపు 1300 మంది ఆశ్రయం పొందుతున్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన సోమరాజన్‌ సమాజసేవ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. అనాథలుగా రోడ్డున పడ్డవారికి మంచి జీవితాన్నివ్వాలన్న ఆశయంతో గాంధీభవన్‌ని ప్రారంభించారు. అక్కడ చేరిన వారి అవసరాలను బట్టి ప్రత్యేక పాఠశాలలూ, చికిత్సాలయాలూ, డీ అడిక్షన్‌ సెంటర్లూ, వృద్ధాశ్రమాలూ ఏర్పాటుచేశారు. కోలుకుని ఆరోగ్యవంతులైన యువతీ యువకులు పిల్లల, పెద్దల బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఈ సంస్థకోసం లులు గ్రూపు యజమాని రూ.15కోట్లతో అధునాతన సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి ఇచ్చారు. భోజన, వైద్య సౌకర్యాల కోసం మరో ఏడున్నరకోట్లు అందజేశారు. దేశవిదేశాలకు చెందిన ఎందరో దాతల విరాళాలతో నడుస్తున్న ఈ గాంధీభవన్‌ క్రమశిక్షణకీ, స్వచ్ఛభారత్‌కీ ఉదాహరణగా నిలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు