ఒకసారే మూల్యాంకనం చేశాం

గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు.

Updated : 18 Mar 2024 06:01 IST

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూపు-1 ప్రిలిమ్స్‌ (స్క్రీనింగ్‌ టెస్ట్‌) 301 కేంద్రాల్లో జరిగింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన సందర్భంగా గౌతం సవాంగ్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘నియామక వ్యవహారాల్లో కోర్టులో లిటిగేషన్‌ లేకుండా ఎక్కడా ప్రాసెస్‌ జరగలేదు. కమిషన్‌పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో, సరైన విధంగా వివరణ ఇస్తాం. ఆ బాధ్యత మాపై ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు, ఇతరులు చేసిన ఆరోపణలపై నేను స్పందించను. ఆరోపణలు చేయాలంటే ఏవిధంగానైనా చేయొచ్చు. మౌఖిక పరీక్షలు, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగానే జరిగాయి. 55 రోజులపాటు సీసీ కెమెరాల నిఘాలో జరిగిన మూల్యాంకన విధుల్లో 162 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు మావద్ద ఉన్నాయి. ఉద్యోగ నియామకాల విషయంలో కమిషన్‌ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. గత నెలలో జరిగిన గ్రూపు-2 ప్రిలిమ్స్‌, ఈరోజు జరిగిన గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయించేందుకు పలువురు గట్టిగా ప్రయత్నించారు’ అని గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షతో కమిషన్‌పై మచ్చ పడిందని తాను అనుకోవడంలేదని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

72.55శాతం హాజరు.. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 72.55శాతం మంది హాజరయ్యారు. 1,48,881 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. వీరిలో 91,463 మంది పరీక్ష రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని