30శాతానికి పడిపోయిన విశాఖ ఉక్కు ఉత్పత్తి

విశాఖలోని ‘అదానీ గంగవరం పోర్టు’లో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై తీవ్రంగా పడుతోంది.

Updated : 20 Apr 2024 06:29 IST

పది రోజులుగా అందని కోకింగ్‌ కోల్‌
జీతాలు ఇవ్వలేదంటూ సిబ్బంది ఆవేదన

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలోని ‘అదానీ గంగవరం పోర్టు’లో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపై తీవ్రంగా పడుతోంది. గత పది రోజులుగా కోకింగ్‌ కోల్‌ అందక దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో బొగ్గు సమకూర్చుకోకపోవడంతో ప్లాంటులో కీలకమైన రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నిలిపివేశారు. కేవలం ఒకే ఫర్నేస్‌ ద్వారా 30శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నౌకలను గంగవరం పోర్టు నుంచి విశాఖ పోర్టుకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెర్త్‌ అనుమతులు పొంది, అక్కడి నుంచి నిరంతరాయంగా కోకింగ్‌ కోల్‌ సరఫరా చేసినా.. ప్లాంటు గాడిలో పడటానికి మరో పదిరోజులు పట్టే అవకాశం ఉంది.

నౌకలు మళ్లించినా అదనపు భారమే

గంగవరం పోర్టులో ఉన్న నౌకలను విశాఖ పోర్టుకు మళ్లించి.. కోకింగ్‌ కోల్‌ దిగుమతి చేసి రవాణా చేయాలంటే ప్లాంటుకు అదనపు భారం తప్పదు. విశాఖ పోర్టు నుంచి ప్లాంటుకు సుమారు 27కి.మీ. దూరం ఉన్నప్పటికీ.. రైల్వే వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయడానికి వంద కి.మీ.లకు ఛార్జీ చేస్తారని సమాచారం. దీనికితోడు పోర్టులో హ్యాండ్లింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. నౌకలు ఇన్ని రోజులుగా అన్‌లోడ్‌ చేయకుండా ఉంచినందుకు డెమరేజీ ఛార్జీల భారమూ ప్లాంటుపైనే పడనుంది.

కమీషన్ల కోసమే బయటి కొనుగోళ్లు

ఇతర ఓడరేవుల నుంచి 50వేల టన్నుల కోకింగ్‌ కోల్‌ను అప్పుగా తీసుకునేందుకు ప్లాంటు సిద్ధమవుతోంది. కమీషన్ల కోసమే బయట అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది ఓ ప్రైవేటు పార్టీ నుంచి రూ.45కోట్ల విలువైన 16వేల టన్నుల జమ్‌కోల్‌ను అత్యవసరంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అది నాసిరకంబొగ్గు అని తేలినా.. డబ్బులు చెల్లించేసిన అంశంపై సీబీఐ విచారిస్తోందనే చర్చ అధికార, కార్మికవర్గాల్లో సాగుతోంది.

‘రాయబరేలి ప్లాంటు’ డబ్బులొచ్చినా

విశాఖ స్టీలు ప్లాంటుకు చెందిన రాయబరేలి ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంటును.. రైల్వేకు రూ.2వేల కోట్లకు అమ్మేశారు. దానికి సంబంధించిన డబ్బులు రూ.746కోట్లు వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ 20వ తేదీ వచ్చినా.. ఇప్పటికీ జీతాలివ్వలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా సుమారు 4,100 మందికి రూ.42కోట్ల జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. ఈనెల 8న అధికారులకు సగం వేతనమే చెల్లించారు. జనవరి నుంచి పీఎఫ్‌ ఖాతాలోకి నగదు జమ చేయలేదని, ఎల్‌ఐసీలకు చెల్లించలేదని అధికారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని