ఇస్లాం బ్యాంకు గుర్తుందా?

ఏదైతే చేయగలుగుతానో... అది వేరే వాళ్లెవరూ చేయని విధంగా నాలుగు అడుగులు ముందుకేసి మరీ చేస్తా. కానీ మోసం చేయడం... అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు.

Updated : 12 Aug 2023 05:56 IST

గత ఎన్నికలకు ముందు జగన్‌ ఆర్భాటపు ప్రచారం
అధికారంలోకి రాగానే నాలుక మడతేసిన సీఎం
రాయితీ రుణాలకూ పాతర
ఈనాడు, అమరావతి


ఏదైతే చేయగలుగుతానో... అది వేరే వాళ్లెవరూ చేయని విధంగా నాలుగు అడుగులు ముందుకేసి మరీ చేస్తా. కానీ మోసం చేయడం... అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు. చేయగలిగిందే చెబుతా. చెప్పింది మాత్రం కచ్చితంగా చేసి చూపిస్తా.

గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్షనేతగా జగన్‌ వ్యాఖ్యలు


ముస్లింలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇస్లాం బ్యాంకును ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా వడ్డీ లేని రుణాలిస్తాం....

  • ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందా సీఎంగారూ! ఎందుకు గుర్తుండవులే. గత ఎన్నికలకు ముందు మీరు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు మాటిచ్చి తప్పిన వాటిల్లో ఇదీ ఒకటి. నెల్లూరు జిల్లా హసనాపురం, విశాఖల్లో ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఇస్లాం బ్యాంకు గురించి మీరు గట్టిగానే చెప్పారు. పాపం ముస్లింలూ నమ్మేశారు. ఎందుకంటే మోసం చేయడం చేతకాదని, చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తానన్నారు కదా! చివరికేం చేశారు? నమ్మిన ముస్లింలను నట్టేట ముంచేశారు. వారి ఆశలకు నిలువునా తూట్లు పొడిచేశారు.

కర్ణుడికి కవచ కుండలాల వలే ‘విలువలు, విశ్వసనీయత’ అనేవి జన్మత: తనకు వచ్చినట్టు జగన్‌ వీర పలుకులు వల్లె వేస్తుంటారు. ఆయన వందిమాగధులైతే... జగన్‌ ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అని ఆర్భాట ప్రచారమూ చేస్తారు. వాస్తవమేమిటో ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలందరికీ అనుభవంలోకొచ్చింది. మాట తప్పను.. మడమ తిప్పనంటూనే జగన్‌ చాకచక్యంగా నాలుక మడతేస్తారు. ఇందుకు ఇస్లాం బ్యాంకు ఏర్పాటు హామీ చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రతిపక్షనేతగా ఆయన మాటలు విని.. అధికారం చేపట్టగానే ఇబ్బడిముబ్బడిగా వడ్డీ లేని రుణాలిస్తారని ఆశించిన ముస్లింలకు తీరని ద్రోహమే చేశారు. అధికారం అనుభవించిన ఈ నాలుగేళ్ల కాలంలో ఆ బ్యాంకు ఏర్పాటు ఊసే మరిచారు. ఇక ఆ పేరుతో ప్రత్యేక రుణాలివ్వడమన్నది దేవుడికే ఎరుక.

రాయితీ రుణాలకూ పాతర...

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మైనారిటీల సంఖ్య 43.46 లక్షలు. ఇందులో ముస్లింల జనాభా 36.18 లక్షలు. వీరిలో అత్యధికులకు చిరు వ్యాపారాలు, చిన్నచిన్న పనులే జీవనాధారం. ముస్లిం యువత గణనీయ సంఖ్యలో ఉన్నారు. మెరుగైన జీవనం సాగించడానికి స్వయం ఉపాధి రుణాలు అండగా ఉండేవి. వడ్డీ లేని రుణాలిస్తానని ఎన్నికలకు ముందు మాటిచ్చి మడతేసిన జగన్‌.. చివరికి దశాబ్దాలుగా అండగా ఉన్న రాయితీపై ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకూ పాతరేశారు. విలువలు, విశ్వసనీయత..   ఇచ్చిన మాట మీద నిలబడడమంటే ఇదేనేమో జగనే చెప్పాలి.

తొలి ఏడాది రూ. 84 కోట్లు కేటాయించి... ఆపై మళ్లించి..

అధికారం చేపట్టిన తొలి ఏడాది (2019-20) జగన్‌ మరో ఘనకార్యం చేశారు. మైనారిటీల స్వయం ఉపాధి రుణాల కోసమని బడ్జెట్‌లో రూ. 84.84 కోట్లు కేటాయించారు. అమలు కోసం కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఐఎస్‌బీ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణాలివ్వాలని నిర్ణయించారు. ఎందుకివ్వాలనుకున్నారో ఏమో మొత్తంగా పక్కన పెట్టారు. కేటాయించిన రూ. 84.84 కోట్లలో రూ. 25.52 కోట్లను వాహనమిత్ర పథకానికి మళ్లించారు.

తెదేపా ప్రభుత్వంలో రూ. 248 కోట్ల ఖర్చు

తెదేపా ప్రభుత్వంలో మైనారిటీల రాయితీ రుణాలకు పెద్దపీట వేశారు. స్వయం ఉపాధికిగాను 50 శాతం రాయితీతో రుణాలిచ్చారు. సాధారణ వృత్తులు చేసుకునేందుకైతే రుణంగా రూ. 2.50 లక్షలు, ఆటో, ట్యాక్సీ-కారు తదితర రవాణా వాహనాల కొనుగోలుకు రూ. 3 లక్షలు అందించారు. ఈ పథకానికి 2014-15 నుంచి 2018-19 వరకు ఏటా బడ్జెట్‌ కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లారు. 2014-15లో రూ. 20 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ 2018-19 నాటికి రూ. 126 కోట్లకు చేరింది. ఐదేళ్లలో 45,244 మందికి రాయితీ రుణాలిచ్చారు. ఇందుకోసం రూ. 248 కోట్లు ఖర్చు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు