నాలుగేళ్లుగా మోత.. వెళ్లిపోతూ వాత!

నగరాలు, పట్టణాల్లో 2020-21 వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని రద్దు చేసిన జగన్‌ ప్రభుత్వం... 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది.

Updated : 25 Mar 2024 07:34 IST

తాజాగా 15% ఆస్తిపన్ను పెంపుతో కొత్త బిల్లులు సిద్ధం
ఐదేళ్లలో జగన్‌ అదనంగా పిండుకున్నది రూ.995 కోట్లు
2020-21లో మొత్తం పన్ను రూ.1,157.54 కోట్లు
2024-25కి రూ.2,109.88 కోట్లకు పెరిగిన వైనం
ఈనా డు-అమరావతి

నాడు... ఇదేం పాలన అన్నారు... పౌరులపై పన్నుల భారమంటూ మొసలి కన్నీరు కార్చారు! తనను గెలిపిస్తే చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానన్నారు..  గెలిచాక ప్రజల చర్మాన్నే ఒలిపించి... పన్నులు కట్టించుకుంటున్నారు! ఆస్తి పన్నులో మరీ బీభత్సం... నాలుగేళ్లుగా మోత మోగించిన జగన్‌... దిగిపోయే సమయంలోనూ... అయిదో ఏడాదికి 15% పెంపుతో బిల్లులు సిద్ధం చేయించారు!

గరాలు, పట్టణాల్లో 2020-21 వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని రద్దు చేసిన జగన్‌ ప్రభుత్వం... 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా ఆస్తిపన్ను విపరీతంగా పెరిగింది. ఆ మొత్తాన్ని ఒకేసారి విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో దాన్ని... చేరుకునేంత వరకు ఏటా 15% చొప్పున భారం మోపడం మొదలు పెట్టింది.

  • విశాఖపట్నం సీతమ్మధారలోని ఒక అపార్ట్‌మెంట్‌లో 900 చ.అడుగుల ఫ్లాట్‌ కలిగిన ఒక సాధారణ వ్యక్తి 2020-21లో చెల్లించిన ఆస్తిపన్ను రూ.3,834. జగన్‌ ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టాక 2021-22లో ఆ ఫ్లాట్‌కి పన్ను రూ.4,410కి పెరిగింది. 2022-23లో అది రూ.5,072కి చేరింది. 2023-24లో రూ.5,534కి చేరింది. 2024-25లో ఆ ఫ్లాట్‌ యజమాని రూ.6,364 చెల్లించాలి. అంటే నాలుగేళ్లలో ఆస్తిపన్ను 65.99% పెరిగింది. ఇంతకంటే బాదుడు ఇంకేముంటుంది?
  • గుంటూరులోని పాత పట్టాభిపురానికి చెందిన పేద కుటుంబం పాత విధానంలో తమ ఇంటికి ఏడాదికి రూ.780 పన్ను చెల్లించేది. కొత్త విధానంతో 2021-22లో పన్ను రూ.990కి పెరిగింది. 2022-23లో రూ.1,032, 2023-24లో రూ.1,186 చెల్లించాల్సి వచ్చింది. 2024-25లో అది రూ.1,363.9కి చేరుతుంది. అంటే నాలుగేళ్లలో  ఆ కుటుంబంపై పన్నుభారం 74.86% పెరిగిందన్నమాట.
  • విజయవాడ గవర్నర్‌పేటలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనం యజమాని పాత విధానంలో ఏడాదికి రూ.55,608 పన్ను చెల్లించేవారు. కొత్త విధానం వచ్చాక 2021-22లో ఆస్తిపన్ను రూ.63,950కి పెరిగింది. 2022-23లో రూ.69,836, 2023-24లో రూ.78,190 చెల్లించారు. 2024-25లో అది రూ.89,918.5కి చేరుతుంది. ఆ భవన  యజమాని చెల్లించాల్సిన పన్ను నాలుగేళ్లలో 61.70% పెరిగింది.

రలు పెంచేసి.. పన్నులతో బాదేసి.. జనం రక్తం పీల్చేయడమే ఎజెండాగా ఐదేళ్లపాటు పాలించిన జగన్‌ ప్రభుత్వం మరోసారి ఆస్తిపన్ను పెంపుతో పట్టణాల్లోని ప్రజలకు వాతలు పెట్టేందుకు సిద్ధమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను మరో 15% పెంచేసి ప్రజల నడ్డి విరవబోతోంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను పెంపుతో నాలుగేళ్లలో ప్రజలపై రూ.952 కోట్లకుపైగా అదనపు భారం (2024-25తో కలిపి) మోపింది. జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తి మూలధన విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల్ని శాపంలా వెంటాడుతోంది. నగరాలు, పట్టణాల్లో 2020-21లో రూ.1157.54 కోట్లుగా ఉన్న ఆస్తిపన్ను డిమాండ్‌... 2023-24 నాటికి రూ.2109.88 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 82.27% పెరిగినట్టు. ఆస్తిపన్ను పెంపు ఇలా ఎడతెగని వ్యవహారంలా ఏటా సాగుతుంటే... ఇళ్లు, భవనాల యజమానులకే కాదు, అద్దెకున్న వారికీ ఇది భారంగానే పరిణమిస్తోంది. పెరిగిన పన్నుకు అనుగుణంగా యజమానులు అద్దెలనూ పెంచుతారు. తాజాగా 15% పెంపుతో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల్ని పట్టణ స్థానిక సంస్థలు సిద్ధం చేస్తున్నాయి.

అడ్డగోలు పన్నుల్లో ఔరంగజేబుని మించిపోయిన జగన్‌!

ప్రజలను అడ్డమైన పన్నులతో పీడించిన పాలకుడి ప్రస్తావన వస్తే ఔరంగజేబు గుర్తుకొస్తారు. తన ఐదేళ్ల పాలనలో చెత్త పన్నులన్నీ వేసిన జగన్‌... ఔరంగజేబునే మించిపోయారు. సీఎం నిర్వాకాలకు కొత్త ఆస్తిపన్ను విధానం ఓ మచ్చుతునక. రాష్ట్రంలో దశాబ్దాలుగా అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలులో ఉంది. ఐదేళ్లకు ఒకసారి పన్ను సవరించేవారు. ప్రజలపై భారం వేయకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పన్ను పెంపును నిక్కచ్చిగా అమలు చేసేవికాదు. చివరిగా ఉమ్మడి ఏపీలో 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు ఆస్తిపన్ను సవరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా... ఆర్థికలోటు వేధిస్తున్నప్పటికీ ఆస్తిపన్ను పెంచలేదు. పైగా నగరాల్లో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు కృషిచేసింది. జగన్‌ వచ్చాక నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా... అప్పటి వరకున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని తీసేసి, 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధిస్తున్నారు. దాని ప్రకారం నివాస భవనాలకు రిజిస్ట్రేషన్‌ విలువలో 0.15%, వాణిజ్య భవనాలకు 0.30% చొప్పున పన్నుగా నిర్ణయించారు. ఫలితంగా పన్ను కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఒకేసారి అంత భారీగా పన్ను పెంచేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని... ఏటా 15% చొప్పున పెంచుతూ వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కొత్త విధానంలో పెరిగిన పన్ను మొత్తంతో సమానమయ్యేంత వరకు ఏటా... 15% చొప్పున పెరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆస్తుల విలువల్ని సవరిస్తుంది కాబట్టి... పన్ను మొత్తమూ పెరుగుతుంటుంది. అంటే జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే... మరో ఐదేళ్లు ఏటా 15% చొప్పున పన్ను వాత తప్పదన్నమాట.


ఏటా ఆస్తి పన్ను పెంపు రాజ్యాంగ విరుద్ధం

-సీహెచ్‌ బాబూరావు, పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌

పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం గ్రాంట్‌లు ఇవ్వకపోగా... ఆస్తి పన్ను రూపంలో నిరంతరంగా, శాశ్వతంగా భారం వేయడం రాజ్యాంగ విరుద్ధం. అనైతికం. అసంబద్ధం. కొత్త విధానంలో అద్దెకు ఉంటున్న వారిపైనా భారం పడుతుందని మొదటి నుంచీ హెచ్చరిస్తున్నాం. పాత విధానం కొనసాగించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పాత విధానం పునరుద్ధరించే వారికే ఓట్లు వేస్తామని ఈ ఎన్నికల్లో స్పష్టంగా చెబుతాం.


అశాస్త్రీయ విధానాన్ని రద్దు చేయాల్సిందే

- ఇ.పుల్లారెడ్డి, పట్టణ పౌర సమాఖ్య కర్నూలు నగర కన్వీనర్‌

ఏటా ఆస్తిపన్ను పెంచే అశాస్త్రీయ విధానాన్ని తక్షణం రద్దు చేయాలి. ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు విలువ కట్టి, ఏటా ఆస్తిపన్ను పెంచడమేంటి..? ప్రభుత్వమే ప్రజల్ని పీడించడం ఎంత వరకు సబబు? ప్రజల్ని కొల్లగొట్టే ఆస్తిపన్ను విధానం రద్దు చేయాలి. కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు ఆస్తి పన్ను భారీగా పడుతోంది. పేద, మధ్య తరగతికి ఎంతో భారంగా ఉన్న ఈ విధానాన్ని తక్షణం రద్దు చేయాల్సిందే.


పాత విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలి

- బి.గణేశ్‌, ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం అపార్ట్‌మెంట్ల నివాసితుల సంక్షేమ సంఘం

ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను నిర్ణయించే కొత్త విధానంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతోంది. ఏటా 15% చొప్పున పన్ను పెంచడం సరైన విధానం కాదు. దీన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా పెంచిన ఆస్తి పన్నుతో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలి. దానికి హామీ ఇచ్చిన పార్టీలకే ఎన్నికల్లో మేం మద్దతిస్తాం.


మంత్రి బొత్స చిలక పలుకులు

‘‘కొత్త పన్ను విధానంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వారు చెల్లిస్తున్న పన్ను 15 శాతానికి మించి పెరగదు. కొత్త పన్ను విధానంలో స్థానిక సంస్థలకు అదనంగా వచ్చే ఆదాయం రూ.186 కోట్లే’’ అని అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా ఉన్న బొత్స చిలకపలుకులు పలికారు. పాత విధానం దళారులకు, అవినీతిపరులకు అవకాశమిచ్చేలా ఉందని, కొత్త విధానంలో అది ఉండబోదని సమర్థించుకున్నారు. 15% పన్ను ఏటా పెరుగుతుందని, అది సాధారణ ప్రజలు భరించలేని స్థాయికి చేరుతుందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.


సిద్ధమవుతున్న కొత్త బిల్లులు

గరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు... ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను నోటీసులను సిద్ధం చేస్తున్నాయి. 2023-24 డిమాండ్‌పై 15% పన్ను పెరుగుతుందనుకుంటే... 2024-25లో పట్టణ ప్రజలు రూ.2,109.88 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని