5 ముంపు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాల్సిందే

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 21 Jun 2025 07:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీలో విలీనం చేసిన 5 ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ప్రగతి ఎజెండా పేరుతో ఈ నెల 25న తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై చర్చించాలని సూచించారు. ‘పోలవరం.. తెలంగాణపై ఖడ్గం’ అనే అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. కవిత మాట్లాడుతూ.. ‘‘ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, కృష్ణగుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారు. ఏ ప్రభుత్వమూ వారిని పట్టించుకోవడం లేదు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది. లేనిపక్షంలో భారీ వరదలొస్తే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వతంగా ముంపు ముప్పు పొంచి ఉంది. పోలవరం స్పిల్‌వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచితే, బ్యాక్‌ వాటర్‌ సమస్య తలెత్తి భద్రాచల రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, భద్రాచలం డెవలప్‌మెంట్‌ ఫోరం, ఐదు గ్రామ పంచాయతీల హక్కుల సాధన సమితి నాయకులు జంగిలి సంపత్, ఆవులూరి సత్యనారాయణ, దాసరి బాలకృష్ణ, రాసాల నర్సయ్య, గొల్లపల్లి శివ, కాటిబోయిన ఆనంద్‌తోపాటు..వివిధ ప్రజాసంఘాల నాయకులు వీరన్న, రూప్‌సింగ్, లోకిని రాజు, కిషన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ప్రగతి ఎజెండా సమావేశంలో ప్రధాని ముందుంచి, పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు.

Tags :
Published : 21 Jun 2025 04:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు