Nimmala Rama Naidu: మీ అంతర్గత రాజకీయాల కోసం నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటారా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 18 Jun 2025 06:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. గోదావరి వరద జలాలే రాయలసీమకు శరణ్యం అనలేదా?
మరి ఇప్పుడు భారాస నేతల విమర్శలు ఎందుకు?
వారిపై జగన్‌ నోరు విప్పరేం?
అన్ని అనుమతులతోనే పోలవరం - బనకచర్ల చేపడతాం 
తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదు
మంత్రి నిమ్మల రామానాయుడు
కేసీఆర్, జగన్‌ ప్రకటనల వీడియోల ప్రదర్శన 

ఈనాడు, అమరావతి: ‘పోలవరం బనకచర్ల అనుసంధానం విషయంలో సాంకేతిక అంశాలపై కన్నా అంతర్గత రాజకీయాల పైనే తెలంగాణ రాష్ట్ర నాయకుల తపన ఉంది. వారి రాజకీయ అవసరాల కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవడం ఎంతవరకు సబబు?’ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. ‘రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే గోదావరి వరద జలాలు మళ్లించడం ఒక్కటే మార్గమని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన సీఎం హోదాలో నగరికి వచ్చారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులుగా కేసీఆర్, జగన్‌ సమావేశమయ్యారు. గోదావరి వరదజలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు మళ్లిస్తామని ప్రకటించారు. మరి భారాస నేతలు ఇప్పుడు పోలవరం బనకచర్ల అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారు అలా మాట్లాడుతున్నా జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అన్ని అనుమతులూ తీసుకునే ఈ ప్రాజెక్టు చేపడతాం. ఈ అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు ఏమీ నష్టం లేదు. దిగువన సముద్రంలో వృథాగా కలిసిపోతున్న జలాల్లో 200 టీఎంసీలనే దుర్భిక్ష రాయలసీమకు మళ్లిస్తాం. ఏ రాష్ట్రానికీ దీని వల్ల నష్టం లేదు’ అని ఆయన సుస్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. నాడు జగన్, కేసీఆర్‌లు ఏం మాట్లాడారో వీడియోలు ప్రదర్శించారు. 

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి వివరిస్తున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

అనుమతులు లేవనడం అసత్యం

‘పోలవరం బనకచర్ల అనుసంధానానికి అనుమతులు లేవంటూ తెలంగాణ నేతల విమర్శలు సరికాదు. 2025 మే 22న ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక కేంద్ర జల సంఘానికి సమర్పించాం. దానిని ఆమోదించిన తర్వాత డీపీఆర్‌ సమర్పిస్తాం. కేంద్ర పర్యావరణ శాఖకు టీఓఆర్‌ (టెర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్సు) పంపాం. ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 2,000 టీఎంసీల్లో 200 టీఎంసీలనే ఈ ప్రాజెక్టుకు తీసుకుంటున్నాం. మనం తీసుకోకపోతే అవి సముద్రంపాలవుతాయి. ఇక జలదోపిడీ ఎక్కడుంది? కేంద్రం అన్నీ పరిశీలించి అనుమతులు ఇస్తుంది’ అని మంత్రి చెప్పారు. 

ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు

‘ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్‌ గోదావరిలో చిట్టచివరి రాష్ట్రం. వరద జలాలు వాడుకోవడమనేది సహజ హక్కు. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు, నీటి అవసరాలు తీరిన తర్వాతే మిగులు జలాలను మేం ఈ ప్రాజెక్టుకు వాడుకుంటాం’ అని మంత్రి చెప్పారు. కరవు పీడిత, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతమైన రాయలసీమకే ఈ నీళ్లు తరలిస్తామని అన్నారు.

నిబంధనలు తెలంగాణకు వర్తించవా?

‘నిబంధనలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కేనా? తెలంగాణకు వర్తించవా? కేసీఆర్‌ హయాంలో కృష్ణా, గోదావరి బోర్డుల అనుమతులు లేకుండానే అక్కడ ప్రాజెక్టులు నిర్మించలేదా? వాటికి ఇప్పటికీ ఎపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవు కదా. కాళేశ్వరం, సీతారాంసాగర్, సమ్మక్క బ్యారేజి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అనుమతులు లేకుండానే చేపట్టిన విషయం వాస్తవం కాదా? నిబంధనల గురించి మీరు ఎలా మాట్లాడతారు?’ అని మంత్రి రామానాయుడు నిలదీశారు.

చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పుడూ సానుకూలమే

‘తెలంగాణ ఎగువ రాష్ట్రం. సరైన సాంకేతిక అనుమతులు లేకుండా వారు ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే నష్టపోతారు. దిగువ ప్రాంతాలకు నదీ జలాల చట్టంలోనే ప్రత్యేక అంశం ఉంది. చంద్రబాబు అది తెలియజెప్పారే తప్ప తెలంగాణ ప్రాజెక్టులను ఆపే దురుద్దేశం ఆయనకు లేదు. గోదావరి అవార్డు క్లాజు 4 ప్రకారం.. గోదావరి నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉందన్న అంశం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం, సీతారామసాగర్‌ ఎత్తిపోతల చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ హక్కుతోనే చేస్తోంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే దేవాదుల, బీమా చేపట్టారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ ద్వారా 20 టీఎంసీలు, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 6 టీఎంసీలు, ఏఎంఆర్‌ ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటిని చంద్రబాబు హయాంలోనే కేటాయించారు. 


నాడు కేసీఆర్‌ మాటలు మినిట్స్‌లో నమోదు

2016లో ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎంలుగా చంద్రబాబు, కేసీఆర్‌లు పాల్గొన్నారు. కృష్ణాలో 1,000 టీఎంసీల నీళ్లు కావాలని, గోదావరి నుంచి మళ్లించడం ఒక్కటే మార్గమని నాడు కేసీఆర్‌ చెప్పిన మాటలు మినిట్స్‌లో నమోదయ్యాయి. భారాస నేతలు ఇప్పుడు ఎలా అభ్యంతరం చెబుతారు? రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి గోదావరి వరద జలాల మళ్లింపు ఒక్కటే మార్గమని నాడు కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. (వీడియో ప్రదర్శన) కేసీఆర్‌తో ఒప్పందంపై జగన్‌ శాసనసభలో మాట్లాడారు (వీడియో ప్రదర్శన). రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లేందుకు కేసీఆర్‌ సహకరిస్తున్నారని జగన్‌ నాడు చెప్పారు. తెలంగాణ భూభాగం నుంచే రోజుకు 4 టీఎంసీలు మళ్లిస్తామని చెప్పారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ అంగీకరించినా.. ఆయన పార్టీలోని నాయకులకు ఇప్పుడు దిగువ నుంచి నీళ్లు తీసుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు?’ అని మంత్రి రామానాయుడు నిలదీశారు.

Tags :
Published : 18 Jun 2025 03:30 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు