Andhra Pradesh post poll violence: విధ్వంసానికి వైకాపా కుట్ర!

పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం.

Updated : 17 May 2024 07:21 IST

పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాల గుర్తింపు
పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి

మాచవరం, దాచేపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. తాజాగా పలువురు వైకాపా నాయకుల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాలు బయటపడటంతో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నికల రోజు, అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో పల్నాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం మాచవరం మండలంలోని సమస్యాత్మక గ్రామం పిన్నెల్లిలో సోదాలు చేయగా.. గ్రామానికి చెందిన వైకాపా నేత, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చింతపల్లి చిన మస్తాన్‌వలి అలియాస్‌ నన్నే, ఆ పార్టీ నాయకులు చింతపల్లి పెదసైదా, అల్లాభక్షు ఇళ్లల్లో 51 పెట్రో బాంబులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు దొరికాయి. అలాగే తెదేపా సానుభూతిపరులు చింతపల్లి జానీ బాషా, జానీ బాషా, తండా పెద్ద నన్నే ఇళ్లపైన బీరు సీసాలు, రాళ్లు గుర్తించారు.

పోలింగ్‌ అనంతరం గొడవలు

ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి గ్రామంలో గొడవలు జరుగుతాయని భావించి, కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. దీంతో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినా.. మరుసటిరోజు నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. తెదేపా శ్రేణులపై దాడులకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే పెట్రో బాంబులు నిల్వ చేసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. వైకాపా దాడులను అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎస్పీ బిందుమాధవ్‌ గురువారం దాచేపల్లిలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పెట్రో బాంబులు ఎవరు తయారు చేశారు.. ఎక్కడి నుంచి తెచ్చారో సమాచారం ఉందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

మాదలలో 29 పెట్రో బాంబుల స్వాధీనం

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని వైకాపా నాయకుడి ఇంట్లో పెట్రో బాంబులు పట్టుబడటం కలకలం రేపింది. గ్రామంలో ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా తెదేపా కార్యకర్తలు, మద్దతుదారులపై వైకాపా శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత వైకాపా, తెదేపా శ్రేణులు పరస్పరం రాళ్లు, గాజు గ్లాసులు, సోడాబుడ్లు విసురుకున్నాయి. దీంతో మూడు రోజులుగా గ్రామంలో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది. మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గురువారం సత్తెనపల్లి గ్రామీణ సీఐ రాంబాబు, ఏఆర్‌ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈక్రమంలో గ్రామంలోని వైకాపా నాయకుడు షేక్‌ గుంటూరు సైదా ఇంట్లోని బాత్రూమ్‌లో 29 పెట్రో బాంబులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సైదా అందుబాటులో లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హజరతయ్య తెలిపారు.


ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటివద్ద రాళ్లు, ఖాళీ బీరు సీసాలు

మాచర్లగ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పెద్దఎత్తున దాడులకు వైకాపా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో రాళ్లు, ఖాళీ బీరు సీసాలను సిద్ధం చేసుకోవడం ఇందుకు బలాన్నిస్తోంది. గురువారం మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలోని ఓ వాహనంలో రాళ్లు, ఖాళీ బీరు సీసాల బస్తాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కారంపూడిలో జరిగిన అల్లర్లలో సైతం ఇదే వాహనాన్ని తీసుకెళ్లి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కారంపూడిలో విధ్వంసం సృష్టించినా పోలీసులు వైకాపా వర్గీయుల ఇళ్ల వద్ద తనిఖీలు చేయడం లేదు. వైకాపా శ్రేణులు పది కార్లలో కత్తులు, కర్రలు, రాడ్లు పోగేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇంటివద్ద రాళ్లు, బీరు సీసాలు వెలుగు చూడటంతో ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో అన్న భయాందోళనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. దీనిపై పట్టణ సీఐ బ్రహ్మయ్యను వివరణ కోరగా ఓ చోట రాళ్లు బస్తాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి స్వాధీనం చేసుకున్నామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని