రైతు పంట ‘చల్లగా’...

పల్లెల్లో సాగయ్యే పువ్వులు రంగు మారకముందే, సువాసన తగ్గిపోక ముందే మార్కెట్‌కి చేరుకుంటేనే రైతుకు గిట్టుబాటయ్యేది. అవి ఏ మాత్రం వాడి పోయినట్టున్నా సగానికి సగం రేటు కూడా రాదు.

Updated : 12 May 2024 09:10 IST

పల్లెల్లో సాగయ్యే పువ్వులు రంగు మారకముందే, సువాసన తగ్గిపోక ముందే మార్కెట్‌కి చేరుకుంటేనే రైతుకు గిట్టుబాటయ్యేది. అవి ఏ మాత్రం వాడి పోయినట్టున్నా సగానికి సగం రేటు కూడా రాదు. ఆకుకూరలూ, పండ్లూ, చేపలూ, రొయ్యలూ, పాలూ తదితరాలన్నీ కూడా ఎండ వేడికి చెడిపోకుండా వినియోగదారులకు చేరవేయ డానికి ఎంతో ప్రయాసపడాలి. అందుకోసం సన్నకారు రైతులూ, చిరువ్యాపారులూ పడే కష్టాలనీ, ఆర్థిక ఇబ్బందులనీ చూసి చలించిన ముగ్గురు కుర్రాళ్లు పరిష్కార మార్గం కనిపెట్టి... పొలం దగ్గరికే కోల్డ్‌ స్టోరేజీని పంపుతున్నారు.

కొనేది గుప్పెడు మల్లె మొగ్గలే అయినా తాజాగా ఉన్నాయా సువాసన వస్తున్నాయా అని పట్టి పట్టి చూసి మరీ కొంటాం. వాటిని పండించే రైతు తోట నుంచి ఎంతో జాగ్రత్తగా మార్కెట్‌కి చేరవేస్తేనే పువ్వులు వాసన వెదజల్లుతూ తాజాగా కనిపించేది. గులాబీలూ లిల్లీలూ కూడా అంతే త్వరగా కోసిన వెంటనే అమ్మకపోతే రెక్కలు ఊడిపోతుంటాయి. చేపలూ, రొయ్యలేమో పట్టిన తరవాత ఎక్కువ సేపు బయట ఉంటే చెడిపోతాయి. అందుకోసం రైతులు ఖర్చుతో కూడుకున్నా సరే పంటకు గిట్టుబాటు ధర రావాలని ఏ పూటకాపూట వాటిని కోసి మార్కెట్‌కు చేరవేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే వ్యయ ప్రయాసలెన్నో. రైతుల కష్టాలు ఇలా ఉంటే... పూలూ, పండ్లూ, చేపలూ, పాలూ అమ్ముకునే వ్యాపారులు కూడా- వాటిని పాడవకుండా అమ్మేసుకోవాలి. అమ్ముడు పోకపోతే ఫ్రిజ్‌లో పెట్టాలి. రైతులూ, చిరువ్యాపారులూ అలా ఇబ్బందిపడకుండా పోర్టబుల్‌ కోల్డ్‌ స్టోరేజీ బాక్సులను తక్కువ ధరకే అందించి వారికి ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి ఆదాయం పెంచుతోంది చెన్నైకి చెందిన ‘టాన్‌90’ అనే స్టార్టప్‌. రైతు నేపథ్యం నుంచీ వచ్చిన ముగ్గురు మిత్రుల ఆలోచనే ఈ అంకుర సంస్థ. వీళ్ళు అందించే ఆ బాక్సులూ, బ్యాగుల వల్ల తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు ఆరు వేల మంది రైతులు లాభపడుతున్నారు.

రాశిఫలం (మే 12 - మే 18)

పది గంటలు తాజాగా..

సౌమల్య ముఖర్జీ, రజనీకాంత్‌ రాయ్‌, శివశర్మ... మద్రాస్‌ ఐఐటీలో పీహెచ్‌డీ చేశారు. కోల్డ్‌స్టోరేజీ సదుపాయాలను చిన్న చిన్న వ్యాపారులకూ, రైతులకూ కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ ముగ్గురు మిత్రులు కలిసి 2019లో ‘టాన్‌90’ని ప్రారంభించారు. మొదట పాల ప్యాకెట్ల రవాణాకు ఉపయోగపడే 40 లీటర్ల పోర్టబుల్‌ కోల్డ్‌స్టోరేజి యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతలో కొవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలోనే తాజా కూరగాయలూ, పండ్లూ, ఫ్రోజెన్‌ ఫుడ్‌కు బాగా డిమాండ్‌ పెరగడంతో కూలింగ్‌ కెమికల్స్‌ మీద పరిశోధనలు మొదలుపెట్టింది శివ మిత్రబృందం. అందులో భాగంగానే 13 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి మైనస్‌ 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతను నియంత్రించే బాక్సులనూ, బ్యాగ్‌లనూ తయారుచేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. సాధారణంగా ఆహారపదార్థాలూ, త్వరగా పాడయ్యే ఉత్పత్తుల రవాణాకు ఏసీ ట్రక్కులను వాడతారు. చేపలూ, రొయ్యలకైతే ఎక్కువ మొత్తంలో ఐస్‌ కావాలి. టాన్‌90 సంస్థ తయారుచేసిన బాక్సులూ, బ్యాగుల్లో అయితే ఎలాంటి ఖర్చు లేకుండానే- త్వరగా పాడయ్యే వాటిని నిల్వ చేయొచ్చూ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా తేలిగ్గా తరలించొచ్చూ. ‘ఫేజ్‌ ఛేంజ్‌ మెటీరియల్స్‌’ (పీసీఎం)గా పిలిచే ప్రత్యేకమైన కూలింగ్‌ కెమికల్స్‌తో తయారయ్యే ఈ పౌచ్‌లను కొన్ని గంటలు ఫ్రిజ్‌లో పెడితే చాలు... వాటిలోని ఆ లిక్విడ్‌  దాదాపు పదిగంటలపాటు చల్లగా ఉండి... బాక్సులోని పదార్థాలు చెడిపోకుండా తాజాగా ఉంచుతుంది. పైగా ఈ పోర్టబుల్‌ కోల్డ్‌ స్టోరేజీ వల్ల ఎలాంటి కర్బన ఉద్గారాలూ విడుదల కావు. ఈ ప్రాజెక్టు పర్యావరణహితం కావడంతో ఐరాస పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ‘టాన్‌90’కి ఆర్థిక ప్రోత్సాహం అందించింది.

ఆనందమే అందం

ఐదేళ్ల క్రితం చెన్నైలో ప్రారంభమైన టాన్‌90 మొదట తమిళనాడులోని చిరువ్యాపారులకు పోర్టబుల్‌ కోల్డ్‌స్టోరేజీలను అందించింది. ఆ వ్యాపారులు వాటితో లాభపడటం వల్ల ఈ సంస్థకు ఆదరణ పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలకూ సేవల్ని విస్తరించి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లోని రైతులకు తమ ఉత్పత్తుల్ని చేరవేశారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలూ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏపీ, తెలంగాణలోని సన్నకారు రైతులకు ఈ కోల్డ్‌ స్టోరేజీలను సమకూరుస్తున్నాయి. ఐస్‌క్రీముల నుంచి వ్యాక్సిన్ల వరకూ నిర్దేశిత ఉష్ణోగ్రత ఉండేలా చూస్తూ ప్రత్యేకంగా బ్యాగులూ, బాక్సులూ రూపొందిస్తున్న టాన్‌90 వినియోగదారుల జాబితాలో స్విగ్గీ, జొమాటో, జెప్టోలాంటి పెద్ద సంస్థలు సైతం చేరడం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..