రుణ విషవలయంలో ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రుణ విషవలయంలో చిక్కుకుంది. అప్పు తీసుకోనిదే రోజు గడిచే పరిస్థితి లేదు.

Updated : 05 Dec 2022 12:22 IST

తీర్చాలంటే మళ్లీ అప్పు
ఈ ముప్పు ఎటు దారితీస్తుందో?
పరిశ్రమలు రావు... సేవా రంగం అంతంతే
ఇక ఆదాయం ఎక్కడి నుంచి..!
జీఎస్‌డీపీలో ఏకంగా 65% రుణాల భారమే

ఆంధ్రప్రదేశ్‌ రుణ విషవలయంలో చిక్కుకుంది. అప్పు తీసుకోనిదే రోజు గడిచే పరిస్థితి లేదు. దాన్ని తీర్చాలన్నా.. వడ్డీ కట్టాలన్నా ఎక్కడో అక్కడ దేహీ అనాల్సిందే. అధిక వడ్డీలకు మళ్లీ మళ్లీ రుణం పుట్టించాల్సిందే. మరో వైపు ఆశించినంత స్థాయిలో రాష్ట్రానికి ఆదాయాలు పెరగడం లేదు. పన్నుల రాబడి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునేందుకు ప్రభుత్వం దీర్ఘ దృష్టితో కృషి చేస్తున్న కార్యక్రమాలు లేవు. కొత్త పరిశ్రమలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితులు, భయానక వాతావరణంతో ఎన్నో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. యువత ఉపాధి కోసం ఊళ్లు పట్టుకునిపోతోంది. పల్లెలే కాదు... పట్టణాలూ నిస్తేజంగా మారుతున్నాయి. ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఆంధ్రప్రదేశ్‌ యువతను కోల్పోతోంది. అనేక రంగాల్లో అంతో ఇంతో పనులు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడే వివిధ రంగాల వారు ఏ ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు లేక పనులు లేక ఉసూరుమంటున్నారు. ఉన్న ఒక్క పనిని పది మంది పంచుకోవాల్సి వస్తోందని, చేసే పనికీ గిట్టుబాటు పోయిందని విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా సరైన ఆర్థిక కార్యకలాపాలు లేవు. వ్యవసాయం, ఆక్వా కూడా విలవిల్లాడుతోంది. సేవారంగం అంతంతమాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి రాబడి పెరగడం లేదు. రూ.వేల కోట్ల అప్పులు నిరుత్పాదక రంగానికే తరలిపోతున్నాయి. ఆ రుణాలతో ఆదాయాలు సృష్టించే కార్యక్రమాలు లేవు. ఇప్పటికే ముప్పులో ఉన్న రాష్ట్ర ఆర్థిక రంగంలో పదే పదే అవే తప్పులు చేస్తుండటంతో ఇంకెంత ముప్పు వాటిల్లుతుందోననే ఆందోళనకర పరిస్థితులు సర్వత్రా ఉన్నాయి.


దాచిపెడుతోంది

ఏ రాష్ట్రమైనా తన స్థూల ఉత్పత్తిలో 35 శాతానికి మించి అప్పులు చేయకూడదనేది నిబంధన. రుణాల మొత్తం జీఎస్‌డీపీలో ఆ పరిమితిని దాటకూడదనేది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ రహస్య అప్పులను  కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జీఎస్‌డీపీలో మొత్తం అప్పు 44.04 శాతానికి చేరిపోయిందని కాగ్‌ లెక్క కట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పులను దాచిపెడుతోంది. కాగ్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కార్పొరేషన్ల అప్పులు అనేకం రాష్ట్ర ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు. ఏళ్ల తరబడి రూ.వేల కోట్లు పెండింగు బిల్లులు ఉన్నాయి. అవీ ఒకరకమైన అప్పుల్లాంటివే. అవీ ఎప్పుడో అప్పుడు చెల్లించాల్సిందే. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు ఇస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం ఇప్పటికే రూ.8.71 లక్షల కోట్లకు చేరిందని అంచనా. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో రాష్ట్ర రుణాల, చెల్లింపుల భారం ఏకంగా 65 శాతానికి చేరుకునే దారుణ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది.


రాబడిలో పెరుగుదల అంతంతే...అప్పుల్లో ఎంతో!

రాష్ట్రానికి సొంత పన్నుల రాబడి రేటు తగ్గిపోతోంది. ఆదాయాలు పెరగాల్సి ఉండగా ఆ పెంపు శాతం చాలా తక్కువగా ఉంటోంది. రాష్ట్ర విభజన తర్వాత సొంత పన్నుల రాబడి  2015-16 నుంచి 2018-19 నాటికి 45.5 శాతం పెరిగింది. అదే 2019-20 నుంచి 2021-22 నాటికి పన్నుల రాబడిలో పెరుగుదల కేవలం 27 శాతంగానే ఉంది.  పెరుగుదల రేటు తగ్గుతూ వస్తోంది. మరో వైపు అప్పుల్లో పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. కాగ్‌ అధికారిక గణాంకాల ప్రకారం.. 2016 నాటికి ఉన్న రుణాల కన్నా... 2021 నాటికి ఉన్న రుణాల మొత్తం ఎక్కువ. ఈ రుణాల్లో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణాలు రూ.2,01,314 కోట్లు ఉంటే... 2019-20 నాటికి రూ.3,48,246 కోట్లకు చేరింది. అంటే ఏకంగా 72.99శాతం మేర పెరుగుదల ఉందని కాగ్‌ సైతం విశ్లేషించింది.


ఏటా అప్పుల చెల్లింపులకే రూ.50 వేల కోట్లు...

రాష్ట్రం ఏటా తన అప్పులు, వడ్డీలు తీర్చేందుకు రమారమి ఏకంగా రూ.50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్ర సొంత రాబడి మొత్తం రుణాలు తీర్చడానికే సరిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రుణాలన్నీ దాదాపు అయిదేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు చెల్లించే ప్రాతిపదికన తీసుకుంటున్నారు. రాష్ట్రం ప్రతి ఏటా బడ్జెట్‌లో చూపి చెల్లిస్తున్న వడ్డీలు, పబ్లిక్‌ డెట్‌ చెల్లింపుల మొత్తమే అధికారికంగా దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది రూ.40 వేల కోట్ల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి కాక కార్పొరేషన్ల అప్పుల చెల్లింపు భారం, పెండింగు బిల్లుల చెల్లింపు భారం దీనికి అదనం. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ కార్పొరేషన్లకు సొంత కార్యకలాపాలు లేవు. ఆదాయాలు లేవు. అవి తీసుకువచ్చే రుణాలను ప్రభుత్వాలే తమ ఖర్చులకు పరోక్షంగా వినియోగించుకుంటున్నాయి. ఆ అప్పులు, వడ్డీలు కూడా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించే మొత్తాలు ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇవన్నీ కలిపితే సగటున ఏడాదికి రూ.50 వేల కోట్ల పై మాటగానే చెల్లింపుల భారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


ఆదాయం మళ్లింపు మరో ప్రమాదం

రాష్ట్రంలో కొత్త కొత్తగా అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేస్తోంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ.లక్ష ఆదాయం వస్తోంది. ఆ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు ఎంత రుణం, వడ్డీ తీర్చగల సామర్థ్యం ఉందో లెక్కించి అప్పు మంజూరు చేస్తాయి. అంటే ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం ఆ రుణం ఆ ఆదాయం మొత్తంతో తీర్చగలరని లెక్క కట్టినట్లు అర్థం. ఆ వ్యక్తి అదే ఆదాయాన్ని వేరే వారి ఖాతాకు కొంత మళ్లించి అక్కడ వారి పేరుతో మళ్లీ రుణం తీసుకుంటే తన రుణాలు రెండూ తీర్చగల సామర్థ్యం ఉంటుందా? ఇది బ్యాంకులను తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుంది కదా... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తున్న తీరూ ఇప్పటికే విమర్శల పాలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సైతం దీనిని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తన ఖజానాకు వచ్చే మద్యం డిపోల ఆదాయంలో కొంత తొలుత ఖజానాకు రప్పించి అక్కడి నుంచి ఏపీఎస్‌డీసీకి మళ్లించి ఆ ఆదాయాన్ని ఆధారంగా చూపి అప్పు తీసుకుంది. ఒకసారి తాకట్టు పెట్టిన కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను మళ్లీ ఎలా తాకట్టు పెడతారనే ప్రశ్న ఏర్పడింది. అలాగే మద్యం సెస్‌ తగ్గించుకుని తన ఖజానాకు వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంది. బేవరేజస్‌ కార్పొరేషన్‌ పేరుతో కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారు అక్కడ తగ్గించిన మొత్తానికి సెస్‌ వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ రాబడి చూపించి మళ్లీ అక్కడ అప్పు పుట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా ఆదాయాన్ని తనే పక్కదోవ పట్టిస్తోంది. మరో వైపు రాబడుల్లో పెరుగుదల లేదు. రుణం తీర్చాలంటే, వడ్డీ కట్టాలంటే మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని కాగ్‌ సైతం పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆదాయాన్ని కూడా తగ్గించుకుని పక్కదోవ పట్టించి కొత్త కొత్త అప్పులు చేస్తూ పోతే ఇక ఈ రాష్ట్ర ప్రయాణం ఏ ఆర్థిక సంక్షోభంలోకి?


కాగ్‌ సైతం ఖంగుతిని...

ఇదేదో సామాన్యంగా విశ్లేషిస్తున్న అంశాలు కావు. ఈనాడు చెబుతున్న మాటలూ కావు. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికను ఎవరు పరిశీలించినా ఇంతకుమించి ఆందోళన కలుగుతుంది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రుణాలను భరించే సామర్థ్యం లేదు. రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారు. ఆ అప్పుల సొమ్ముతో ఆస్తులు సృష్టించడం లేదు. ఎలాంటి ఆదాయం ఇవ్వని విధంగా ఖర్చు (రెవెన్యూ ఖర్చు) చేసేస్తున్నారు. సాధారణంగా అప్పుల మొత్తాలను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. రుణాల బకాయిల మీద వడ్డీలు చెల్లించేందుకు, ప్రస్తుతం రోజు గడిచేందుకు (ప్రస్తుత అవసరాలకు) అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది...’’ అని కాగ్‌   నివేదిక పేర్కొంది. అంతే కాదు.. ప్రముఖ రేటింగు సంస్థ క్రిసిల్‌ చెప్పినా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్థంగానే ఉన్నాయంటోంది. చేబదుళ్లతోనే రాష్ట్రం నడుస్తోందని పేర్కొంటోంది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని