పుష్పగిరినీ వదలని మట్టి మాఫియా

వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి కొండను కొంతమంది అక్రమార్కులు తవ్వి, మట్టి తరలిస్తున్నారు.

Published : 02 Aug 2023 08:12 IST

గిరి ప్రదక్షిణ భక్తులు ప్రశ్నించడంతో పలాయనం

వల్లూరు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి కొండను కొంతమంది అక్రమార్కులు తవ్వి, మట్టి తరలిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం ధర్మపరిరక్షణ సేన సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి దుర్గమ్మ ఆలయం మార్గంలో కాలభైరవస్వామి విగ్రహం దాటాక అక్రమార్కులు పొక్లెయిన్లతో కొండను తవ్వి మట్టి తరలిస్తుండటాన్ని గమనించి ప్రశ్నించారు. తవ్వకానికి అనుమతులున్నాయా అని నిలదీసి, పొక్లెయిన్లు, లారీల ఫొటోలు తీశారు. దీంతో అక్రమార్కులు యంత్రాలు వదిలేసి, పలాయనం చిత్తగించారు. భక్తులు వల్లూరు, కాజీపేట మండలాల తహసీల్దార్లతోపాటు కడప రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. ప్రతినెలా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరుగుతోందని, మట్టి మాఫియా భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోందని ధర్మపరిరక్షణ సేన అధ్యక్షుడు, ఇంటాక్‌ జిల్లా సభ్యుడు భారవి ఆరోపించారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాను అరికట్టి పుష్పగిరి కొండను కాపాడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని