ఆ కళ్ళ కోసం...వేచిచూస్తున్నా!

నేను చూసినవన్నీ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీలే. ఎందుకు విడిపోయారు? అని అడిగితే ఏదొక కారణం చెప్పేవారు ఫ్రెండ్స్‌. దీంతో నాకు నిజమైన ప్రేమంటే ఏమిటో తెలిసేది కాదు. అంతేకాదు.. అమ్మాయిలంటే కాస్త భయం కూడా మొదలయ్యింది. దీంతో నా...

Published : 04 Nov 2017 01:50 IST

మనసులో మాట!
ఆ కళ్ళ కోసం...వేచిచూస్తున్నా!

నేను చూసినవన్నీ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీలే. ఎందుకు విడిపోయారు? అని అడిగితే ఏదొక కారణం చెప్పేవారు ఫ్రెండ్స్‌. దీంతో నాకు నిజమైన ప్రేమంటే ఏమిటో తెలిసేది కాదు. అంతేకాదు.. అమ్మాయిలంటే కాస్త భయం కూడా మొదలయ్యింది. దీంతో నా ఇంజినీరింగ్‌ మూడో ఏడాది వరకూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాణ్ణి కాదు. ఓ రోజు బస్సులో జరిగిన సంఘటన నన్ను తనపై దృష్టిమళ్లేలా చేసింది. ఎప్పటిలా కాలేజీ బస్సు కోసం ఎదురు చూస్తున్నా. పక్కనే ఓ అమ్మాయి వచ్చి నిలబడింది. బస్సు కోసం ఎదురు చూస్తూ ఆలోచనలో పడ్డా... తనని ఎక్కడో చూశానని. మా కాలేజీనే అనుకుంటున్నా.. ఇంతలోపు బస్సు వచ్చింది. బస్సు ఎక్కే క్రమంలో ముందు... మీరంటే.. మీరని ఎక్కే క్రమంలో తడబడ్డాం. తన్నే ముందని చెప్పి నేను వెనకే ఎక్కాను. ఎందుకో తెలీదు. తన వెనక సీట్లోనే కూర్చున్నా. బస్సు ఫుల్‌ అయింది. తను చెవిలో హెడ్‌సెట్‌ పెట్టుకుని పాటలు వింటోంది.

ఇంతలో ఓ పెద్దాయన కిక్కిరిసి ఉన్న బస్సులో సీటు వెతుక్కుంటూ మా సీట్ల దగ్గర్లో నిలబడ్డాడు. ఇద్దరం ఒకేసారి లేచి నిల్చున్నాం. కూర్చోమని. ఆయన వచ్చి నా సీట్లోనే కూర్చున్నాడు. అప్పుడు తన నన్ను చూసి ఓ చిరునవ్వు నవ్వింది.

అదే తొలిసారి నాకో అమ్మాయి అందంగా కనిపించడం. అంతేకాదు.. ప్రతి స్పందనగా నేను విసిరిన చిరునవ్వుతో నా మెదడులో కొన్ని రసాయన చర్యలు చోటు చేసుకున్నాయి. ఆలోచనలో పడ్డా. ఇద్దరం ఒకేసారి ఎలా లేచాం? అంతే... తనూ నాలానే ఆలోచిస్తుందన్నమాట అనుకుంటుండగానే. నా చేయిని ఎవరో తట్టినట్టు అనిపించింది. ఎవరో కాదు. తనే. ‘మీ బ్యాగు ఇవ్వండి. నేను పట్టుకుంటా’ అంది. ఫర్వాలేదని మొహమాటంగా అంటూనే బ్యాగుని తీసిచ్చాను. ఒక్కసారిగా ఎందుకో నా బాడీ లాంగ్వేజీ మారిందనిపించింది. జుట్టు సరి చేసుకోవడం... చొక్కా చేతి మడతలు సరి చేసుకోవడం... ఇంతకు ముందెప్పుడు ఇవి నాకు కొత్తగా అనిపించలేదు. ఇప్పుడే ఎందుకిలా... ఆలోచిస్తున్నా. కాలేజీ స్టాప్‌ రావడంతో కండక్టర్‌ విజిల్‌ వేశాడు. తెలివిలోకి వచ్చి తమాయించుకుని నా బ్యాగు తీసుకున్నా. తను ‘మీ పేరూ?...’ అని అడిగేలోపే శివ అని చెప్పేశా. నేను లాస్య అంటూ.. బాయ్‌ చెప్పి వెళ్లిపోయింది. మూడేళ్లలో మొదటిసారి కాలేజీ గేటు దాటుతుంటే. ఓ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వినిపించింది. హ్యాపీడేస్‌ సినిమాలో ‘అరెరే.. అరెరే.. మనసే జారే’... ఎగ్జాక్ట్‌ ట్యూన్‌ అనుకోవచ్చు. రోజూ తిరిగిన ఈసీఈ బ్లాకు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి రంగుల్లో మారినట్టయింది. నా వాలకం చూసి ఫ్రెండ్స్‌ మాత్రం.. వీడికీ ప్రేమలో ‘పడే’ కాలం వచ్చిందన్నట్టుగా చూశారు.

అయితే, మరో సంఘటన నిజంగా నన్ను ప్రేమలో పడేలా చేసింది. ఓ రోజు నా ఫ్రెండ్‌ వాళ్ల అమ్మ సర్జరీకి బ్లడ్‌ అవసరం అయింది. అదీ ఎక్కువ మొత్తంలో. మేం అదే విషయాన్ని కాలేజీ వాట్స్‌ఆప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాం. ఫోన్‌ నెంబర్‌ నాదే ఇచ్చాను. కాసేపట్లోనే ఫోన్‌ రింగ్‌ అయింది. లిఫ్ట్‌ చేస్తే తన వాయిస్‌. నాకు మాటలు రాలేదు. తనూ అవాక్కయింది.

వచ్చి రక్తదానం చేసింది. నేనే జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్లింటి దగ్గర డ్రాప్‌ చేసి వచ్చాను. ఆ రోజు నుంచి మది నిండా తన ఆలోచనే. ఎప్పుడూ క్యాంటీన్‌... కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ వైపు మళ్లే నా కాళ్లు తన ‘ట్రిపుల్‌ ఈ’ బ్లాకు వైపు నడిచాయి. పనేం లేకపోయినా తనని చూసేందుకు వెళ్లేవాడిని. రెండు... మూడు సార్లు గమనించి నన్ను అడిగింది. ఏంటి విషయం అని? ‘నేను కళ్లలోకి చూస్తూ... ప్రేమిస్తున్నా’ అని చెప్పేశా. చెప్పేటప్పుడు నా కళ్లలో నిజం.. నా మాటల్లో నిజాయితీ... రెండూ తనకి అర్థమయిందో ఏమో.. తను మాట్లాడడం మొదలుపెట్టింది. ‘శివ.. మాది ఉమ్మడి కుటుంబం. బంధాలు... బంధుత్వాలు... మర్యాదలు.. కట్టుబాట్లు... ఇలా అన్నింటి మధ్య ఒద్దికగా పెరిగాను. నాకు ఈ కాలేజీ ప్రేమలు... రిలేషన్స్‌పై పెద్దగా నమ్మకం లేదు. అలాగని, నువ్వంటే నాకు ఎలాంటి ఫీలింగ్‌ లేదని కాదు. నాకో లక్ష్యం ఉంది. ఇప్పటికి నేను దాన్నే ప్రేమిస్తున్నాను. మా నాన్న నన్ను కెరీర్‌లో ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నారు. ముందు నేను కూతురుగా ఆయన్ని తృప్తి పరచాలి. తర్వాతే.. నా సొంత అభిరుచులు.. ఇష్టాలు.. అప్పటి వరకూ ప్లీజ్‌ నన్ను ఇబ్బంది పెట్టకు’ అంది.

తన కళ్లలో కుటుంబం పట్ల విధేయత... మాటల్లో నాన్న బాధ్యాయుతమైన పెంపకం కనిపించాయి. అంతే... షేక్‌ హ్యాండ్‌ ఇచ్చా.. ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పడానికి. తనని తాకడం అదే అదే తొలిసారి. ఇంజినీరింగ్‌ అయిపోయింది. కాలేజీ వీడ్కోలు సమావేశంలో నేను తనని ఉద్దేశిస్తూ రాసిన ‘కవిత’కి ఫస్ట్‌ ఫ్రైజ్‌ వచ్చింది. కాలేజీ మ్యాగజీన్‌లో పబ్లిష్‌ కూడా చేశారు. ‘మంచి రైటర్‌’ ఉన్నాడు నీలో అంటూ కొంటెగా చూసింది. ఇప్పుడు తనూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది.. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ.. తన స్పర్శ నాకు రెండో సారి పరిచయం..

అలా చేతిని చూసుకుంటూ... చివరి రోజు గేటు దాటుతుంటే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌... ‘వీడుకోలే... వేదికైనా... వీడలేని స్నేహమైనా... హ్యాపీడేస్‌... హ్యాపీడేస్‌’ అని. చూస్తేనే ఏడాది గడిచింది. తను సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతోంది. నేను ఎం.టెక్‌ క్యాంపస్‌లో... తన విలువైన ప్రేమ కోసం వేచిచూస్తున్నా.

- శివ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని