సంక్షిప్త వార్తలు(3)

నెల్లూరు నగరంలో మూడు రోజులుగా జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీని ఎంపిక చేశారు. నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా బి.ప్రభావతి, కోశాధికారిగా సావిత్రి, తదితర 50 మందితో ఈ కమిటీ ఎంపికైంది.

Updated : 27 Sep 2022 06:13 IST

ఐద్వా రాష్ట్ర కమిటీ ఎంపిక

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలో మూడు రోజులుగా జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభల్లో భాగంగా సోమవారం స్థానిక జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా రాష్ట్ర కమిటీని ఎంపిక చేశారు. నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా బి.ప్రభావతి, కోశాధికారిగా సావిత్రి, తదితర 50 మందితో ఈ కమిటీ ఎంపికైంది. ఈ సందర్భంగా ఆ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలె మాట్లాడుతూ మహిళా సమస్యలపై చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మహిళా హక్కుల పరిరక్షణ, బాలికల విద్యకు విఘాతం కలిగించే నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కోరారు. జిల్లా కార్యదర్శి మస్తాన్‌బీ, తదితర నాయకులు పాల్గొన్నారు.


జర్మన్‌ వర్సిటీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం

ఈనాడు, అమరావతి: జర్మనీలోని స్టెయిన్‌బీస్‌ విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులు మాస్టర్స్‌ డిగ్రీ చదివేందుకు ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల తరఫున ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందం చేసింది. కంప్యూటర్‌ సైన్సులో మాస్టర్‌ ఆఫ్‌ సైన్సెస్‌ను స్టెయిన్‌బీస్‌ అందిస్తుంది. విద్యార్థులను ఎంపిక చేసేందుకు జర్మనీ వర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాక్టికల్‌ లెర్నింగ్‌ కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుందని వెల్లడించారు. స్టెయిన్‌బీస్‌ వర్సిటీ డైరెక్టర్‌ బెట్రామ్‌ లోహ్‌ముల్లర్‌ మాట్లాడుతూ.. బాష్‌ లాంటి కంపెనీలకు రాబోయే ఐదేళ్లల్లో ఐదు లక్షల మంది వరకు ఇంజినీర్లు అవసరమవుతారని తెలిపారు. హైడ్రోజన్‌ టెక్నాలజీపై జర్మనీ దృష్టిసారించిందని, దీనికి భవిష్యత్తులో 10వేల మంది వరకు ఇంజినీరింగ్‌ నిపుణులు అవసరమవుతారని, విద్యార్థులు పని చేస్తూ నేర్చుకోవచ్చని సూచించారు.


24 రెవెన్యూ డివిజన్లకు 456 పోస్టుల మంజూరు

ఈనాడు, అమరావతి: కొత్త రెవెన్యూ డివిజన్ల  ఏర్పాటుకు తగ్గట్లుగా 456 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. 24 రెవెన్యూ డివిజన్ల అవసరాలకు 19 చొప్పున పోస్టులను కేటాయించింది. ఆర్డీఓ, డీఏఓ (తహసీల్దార్‌ కేడర్‌), మూడు తహసీల్దార్‌ (కేఆర్‌సీసీ), ఇతర పోస్టులు ఉన్నాయి. వీటి మంజూరుతో పాటు రెవెన్యూ శాఖలో అవసరంలేని 655 పోస్టులను శాంక్షన్డ్‌ జాబితా నుంచి తొలగించారు. వీటిలో 400 టైపిస్టు, వంద డ్రైవర్ల పోస్టులు వంటివి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని