అయిదేళ్ల జాప్యం.. రూ.273 కోట్ల మూల్యం
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణంలో అయిదేళ్లు జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం రూ.273 కోట్లు పెరిగినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం సభకు వెల్లడించింది.
భారీగా పెరిగిన విశాఖ పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణ వ్యయం
పార్లమెంటరీ స్థాయీసంఘం వెల్లడి
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం పెట్రోలియం యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణ నిర్మాణంలో అయిదేళ్లు జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం రూ.273 కోట్లు పెరిగినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం సభకు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు తొలి దశ 2017-18 నాటికి, రెండో దశ 2020-21 నాటికి పూర్తి కావాల్సి ఉందని పేర్కొంది. న్యాయపరమైన సమస్యలు, భూమి అప్పగింతలో జాప్యంతో తొలి దశ గడువు 2024-25 నాటికి, రెండో దశ గడువును 2026-27 నాటికి సవరించినట్లు నివేదికలో తెలిపింది. దీనివల్ల నిర్మాణ అంచనాలు రూ.655.47 కోట్ల నుంచి రూ.928.66 కోట్లకు పెరిగినట్లు చెప్పింది. ‘ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన భవనం రెండో అంతస్తులో తాత్కాలికంగా నడుస్తోంది. శాశ్వత ప్రాంగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో సబ్బవరం మండలం వంగలి గ్రామంలో సర్వే నంబర్ 135, 241ల్లో ఉన్న 201.80 ఎకరాల భూమిని అప్పగించింది. ఇందులో 157.36 ఎకరాల టైటిల్‌ను 2022 జనవరిలో పెట్రో యూనివర్సిటీ పేరు మీద చేసి ఇచ్చింది. ఇప్పటికీ 22.96 ఎకరాల మ్యుటేషన్ పెండింగ్‌లో ఉంది. రైతులు కోర్టులో కేసులు వేయడంతో మరో 21.48 ఎకరాల మ్యుటేషన్ పెండింగ్‌లో పడింది. ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా రైతులు అడ్డుపడటంతో 2022 ఫిబ్రవరిలో ఈ సంస్థ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. కేసును విచారించిన హైకోర్టు అర్హులైన రైతులకు చెల్లించాల్సిన సహాయ, పునరావాస ప్యాకేజీ గురించి 45 రోజుల్లోపు పరిశీలన జరిపి ఆ మొత్తాన్ని తమ వద్ద డిపాజిట్ చేయాలని, దానివల్ల నిర్మాణ పనులకు ఎవరూ అడ్డుతగలకుండా ఉంటుందని చెప్పింది. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం డిపాజిట్ చేసిన తర్వాతే నిర్మాణ పనులు కొనసాగించాలి’ అన్న వాక్యాన్ని మధ్యంతర ఉత్తర్వుల నుంచి తొలగించాలంటూ పెట్రో యూనివర్సిటీ 2022లో హైకోర్టులో మరో కేసు దాఖలు చేసింది. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మొత్తం డిపాజిట్ చేయక ముందే నిర్మాణ పనులు కొనసాగించడానికి వీలవుతుందని పేర్కొంది. దీంతో ఈ సంస్థకు కేటాయించిన 201.80 ఎకరాల్లో చేపట్టే ఏ నిర్మాణానికీ అడ్డంకులు కల్పించకూడదంటూ హైకోర్టు డిసెంబర్ 15న మరో ఉత్తర్వు జారీ చేసింది. అడ్డంకులు సృష్టించేవారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీఐఐసీ ఆ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం ప్రారంభించింది. ప్రాంగణానికి సంబంధించిన ప్రాథమిక డ్రాయింగ్స్‌ను ఖరారు చేసి, సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. జీఎస్టీ, ద్రవ్యోల్బణం కారణంగానే ప్రాజెక్టు వ్యయం రూ.273 కోట్ల మేర పెరిగింది. 2022-23 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల సవరించిన అంచనాల్లో దాన్ని రూ.100 కోట్లకు తగ్గించారు. 2023-24లో పనులు వేగం పుంజుకొనే అవకాశం ఉన్నందున బడ్జెట్‌ను రూ.168 కోట్లకు పెంచారు’ అని స్థాయీ సంఘం నివేదికలో వివరించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!