SECI: సెకి దస్త్రానికి.. 7 గంటల్లో ఆమోదం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Nov 2024 06:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఆర్థిక శాఖ నుంచి ‘అర్ధరాత్రి’ అనుమతి
పరుగులు పెట్టిన దస్త్రం
ఒక్క రోజులో.. ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్‌ ప్రభుత్వం
ఫలితం.. 25 ఏళ్లలో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల భారం

ఈనాడు, అమరావతి: ఆర్థికశాఖలో ఒక దస్త్రం కార్యదర్శి నుంచి కిందిస్థాయి వరకు నాలుగైదు దశల్లో వడపోత తర్వాత ఆమోదం లభిస్తుంది. ఈ దశల్లో కొర్రీ వేస్తే.. మళ్లీ సంబంధిత శాఖకు వచ్చి వెళ్లాల్సిందే. సెకి దస్త్రానికి మాత్రం మినహాయింపు. అధికారులు ఆమోదముద్ర వేసి పంపడానికి పట్టిన సమయం.. 7 గంటలు. అదీ అర్ధరాత్రి. రూ.1.10 లక్షల కోట్ల విద్యుత్‌ కొనుగోళ్ల దస్త్రాన్ని ఆర్థికశాఖ ఆఘమేఘాల మీద ఆమోదించింది. దీనివెనుక ప్రభుత్వ పెద్దలు ఎంతగా ఒత్తిడి చేయకుంటే దస్త్రం ఇంతలా పరుగులు పెడుతుంది? 

  • అది 2021 సెప్టెంబరు 15వ తేదీ.. సాయంత్ర 5.30 గంటలు. మిగిలిన కార్యాలయాన్నీ మూతపడ్డాయి. ఇంధనశాఖ.. ఆర్థికశాఖ.. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) సిబ్బంది మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. కారణం.. మర్నాడు జరిగే మంత్రివర్గ భేటీకి సెకి దస్త్రం పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరకపోగా.. 25 ఏళ్లలో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నిపుణుల అంచనా. సెకి ఒప్పందం ద్వారా జగన్‌కు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. దీంతో ఆ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దస్త్రం సిద్ధం చేయడంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. 

రాత్రికి రాత్రే.. దస్త్రం తయారు 

జగన్‌ ప్రభుత్వం 10 గిగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు టెండర్లు పిలిచింది. అయితే, ప్రాజెక్టుల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. దానికి ప్రత్యామ్నాయంగా సెకి నుంచి విద్యుత్‌ తీసుకోవాలని నిర్ణయించారు. అది తీసుకోడానికి ముందు ఎంత కసరత్తు జరగాలి? విద్యుత్‌ తీసుకుంటే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి? అంత విద్యుత్‌ వినియోగించగలమా? ప్రజలపై ఎలాంటి ఆర్థికభారం పడుతుంది? ఇలాంటి లెక్కలు వేయాలి. ఎంత లేదన్నా.. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ, జగన్‌ ప్రభుత్వానికి మాత్రం గంటల వ్యవధి చాలట! సెకి నుంచి ప్రతిపాదన అందిన మర్నాడే క్యాబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపింది. 7వేల మెగావాట్లు కొనేందుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. లాభనష్టాలను అంచనా వేయకుండా అంత గుడ్డిగా ముందుకు వెళ్లిందంటే.. ప్రజా ప్రయోజనాలపై జగన్‌ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.

2021 సెప్టెంబరు 15న రాష్ట్రప్రభుత్వానికి సెకి తొలిసారిగా ప్రతిపాదన అందించింది. కేంద్రం రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద 9 గిగావాట్ల సౌరవిద్యుత్తు కొనాలని ప్రతిపాదించింది. సెకి నుంచి ప్రతిపాదన రాగానే.. దస్త్రం తయారీకి సీఎస్‌ నుంచి ఆదేశాలు అందాయి.


ఈ ప్రతిపాదనపై అధికారులు చేసిన సూచనలు

  • రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ టెండర్ల ద్వారా యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ సరఫరాకు బిడ్‌లు వచ్చాయని.. ఆధరకు విద్యుత్తు ఇస్తామని సెకి చెప్పింది.
  • ఈ ప్రాజెక్టుకు 25 ఏళ్లు అంతర్రాష్ట్ర పంపిణీ రుసుమును కేంద్రం మాఫీ చేసింది.
  • 10 గిగావాట్లు కాకుండా అవసరం మేరకే కొనుగోలు పరిమితం చేయాలి.

ఒక్కరోజు.. ఏం జరిగిందంటే!

  • సెకి ప్రతిపాదనను 2021 సెప్టెంబరు 15న మంత్రివర్గం ముందు ఉంచాలని సీఎస్‌ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇంధనశాఖ అదే రోజు సాయంత్రం 3 గంటలకు దస్త్రం తయారుచేసి.. ఫైల్‌ను సూచనల కోసం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు పంపింది. సాయంత్రం 5 గంటలకు ఆయన ఆమోదం తెలిపారు. అనంతరం దస్త్రాన్ని ఆర్థికశాఖకు ఇంధనశాఖ అధికారులు పంపారు. ఆర్థికశాఖ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమోదం తెలిపింది. 
  • 2021 సెప్టెంబరు 16న ఉదయం 7 గంటల సమయంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ ఈ-ఫైల్‌ను సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు పంపారు. ఆయన ఉదయం 7.45 గంటలకు ఆమోదం తెలిపి.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మంత్రి బాలినేని దాన్ని ఆమోదించారు.
  • తర్వాత క్యాబినెట్‌లో ప్రవేశపెట్టడానికి సీఎం పరిశీలనకు అధికారులు పంపారు. ఒప్పందం ప్రతిపాదనను క్యాబినెట్‌ ముందు ఉంచాలని సీఎం ఉదయం 8.10 గంటల సమయంలో అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ కొనుగోలు ప్రతిపాదన వివరాలను.. మంత్రిమండలి ఆమోదం కోసం క్యాబినెట్‌ ముందు ప్రభుత్వం ఉంచింది.
  • 2021 సెప్టెంబరు 16న ఏపీజీ ఈసీఎల్‌ చెప్పినట్లు యూనిట్‌ రూ.2.49 ధరకు.. 30 ఏళ్లపాటు సెకి నుంచి సౌరవిద్యుత్‌ తీసుకోవాలన్న ప్రతిపాదనను క్యాబినెట్‌ ఆమోదించింది.
Tags :
Published : 25 Nov 2024 06:36 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు