ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు..

‘ఏయ్‌ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు’ అంటూ పోలీసులు రైతును మెడ పట్టుకుని నెట్టివేసి.. కొట్టారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ అన్నదాత పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Updated : 22 Mar 2024 07:21 IST

చిత్తూరు జిల్లాలో రైతుపై చేయి చేసుకున్న పోలీసులు
అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడ్డ అన్నదాత

వెదురుకుప్పం, న్యూస్‌టుడే: ‘ఏయ్‌ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు’ అంటూ పోలీసులు రైతును మెడ పట్టుకుని నెట్టివేసి.. కొట్టారు. ఆ అవమాన భారాన్ని భరించలేక ఆ అన్నదాత పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందారు. రైతు భార్య సంపూర్ణమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మర్రిమాకుల కండ్రిగకు చెందిన చెంగయ్య, పాపమ్మలకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు చనిపోగా పెద్ద కుమారుడు దేశయ్య, చిన్న కుమారుడు చంద్రశేఖర్‌(56)కు భూమి పంపకాల విషయంలో విభేదాలున్నాయి. దేశయ్య తన భార్య శారద పేరుతో భూమిని రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేయించారు. తనకూ వాటా ఉందని చంద్రశేఖర్‌, ఆయన భార్య సంపూర్ణమ్మ చెబుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

తమకు కోర్టు స్టే ఇచ్చిందని పేర్కొంటూ శారద గురువారం ఉదయం ముళ్లకంప తొలగింపు పనులు చేపట్టారు. చంద్రశేఖర్‌, సంపూర్ణమ్మ నిలువరించే ప్రయత్నం చేయగా, శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుళ్లు ఆశీర్వాదం, వేలు వచ్చి వెదురుకుప్పం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని చంద్రశేఖర్‌ను హెచ్చరించారు. సివిల్‌ వివాదంలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు.. మేం మాట్లాడుకుంటామని ఆయన బదులివ్వగా.. ఏయ్‌ ఏంట్రా నువ్వు చెప్పేది.. పదరా స్టేషన్‌కు అంటూ దుర్భాషలాడారు. చొక్కా పట్టుకుని నెట్టడంతోపాటు గొంతు పట్టుకొని తోసేశారు. సంపూర్ణమ్మ అడ్డుకోవాలని చూసినా పోలీసులు లెక్క చేయలేదు. కానిస్టేబుళ్లు ఆయన్ను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఊళ్లో అడుగు పెట్టలేనని కుమార్తెకు చెప్పి..

మధ్యాహ్నం వరకు ఠాణాలో కూర్చోపెట్టగా ఆకలిగా ఉందని చంద్రశేఖర్‌ బయటకు వెళ్లి, తిరుపతి గ్రామీణ మండలం కేసీపేటలో ఉంటున్న కుమార్తెకు ఫోన్‌ చేశారు. తనను పోలీసులు అవమానించారని, ఇక ఊళ్లో అడుగు పెట్టలేనని.. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఆ విషయాన్ని అల్లుడు అత్త సంపూర్ణమ్మకు చెప్పడంతో ఆమె స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల గాలించారు. ఠాణాకు సమీపంలోని భారతంమిట్ట వద్ద అపస్మారక స్థితిలో కనిపించారు. పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతికి తరలిస్తుండగా, మధ్యలోనే ఆయన మరణించారు. దీంతో సంపూర్ణమ్మ, బంధువులు చంద్రశేఖర్‌ మృతదేహంతో స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు ఆశీర్వాదం, వేలు కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

తన భర్తను శవంగా మార్చిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు. నగరి డీఎస్పీ కేఎన్‌ మూర్తి, శిక్షణ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ సత్యబాబు ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి వరకు మృతుడి కుటుంబీకులు స్టేషన్‌ ఎదుటే బైఠాయించారు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డీఎస్పీ కేఎన్‌ మూర్తి విచారణ చేపట్టారు. ఎస్సై వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో విఫలమయ్యారని పేర్కొంటూ నివేదిక ఇవ్వడంతో ఆయన్ను వీఆర్‌కు పంపారు. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని