Nimmala Ramanaidu: కృష్ణా, రాయలసీమకు పట్టిసీమ వరప్రదాయిని

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Jul 2025 05:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

స్విచ్‌ వేసి పట్టిసీమ నుంచి నీటి విడుదలను ప్రారంభిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు.

చిత్రంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు తదితరులు 

పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టాకు, రాయలసీమకు వరప్రదాయిని అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల నుంచి నీటి విడుదలను మంత్రి గురువారం ప్రారంభించారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం ఇటుకలకోట సమీపంలో పట్టిసీమ కుడి కాలువపై నిర్మించిన డెలివరీ సిస్టమ్‌ నుంచి బయటకు వస్తున్న గోదావరి నీటికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ‘పట్టిసీమతో 2014-19 మధ్య 263 టీఎంసీలు కృష్ణాకు తరలించాం. ఇది శ్రీశైలం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీలు వచ్చాయి. ఇది నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కంటే అధికం. వైకాపా హయాంలో నిర్వహణ గాలికొదిలేయడంతో 450 ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. ఓఅండ్‌ఆర్‌ఎం నిధులు రూ.700 కోట్లు తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేయించాం’ అని మంత్రి తెలిపారు. 

ఇటుకలకోట సమీపంలో డెలివరీ సిస్టమ్‌ వద్ద జలహారతి ఇస్తున్న మంత్రి నిమ్మల 


డయాఫ్రంవాల్‌ 365 మీటర్లు పూర్తి చేశాం..

‘చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం జనవరిలో ప్రారంభించి ఇప్పటి వరకు 360 మీటర్ల మేర పూర్తి చేశాం. గ్యాప్‌-1లో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు ప్రారంభించాం, గ్యాప్‌-2లో నవంబరు నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వర్షాకాలంలో డయాఫ్రంవాల్‌ నిర్మాణానికి ఆటంకం లేకుండా ఎగువ కాఫర్‌ డ్యాంను బలోపేతం చేసేలా బట్రస్‌ డ్యాం నిర్మించడంతో పాటు నీటిని ఎత్తిపోసేందుకు పంపులు సిద్ధం చేశాం’ అని మంత్రి వివరించారు. అనంతరం మంత్రి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పుష్కర ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేసేందుకు వెళ్తూ ఎగువ కాఫర్‌ డ్యాం, బట్రస్‌ డ్యాం, డయాఫ్రంవాల్‌ నిర్మాణాలను పరిశీలించారు. పోలవరం, గోపాలపురం, రాజానగరం ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, ట్రైకార్‌ ఛైర్మన్‌ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు