Covid: కరోనానా? గుండె భద్రం

కరోనా వల్ల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గినప్పుడు ఆ ప్రభావం గుండె కండరాలపై తీవ్రంగా కనిపిస్తుండడంతో పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు... అందుకే కొవిడ్‌ సోకిన వారికి హృదయ సంబంధమైన పరీక్షలు, పర్యవేక్షణ చాలా ముఖ్యమని అంటున్నారు  ప్రముఖ కార్డియాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ మన్నం గోపీచంద్‌.

Updated : 23 May 2021 08:13 IST

రక్తంలో ఆక్సిజన్‌ తగ్గితే గుండె  కండరాలపై తీవ్ర ప్రభావం
సడన్‌ హార్ట్‌ఎటాక్‌లకు అదే కారణం
 వైద్యులు సూచించిన పరీక్షలు తప్పనిసరి  
 వ్యాధి తగ్గినా వైద్యుల పర్యవేక్షణ అవసరం
‘ఈనాడు’తో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ మన్నం గోపీచంద్‌
ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కరోనా వల్ల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గినప్పుడు ఆ ప్రభావం గుండె కండరాలపై తీవ్రంగా కనిపిస్తుండడంతో పలువురు గుండెపోటుతో చనిపోతున్నారు... అందుకే కొవిడ్‌ సోకిన వారికి హృదయ సంబంధమైన పరీక్షలు, పర్యవేక్షణ చాలా ముఖ్యమని అంటున్నారు  ప్రముఖ కార్డియాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ మన్నం గోపీచంద్‌. ముఖ్యంగా ఇప్పటికే గుండె ఆపరేషన్లు,  ఇతరత్రా వ్యాధులకు చికిత్స పొందుతున్న రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల తర్వాత తీవ్ర ప్రభావం చూపించేది గుండెపైనే అని విశ్లేషిస్తున్నారాయన. డాక్టర్‌ గోపిచంద్‌ ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో అనేక విషయాలను వెల్లడించారు. వివరాలు ఇవీ..
* కొవిడ్‌ రోగుల్లో చాలా మంది వైరస్‌ తగ్గిన తరువాత కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
సాధారణంగా కొవిడ్‌ వ్యాధిగ్రస్తులు కొంతమందిలో ఊపిరితిత్తులు  సక్రమంగా పని చేయకపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఆ ప్రభావం గుండె పనితీరుపై తీవ్రంగా పడుతోంది. కడరాల్లోని కణజాలం దెబ్బతిన్న పరిస్థితుల్లో గుండె పనితీరు మందగిస్తోంది. శరీరానికి రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఈ సమయంలో వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొవిడ్‌ వ్యాధిగ్రస్తుల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గడం మొదలైన వెంటనే గుండెకు సంబంధించి వైద్యుల పర్యవేక్షణ కూడా అత్యవసరమని గుర్తుంచుకోవాలి. వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో గుండె పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్నాళ్లు దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల వ్యాధి తగ్గిన తరువాతా సంబంధిత రోగులు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
*ఈ ముప్పు తప్పించుకోవాలంటే కొవిడ్‌ వచ్చిన వారు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
రక్తంలో డీ డైమర్‌, సీరం ఫెరిటన్‌, సీఆర్‌పీ పెరిగితే రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి బ్లాక్‌లు తయారవుతాయి. ఇది హఠాత్తుగా గుండె పోటుకు కారణమవుతుంది. కరోనా తీవ్రమవుతున్న దశలో ఉన్నవారు ఈ పరీక్షలు చేయించుకోవాలి. వీటిలో తేడా ఉంటే వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉండి, మందులు వాడాలి. అవసరమైతే రక్తం పలుచన చేసే ఔషధాలు వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
*ఇప్పటికే గుండె జబ్బులున్నవారు కరోనా వైరస్‌ బారినపడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్టెంట్‌ వేయించుకున్నవారు, బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వారు ఇతరత్రా గుండె సమస్యలున్నవారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. వీరికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. కరోనా లక్షణాలున్నాయని ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలి. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా లక్షణాలున్నవారు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*కరోనా రోగులు వైద్యులను సంప్రదించకుండానే స్టిరాయిడ్స్‌ వాడేస్తున్నారు. దీనివల్ల గుండెకు కలిగే ముప్పు ఎలా ఉంటుంది?
ఇటువంటి సొంత వైద్యాలు చివరికి ప్రాణాల మీదకు తెస్తాయి. పల్మనాలజిస్టు సూచనల మేరకే స్టిరాయిడ్స్‌ వాడాలి. ఇష్టానుసారం వాడితే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. తోచినట్లు స్టిరాయిడ్స్‌ వాడడం వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గి భవిష్యత్తులో బ్లాక్‌ ఫంగస్‌ బారినపడే ప్రమాదముంది.

*హోం ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి రోగి తప్పనిసరిగా శ్వాస సంబంధ ఎక్సర్‌సైజు చేయాలి. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు కొంతవరకు నిలకడగా ఉండే అవకాశం ఉంది. వైద్యుల సూచించిన మందులతోపాటు పోషకాహారం తీసుకోవాలి. దీనికితోడు రోగి ఉన్న గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు చూసుకోవాలి. వీటన్నింటితో పాటు రోగికి సానుకూల దృక్పథం చాలా ముఖ్యం. ఆక్సిజన్‌ స్థాయిని నిరంతరం పరీక్షిస్తూ ఉండాలి. చాలామంది చేతిని చాపి పల్స్‌ ఆక్సీమీటర్‌తో పరీక్షిస్తున్నారు. పడక, లేదా పరుపు మీద చేతిని ఆనించి వేలికి ఆక్సీమీటర్‌ పెడితే ఆక్సిజన్‌ శాతం ఎంతుందో కచ్చితంగా తెలుస్తుంది. ఆక్సిజన్‌ స్థాయి 95 శాతం కంటే తగ్గుతుంటే సంబంధిత రోగులు ఆస్పత్రిలో చేరడమే మంచిది.
* వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్టిరాయిడ్స్‌ వాడడం వల్ల శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం అధికంగా పడుతోంది. ఆ మందులు వాడిన రోగుల్లో రక్తపోటు హఠాత్తుగా పెరిగిపోతోంది. రక్తంలో ఫెరిటిన్‌ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. కొందరిలో మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. కరోనా నెగెటివ్‌ వచ్చిందన్న ఉద్దేశంతో వ్యాధిగ్రస్తులు అంతకుముందు వాడిన మందులను ఒక్కసారిగా ఆపేయకూడదు. క్రమానుగుణంగా, వైద్యులు సూచించినట్లు మందులను వాడాలి. కరోనా తీవ్రంగా వచ్చిన వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి నుంచి బయటపడిన చాలామంది బలహీనంగా మారుతున్నారు. వారు బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొవిడ్‌ తగ్గిందని ఇష్టానుసారంగా తిరిగితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని