Polavaram: పోలవరానికి ఐదోసారి విదేశీ నిపుణులు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Aug 2025 06:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

నేటి నుంచి 3 రోజులు పర్యటన

ఈనాడు, అమరావతి: పోలవరం సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం నియమించిన విదేశీ నిపుణుల బృందం ఐదోసారి ప్రాజెక్టును సందర్శిస్తోంది. మూడురోజుల పాటు ఈ బృందం పోలవరంలోనే ఉంటుంది. విదేశీ నిపుణులు డిసిస్కో, రిచర్డ్‌ డొన్నెల్లీ, డేవిడ్‌ పాల్‌ శుక్రవారం నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శించడంతో పాటు అనేక అంశాలపై మేధోమథనం చేయనున్నారు. వీరితోపాటు కేంద్రజలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ సింఘాల్, కేంద్రజలశక్తి శాఖ సీఈ ఎస్‌.బక్షి, డైరెక్టర్‌ రాకేష్, పోలవరం అథారిటీ కార్యదర్శి ఎం.రఘురామ్, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నుంచి మనీష్‌ గుప్తా పాల్గొంటారు. 


ప్రధాన చర్చనీయాంశాలు..

శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. బట్రస్‌ డ్యాం, గ్యాప్‌-1 ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంలో 200 మీటర్ల వద్ద లీకేజీ ఉన్న ప్రాంతం పరిశీలిస్తారు. మేఘా, జలవనరులశాఖ ఏర్పాటుచేసిన ల్యాబ్‌లను పరిశీలిస్తారు.

  • డయాఫ్రం వాల్‌ నిర్మాణం, గ్యాప్‌-1 ప్రధాన డ్యాం పనులు, బట్రస్‌ డ్యాం పనులపై సమీక్షిస్తారు. డి-హిల్, జి-హిల్‌ వద్ద చేయాల్సిన పనులపైనా సమీక్ష ఉంటుంది.
  • ప్రధాన డ్యాం గ్యాప్‌1లో పనులు చేపట్టారు. గోదావరి మట్టాన్ని సహజస్థాయికి తీసుకొచ్చేందుకు అక్కడ రాయితో నింపుతున్నారు. ఆ పనులపై చర్చలు. గ్యాప్‌-2 ప్రధాన డ్యాం నిర్మాణానికి సంబంధించి మీనియేచర్‌ తరహా కట్టడం నిర్మాణ పనులు, వాటి ఫలితాలపై చర్చలు. ప్రధాన డ్యాం గ్యాప్‌-1 ఆకృతులపైనా సమీక్ష.
  • గ్యాప్‌-2 ప్రధాన డ్యాం ఆకృతులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రధానంగా బంకమన్ను ఉన్న ప్రాంతంలో ఎలా, ఇసుక రీచ్‌లో ఎలాంటి నిర్మాణాలు అన్న అంశాలతో పాటు ఆకృతులపైనా సమీక్ష. గ్యాప్‌-2 డ్యాం నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఉందా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా చర్చ
  • పోలవరంలో నాణ్యత, నియంత్రణపై మాన్యువల్‌ రూపకల్పనకు గత పర్యటనలో సిఫార్సు చేశారు. ఆ మాన్యువల్‌పై చర్చలు. స్పిల్, అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకాలు, గైడ్‌బండ్‌ నిర్మాణం, అఖండ గోదావరి ఎడమగట్టు రక్షణ పనులపై సమీక్ష.

సిఫార్సుల అమల్లో బాకీలు ఎన్ని?

విదేశీ నిపుణుల బృందం నాలుగు పర్యటనల్లో అనేక సిఫార్సులు చేసింది. అప్పట్లో డి వాల్‌ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగే సాగితే అనుకున్న సమయానికి పని పూర్తికాదని పేర్కొంది. తాజా పరిస్థితుల ప్రకారం డి వాల్‌లో కొంత వేగం పెరిగింది. దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. డి వాల్‌ బ్లీడింగ్‌పై అప్పట్లో చర్చలు జరిగాయి. ఉష్ణోగ్రత, ఇతరత్రా మార్పుల వల్ల ఆ సమస్య పరిష్కారమైందని అధికారులు పేర్కొంటున్నారు. కోర్‌ తీసి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు.

  • ఆకృతుల రూపకల్పనకు డేటాను ఆధునికీకరించాలని సిఫార్సు చేశారు. డైనమిక్‌ సిస్మిక్‌ విశ్లేషణ లేదని పేర్కొన్నారు. ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది.
  • ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో సీపేజి నీళ్లు నిల్వ ఉండకుండా పంపుల సామర్థ్యం సరిపోతుందా లేదా అనేది నిర్ధారించాలని గతంలో సూచించారు. ఈ వరద కాలంలో గోదావరిలో తక్కువ ప్రవాహాలే ఉన్నాయి. ఇంతవరకు ఆ ఇబ్బంది లేదు.
  • నాణ్యత మదింపు మాన్యువల్‌ సిద్ధం చేశారు. తుదిరూపు రావాల్సి ఉంది.
  • ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుకు తుదిరూపు ఇవ్వాలని గతంలో సిఫార్సు చేశారు. ప్రైమావీరా సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా దాన్ని సమీక్షించాలనేది ఉద్దేశం. తుదిరూపు రావాల్సి ఉంది.
Tags :
Published : 29 Aug 2025 04:02 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని