Billionaires: భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక

Eenadu icon
By Business News Team Published : 04 Nov 2025 13:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో అత్యంత ధనవంతులైన ఒక శాతం కుబేరుల సంపద 23 ఏళ్లలో 62 శాతం పెరిగింది. జీ20 నివేదిక (G20 Report) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు అత్యయిక పరిస్థితికి చేరాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదిక తయారీకి నోబెల్‌ గ్రహీత జోసఫ్‌ స్టిగ్లిట్జ్‌ నేతృత్వం వహించారు.

2000 నుంచి 2023 మధ్యకాలంలో యావత్ ప్రపంచం సృష్టించిన సంపదలో 41 శాతం అగ్రశ్రేణి, ఒక శాతం కుబేరుల వద్దే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దిగువస్థాయిలో ఉన్న 50 శాతం మంది ఒక శాతం సంపదను పొందారని పేర్కొంది. ఈ అసమానతలను అత్యయిక పరిస్థితిగా అధ్యయనంలో పాల్గొన్న ఆర్థిక నిపుణులు అభివర్ణించారు. చైనా, భారత్ వంటి దేశాలు అభివృద్ధి మార్గంలో ఉండటం వల్ల ఆ దేశాల మధ్య అంతరాలు కాస్త తక్కువగా ఉన్నాయని, కానీ చాలా దేశాల్లో అసమానతలు పెరిగాయని వెల్లడించారు.  

ఈ అసమానతలను విస్మరించడం వల్ల కలిగే నష్టాలను నివేదికలో ఎత్తిచూపింది. తీవ్ర అసమానతలను ఎదుర్కొంటున్న దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చూసే అవకాశం ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2.3 బిలియన్ల  ప్రజలకు ఆహార భద్రత లేదని, వైద్య ఖర్చులు వంటివాటితో 1.3 బిలియన్ల ప్రజలు దారిద్ర్యంలోకి జారిపోయారని పేర్కొంది. కొందరి చేతుల్లోనే సంపద కేంద్రీకృతం కావడం సామాజికంగా జరుగుతోన్న అన్యాయం మాత్రమే కాదని, అది అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు విధానపరమైన చర్యలు అవసరం అని స్పష్టంచేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు