సంక్షిప్త వార్తలు(8)

ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ వయస్సు ఇంటర్‌ విద్యామండలి ఉద్యోగులకు వర్తించదని ఆర్థిక శాఖ ఆదేశాలు ఇవ్వడంతో శనివారం నలుగురు ఉద్యోగులు పదవీవిరమణ చేశారు.

Updated : 26 Sep 2022 00:14 IST

ఆర్థిక శాఖ ఆదేశాలతో బోర్డులో ఉద్యోగులు పదవీ విరమణ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ వయస్సు ఇంటర్‌ విద్యామండలి ఉద్యోగులకు వర్తించదని ఆర్థిక శాఖ ఆదేశాలు ఇవ్వడంతో శనివారం నలుగురు ఉద్యోగులు పదవీవిరమణ చేశారు. ఇటీవలే వీరికి 60 ఏళ్లు పూర్తయినా పెంపుపై స్పష్టత లేకపోవడంతో జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. స్పష్టత ఇవ్వాలని బోర్డు కార్యదర్శి రాసిన లేఖపై... వీరికి వర్తించదని ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది.


వర్సిటీల వివరాలు కోరిన ఉన్నత విద్యామండలి

ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించిన ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నందున వివరాలు పంపించాలంటూ వర్సిటీలకు ఉన్నత విద్యామండలి లేఖలు రాసింది. బోధన, బోధనేతర సిబ్బంది, రెగ్యులర్‌, ఒప్పంద, తాత్కాలిక సిబ్బంది, ఆర్థిక వ్యవహారాల వివరాలు పంపించాలని కోరింది. వీటిని 26వతేదీ సాయంత్రం 4 గంటలోపు పంపించాలని సూచించింది.


తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
స్థానిక న్యాయవాదుల సంఘం డిమాండ్‌

తిరుపతి (లీగల్‌), న్యూస్‌టుడే: తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 26న విధుల బహిష్కరణకు పిలుపునిచ్చినట్లు తిరుపతి న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి గొంది హరినాథనాయుడు తెలిపారు. హైకోర్టు ఏర్పాటుకు తిరుపతి అన్నివిధాలా అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. విధుల బహిష్కరణకు న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయమూర్తులు సహకరించాలని కోరారు.


ఇంజినీరింగ్‌ బీకేటగిరీ సీట్ల భర్తీ ఎప్పుడు?

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ కేటగిరి-బీ (యాజమాన్యకోటా) సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఏ విధానంలో భర్తీ చేస్తుంది? విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నేరుగా కళాశాలలకు వెళ్లాలా? ఎప్పటి నుంచి చేపడతారు?వంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. కేటగిరి-బీ సీట్ల భర్తీ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి చేపడతామనే విషయాన్ని కళాశాలలకు చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. కేటగిరి-బీలో చేరే విద్యార్థులు కన్వీనర్‌ కోటా ఫీజుపై మూడింతలు చెల్లించాలనే నిబంధన విధించారు.  కొన్ని యాజమాన్యాలు మాత్రం డొనేషన్లు తీసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకునే వారు కనిపించడం లేదు. కన్వీనర్‌ కోటా మొదటి విడత సీట్ల భర్తీ పూర్తి కావడంతో కోరుకున్న కళాశాలల్లో సీట్లు లభించని వారు యాజమాన్య కోటాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తారు.


ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈఆర్‌వోల నియామకం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. అలాగే రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా,  పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి అప్పీలేట్‌ అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా శనివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.


కోటికి చేరిన ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కోటి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ రికార్డులను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌(ఏబీడీఎం)కు అనుసంధానం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ తెలిపారు. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ ముందంజలో ఉందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సహకారంతో డిజిటలైజేషన్‌ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్బన్‌, రూరల్‌ హెల్త్‌ సెంటర్ల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని రకాల ఆసుపత్రులు, వాటిల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారి పేర్లను కొన్నిచోట్ల చేరుస్తున్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయని నవీనకుమార్‌ తెలిపారు.


భోజన విరామ సమయంలో పురపాలక ఉపాధ్యాయుల నిరసనలు

ఈనాడు, అమరావతి: పురపాలక మండల విద్యాధికారుల పోస్టులను ఏర్పాటు చేసి, వాటిని తమకు కేటాయించాలని, ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారులు కల్పించాలనే డిమాండ్లతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య(ఎంటీఎఫ్‌) ఆధ్వర్యంలో పురపాలక ఉపాధ్యాయులు శనివారం నిరసనలు తెలిపారు. పదోన్నతులు కల్పించాలని, జీపీఎఫ్‌ ఖాతాలు తెరవాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలని, సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీర్చాలని వెల్లడించారు. ఎంటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ  పాఠశాల విద్యలో విలీనం చేసినా తమను పట్టించుకోవడం లేదని విమర్శించారు.


నిషిద్ధ జాబితా నుంచి అనాధీన భూముల తొలగింపు

ఈనాడు, అమరావతి: నిషిద్ధ భూముల జాబితా నుంచి ‘అనాధీన’ భూములను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా భూములు అధికంగా ఉన్నాయి. బ్రిటీష్‌ వారి హయాం నుంచి అనాధీన భూముల వ్యవహారం నడుస్తోంది. అనాధీనం అంటే..ఎవరి ఆధీనంలోని  భూములుగా పరిగణిస్తున్నారు. ఈ భూముల్లో కొన్ని ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నాయి. మరికొన్ని ప్రభుత్వ భూములుగా చెలామణిలో ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం, రైతుల మధ్య న్యాయవివాదాలు చోటుచేసుకుంటున్నాయి.  కొన్నింటికీ రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఆర్‌ఎస్‌ఆర్‌లో అనాధీన భూములుగా పేర్కొనడంతో వీటిని నిషిద్ధ జాబితాలో చేర్చారు. 18.06.1954 ముందు ఉన్న అసైన్డ్‌ భూములకు వర్తింప చేసిన నిబంధనను వీటికీ వర్తింప చేస్తూ నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని