Published : 31 Dec 2016 03:19 IST

సొగసునామ సంవత్సరం

సొగసునామ సంవత్సరం

కుర్రకారుకు ఈ యేడాది అచ్చంగా సొగసునామ సంవత్సరమే.
కాలేజీ క్యాంపస్‌లు.. కార్పొరేట్‌ కార్యాలయాలు.. ఫ్యాషన్‌వీక్‌లు.. ఎక్కడ చూసినా సొగసుల తళతళలే. గతేడాది మేటి స్టైల్స్‌ను ఆదరిస్తూనే ఈ ఏడాది మరిన్ని నయా ట్రెండ్‌లను ఆదరించారు యూత్‌. అందులో కొన్ని టాప్‌ ఫ్యాషన్లు.
ఆఫ్‌షోల్డర్స్‌: భుజాల కిందకి దిగిన ఆఫ్‌షోల్డర్‌ ఫ్యాషన్లు ఈ ఏడాది బాగా పాపులర్‌ అయ్యాయి. ముఖ్యంగా ఆధునికతను ఇష్టపడే కాలేజీ అమ్మాయిలు ఈ స్టైల్‌ వెంట పరుగులు తీశారు. కొంచెం సంప్రదాయంగా కనపడాలనుకునే వారు పొడుగు చేతుల రవికలకు ఈ ఫ్యాషన్‌ని అద్దారు.
చోకర్‌ నెక్లెస్‌: తొంభైలలో బాగా పాపులర్‌ అయిన ఈ ట్రెండ్‌ కొద్దిపాటి మార్పులతో మళ్లీ ప్రాణం పోసుకుంది. సన్నటి పట్టీలా మెడను చుట్టేసేలా చిన్నచిన్న ఆభరణాలు ధరించడం టీనేజీ అమ్మాయిల నుంచి ఫ్రౌడల వరకు పరిపాటైంది.
డీఐవై: ఫలానా హీరోయిన్‌ తొడిగిందనో.. ఏదో ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించారనో.. వాటిని అనుకరించడం కొందరికి అసలు నచ్చదు. ఎవరికి నచ్చినట్టు వారు ప్రత్యేకంగా డిజైన్స్‌ చేసుకునే ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌’ ఫ్యాషన్‌ని యువతరం బాగా ఆదరించారంటోంది స్టైలిస్ట్‌ చందనా.
హైనెక్‌, ఫుల్‌స్లీవ్‌: పండగలు, ఉత్సవాల సమయాల్లో సంప్రదాయాన్ని పాటించాలనుకునే అమ్మాయిలు హైనెక్‌, ఫుల్‌స్లీవ్‌ బ్లౌజ్‌లకు ఓటేశారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారల నుంచి సందు చివరి కాలేజీ అమ్మాయిదాకా వీటిపై మోజు పడ్డారు.
లినెన్‌ చొక్కాలు: ఈసారి కుర్రాళ్ల మదిని ఎక్కువగా దోచింది లినెన్‌ చొక్కాలు. స్టైల్‌తోపాటు సౌకర్యవంతంగా ఉండటంతో కాలేజీ అబ్బాయిలు, కార్పొరేట్‌ ఉద్యోగులు ఎక్కువగా ఆదరించింది వీటినే. మింట్రా, అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌.. ఏ ఆన్‌లైన్‌ అంగళ్లొ అయినా వీటి అమ్మకాలు జోరుగా సాగాయి.
బాంబర్‌ జాకెట్స్‌: చలికి చెక్‌ పెడుతూనే, పైలాపచ్చీసులా స్టైల్‌గా కనిపించే అవకాశం ఉండటంతో బాంబర్‌ జాకెట్ల ట్రెండ్‌ జోరందుకుంది ఈ సంవత్సరంలో. ఇది అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరికీ నప్పే ట్రెండ్‌.
డార్క్‌ కలర్‌ షేర్వాణీ: ఎంత కుర్రకారైనా సంప్రదాయానికీ పెద్దపీట వేసే మనస్తత్వం ఉన్నవాళ్లు మనోళ్లు. అందుకే పండగ వేళల్లో, ఉత్సవాలపుడు ఆకట్టుకునేలా ఉండటానికి షేర్వాణీల బాట పట్టారు. అందులోనూ ముదురు రంగువి ఈ ఏడాది టాప్‌లో నిలిచాయి.
లోఫర్‌ షూస్‌: జుత్తు నుంచి కాలి వేళ్ల వరకు అందంగా కనిపించడమే స్టైల్‌. అందుకే కాళ్లకు కూడా వూపు తేవాలని 2016 తరం అబ్బాయిలు లోఫర్‌ షూస్‌తో బాగా సందడి చేశారు.
- చోకర్స్‌, కాప్లెట్స్‌, మైక్సోప్లీట్స్‌, కోల్డ్‌ షోల్టర్లు, ఎంబ్రాయిడరీ డెనిమ్స్‌, వదులు చేతుల రవికెలు సైతం పాపులరై ఈ ఏడాది ఫ్యాషన్ల జోరుకు మరింత వూపు తెచ్చాయి.

ఫిట్‌నెస్‌ జోరు
ఈ ఏడాది కూడా కుర్రకారులో ఫిట్‌నెస్‌ జోరు కొనసాగింది. ఎక్కువ మంది జుంబారే.. జుజుంబరే అంటూ జుంబా డాన్స్‌ వెనకాల పరుగెత్తారు. ఫిట్‌నెస్‌తోపాటు మనసుకి వూపు తెచ్చే డ్యాన్స్‌ మూవ్‌లు ఉండటం దీని ప్రత్యేకత. కుర్రాళ్లు ఆదరించిన మరో ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌. నాలుగైదు రకాల పోరాట విన్యాసాలతోపాటు ఫిట్‌నెస్‌కి అనుకూలంగా ఉంటుందని వారు దీనిపై మోజు పడ్డారు. క్రాస్‌ఫిట్‌, కంబైన్‌ ట్రైనింగ్‌, టీఆర్‌ఎక్స్‌లాంటి భారీ కసరత్తుల్ని ఇష్టపడే యువతీయువకులు ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌కి పెద్దపీట వేశారు. కసరత్తులు, వ్యాయామాలు ఒక ఎత్తైతే ఆధునిక గ్యాడ్జెట్లు కూడా వ్యాయామశాలల్లోకి ప్రవేశించాయి. ఎంత తిన్నాం, ఎన్ని కేలరీలు కరిగించాం, ఎంత దూరం నడిచాం, ఎంత సేపు పడుకున్నాం.. ఇలా ప్రతీదీ లెక్కగట్టే గ్యాడ్జెట్లు యువత ఒంటిని అంటుకుపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు