Gaddar: మూగబోయిన ప్రజాఉద్యమ గొంతుక

బండెనక బండి కట్టి.. ఏ బండ్లె వస్తవ్‌ కొడుకో నైజాము సర్కరోడా అంటూ దాష్టీకాలను ఎదిరించిన గళం... నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడీ.. ఆడ బిడ్డా పుట్టినాదో... అత్తా తొంగి చూడలేదంటూ లింగ వివక్షను కడిగేసిన కలం..

Updated : 07 Aug 2023 07:03 IST

అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్‌ అస్తమయం
నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

బండెనక బండి కట్టి.. ఏ బండ్లె వస్తవ్‌ కొడుకో నైజాము సర్కరోడా అంటూ దాష్టీకాలను ఎదిరించిన గళం... నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడీ.. ఆడ బిడ్డా పుట్టినాదో... అత్తా తొంగి చూడలేదంటూ లింగ వివక్షను కడిగేసిన కలం... పాటనై వస్తున్నానమ్మో అంటూ మాటలనే పాటలుగా మలిచి ప్రజా ఉద్యమాలను పేర్చిన దృఢస్వరం... సిరిమల్లెచెట్టు కిందా లచ్చుమమ్మో... లచ్చుమమ్మా అంటూ అమ్మకు గుండెల్లో గుడి కట్టిన పదం... నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అంటూ రక్తసంబంధాన్ని రంగరించిన గొంతుక... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు పతాకమై నిలిచిన గీతిక... జనం గుండెల్లో నిత్యం నాట్యమాడే పాటమ్మను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. బుర్రకథ విఠల్‌, తెలంగాణ ఉద్యమానికి వన్నెలద్దిన గద్దర్‌... అరుణ వర్ణంలో ఒదిగిపోయారు. 

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, అమీర్‌పేట: ఉద్యమ గళం మూగబోయింది. తన పాటతో.. ఆటతో చైతన్యం నింపిన ప్రజాయుద్ధ నౌక నింగికేగింది. ప్రజాగాయకుడు గద్దర్‌(76) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అల్వాల్‌లోని ఇంటివద్ద జులై 20న గద్దర్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గుండెలో సమస్య ఉండటంతో ఈ నెల 3న వైద్యులు ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో హుషారుగా పాటలు కూడా పాడిన ఆయన... త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి కూడా మాట్లాడారు. అనూహ్యంగా ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించింది. చాన్నాళ్లుగా రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం, వృద్ధాప్య సమస్యలు చుట్టుముట్టడంతో కోలుకోలేకపోయారు. అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. ‘‘ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించాం... కోలుకున్నట్లే కన్పించి ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు. చివరి క్షణాల్లోనూ గద్దర్‌ పాటను వదల్లేదు’’ అని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఐసీయూలో చేర్చినప్పుడు కూడా పాటలు పాడారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ను ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఆయన కొంత ఆరోగ్యంగా, చలాకీగా కనిపించారు. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నిన్ననే కలిశానని.. మంచిగనే ఉన్నానని చెప్పారని, ఇంతలోనే సీరియస్‌ అయిందని గద్దర్‌ భార్య విమల భోరున విలపించారు. కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

పుట్టినూరు తూప్రాన్‌

గద్దర్‌ 1947 ఆగస్టు 4న మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదులుకున్నారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో మృతి చెందారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో పాటు నటించి మెప్పించారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది. గద్దర్‌ మృతి వార్తను తెలుసుకొని అమీర్‌పేట ఆసుపత్రి వద్దకు ఆయన అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున చేరుకున్నారు. గద్దర్‌ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్‌, మధుయాసీˆ్కగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సీతక్క, విమలక్క, అద్దంకి దయాకర్‌, మల్లురవి, నారదాసు లక్ష్మణ్‌రావు, తెదేపా నేత కాట్రగడ్డ ప్రసూన, భాజపా నేత శ్యాంసుందర్‌, మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తదితరులు ఆసుపత్రికి వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం గద్దర్‌ పార్థివదేహాన్ని ఎల్‌బీ స్టేడియానికి తరలించారు. అక్కడికి ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని ఇక్కడే ఉంచనున్నారు.

నేడు అంత్యక్రియలు

గద్దర్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవితాంతం సమాజానికి ఆయన చేసిన త్యాగాలకు, ప్రజాసేవకు సూచికగా ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి, సంబంధిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని ఆదేశించారు. ఈమేరకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్‌లోని భూదేవినగర్‌లోని గద్దర్‌ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ఇంటి వద్ద ప్రజల కోసం కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నారు.అల్వాల్‌లోనే గద్దర్‌  స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


అది ఉద్యమాన్ని శివాలెత్తించిన పాట

గద్దర్‌ రాసిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...’ పాట తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే పాటల్లో ఒకటి. ఉద్యమం ఉవ్వెత్తున ఎదిగేందుకు దోహదం చేసింది. తెలంగాణ ప్రకటించి, వెనక్కి తీసుకున్న తర్వాత ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణం చేపట్టా. దానికోసం ఒక పాట రాయాలని కోరగా రెండు గంటల్లోనే ట్యూన్‌ కట్టారు. ఆ పాటను పాడేందుకు గద్దర్‌ స్టుడియోకు వచ్చిన రోజు ఆయన తీవ్ర జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా నేను, సంగీత దర్శకుడు చక్రి పాడేందుకు ఒప్పించాం. పాటనూ ఆయనపైనే చిత్రీకరించాం. పాట రాసినందుకు, నటించినందుకు పారితోషికం ఇస్తానని చెబితే.. ‘ఇదంతా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం... దానికి డబ్బులిస్తావా?’ అని తిరస్కరించారు. మేము ఊహించినట్లే పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాట చరిత్ర సృష్టించింది.

ఎన్‌.శంకర్‌, సినీ దర్శకులు


ప్రముఖుల సంతాపాలు

గద్దర్‌ పార్థివదేహానికి ఆయన అభిమానులు, బంధువులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఘన నివాళి అర్పించారు. ప్రజల సందర్శనార్థం గద్దర్‌ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు అంబులెన్స్‌లో గద్దర్‌ భౌతికకాయాన్ని స్టేడియానికి తీసుకొచ్చారు. రాత్రి 9గంటల సమయంలో మంత్రి కేటీఆర్‌ గద్దర్‌ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సోమవారం ఉదయం 10:30కు స్టేడియం నుంచి అంతిమయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తెలిపారు.


తెలంగాణ ప్రజలకు తీరనిలోటు

గద్దర్‌ మృతి తెలంగాణ ప్రజలకు తీరని లోటు. తెలంగాణ గొప్ప కవిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

గవర్నర్‌ తమిళిసై


కళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరం

తెలుగు పాటకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వాగ్గేయకారుడు గద్దర్‌. రాష్ట్ర సాధనకు తన పాట ద్వారా పల్లెపల్లెలో భావజాలాన్ని వ్యాప్తిచేసి ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సాంస్కృతిక పోరాటం, ఆయనతో అనుబంధాన్ని ఎప్పటికీ మరవలేను. కళలు వర్ధిల్లినంతకాలం గద్దర్‌ పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌


తెలుగుజాతి సెల్యూట్‌

ప్రజాకవి గద్దర్‌ పాటలు ఎప్పటికీ సమాజానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెలుగుజాతి ఆయనకు సెల్యూట్‌ చేస్తోంది. గద్దర్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి


ఎన్నో అంశాలను పంచుకున్నాం

తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో గద్దర్‌తో వేదికను పంచుకునే అవకాశం నాకు లభించింది. రాష్ట్ర సాధనకు ఎన్నో అంశాలను పరస్పరం పంచుకున్నాం. గద్దర్‌ మృతి రాష్ట్రానికి తీరనిలోటు.

కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 


గద్దర్‌ అలుపెరగని పోరాటం మనందరికీ స్ఫూర్తి

తెలంగాణ ప్రజలపై ప్రేమతో గద్దర్‌ చేసిన అలుపెరగని పోరాటం మనందరికీ స్ఫూర్తి. (గత నెల 2న ఖమ్మంలో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన గద్దర్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఈ సందర్భంగా ట్విటర్‌లో రాహుల్‌, ప్రియాంకగాంధీలు పోస్ట్‌ చేశారు.)

రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత


పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది

తన పాటలతో ప్రజాచైతన్యానికి ఎనలేని కృషి చేసిన ‘ప్రజా యుద్ధనౌక’ గద్దర్‌ మృతితో పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్లయింది.

చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత


అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా; పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని గద్దర్‌ ఉత్తేజపరిచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు


దశాబ్దాలుగా ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న గద్దర్‌ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరనిలోటు. గద్దర్‌ మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్‌ శ్రేణులు అన్ని మండలాల్లో గద్దర్‌ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలి.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి


గద్దర్‌ చివరి వరకు పీడితప్రజలపక్షాన నిలిచారు. ఆయన పాట కలకాలం ఉంటుంది. అన్యాయం, దోపిడీ జరిగినంత కాలం దానిని ఎదిరిస్తూనే ఉంటుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక సంస్థల ఐకాస ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలపై ప్రదర్శనలిచ్చాం. ఇటీవల నిమ్స్‌కు వెళ్లి పరామర్శించగా.. మమ్మల్ని చూసి తనమీద ఒక పాటరాయమని అడిగారు. ఎన్‌కౌంటర్లలో ఎందరో చనిపోతే.. వారి మృతదేహాలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.జ

విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య


గద్దర్‌ నన్నెంతో ప్రభావితం చేశారు. పార్టీ పెట్టడానికి కూడా ఆయనే స్ఫూర్తి. తెలుగుజాతి ఉన్నంత వరకు గద్దర్‌ సజీవంగా ఉంటారు. చివరిసారిగా ఆయణ్ని కలిశా. రాజకీయం పద్మవ్యూహమని, లోపలికి రావడమే కాదు.. బయట ఎలా నెగ్గుకురావాలో చెప్పిన గొప్ప మేధావి గద్దర్‌.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌


గద్దర్‌ మృతి తీరనిలోటు పలువురు ప్రముఖుల నివాళి

ఈనాడు, హైదరాబాద్‌: గద్దర్‌ మృతికి మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణపై ఆయన పాడిన పాటలు ఉద్యమకారులను ఎంతో ఉత్సాహపరిచాయని, ఆయన మృతి నమ్మలేకపోతున్నానని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, మధుయాస్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌, మల్లు రవి, అద్దంకి దయాకర్‌, ఎమ్మెల్యే సీతక్క సంతాపం తెలిపారు.

  • గద్దర్‌ మృతి పట్ల సినీనటుడు నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన సంతాపం తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని