తెదేపా షార్ట్‌ ఫిల్మ్‌ ‘దివాకరం’.. ది క్యాషియర్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో.. పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Updated : 21 Apr 2024 07:29 IST

ఉదయం విడుదల..  సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు


హేమంత్‌: రోజూ నువ్వు తాగే మందు క్వార్టర్‌ రేటు గతంలో ఎంత ఉండేది? ఇప్పుడెంత?  

శ్రీను: గతంలో రూ.80. ఇప్పుడు రూ.200. రూ.120 పెరిగింది.

హేమంత్‌: నెలకు, ఏడాదికి, అయిదేళ్లకు ఎంత పెరిగినట్లు?

శ్రీను: నెలకు రూ.3,600, ఏడాదికి రూ.43,200, అయిదేళ్లలో రూ.2,16,000.. అయ్యబాబోయ్‌! అదనంగా ఇంత కట్టామా?


ఈనాడు, అమరావతి: అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో.. పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘దివాకరం’ షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ‘ది క్యాషియర్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో.. 8 నిమిషాల నిడివిగల ఈ వీడియో వివిధ వర్గాల ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. అజయ్‌ అమృత్‌, అనిల్‌ దర్శకత్వంలో హేమంత్‌ ప్రధాన పాత్రధారిగా నటించగా.. హాస్యనటుడు నారాయణస్వామి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శనివారం విడుదలైన వీడియో సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు దాటిందని వారు వివరించారు. బ్యాంకు క్యాషియర్‌గా పనిచేసే దివాకరం అందరికీ ఉచితంగా డబ్బు ఇస్తున్నారంటూ వెంకీ బృందం డప్పులతో ప్రచారం చేస్తుంది. దీంతో గ్రామస్థులంతా బ్యాంకు దగ్గరకు పరుగు తీయడంతో చిత్రం ప్రారంభమవుతుంది. తాను ఎవరికీ ఉచితంగా డబ్బు ఇవ్వలేదని, వెంకీ అనే వ్యక్తి తన డబ్బు తానే డ్రా చేసుకుని తీసుకెళ్లాడని దివాకరం చెబుతాడు. గ్రామస్థులంతా వెంకీ దగ్గరకెళ్లి ‘నీ డబ్బు నీకిచ్చిన దివాకరానికి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు’ అని ప్రశ్నిస్తారు. దీంతో అతను ‘అమ్మఒడి, రైతు భరోసా, ఆటోడ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు వేసినప్పుడు మీరు జగన్‌కు పాలాభిషేకాలు చేశారు కదా?.. ఆ డబ్బు ఏమైనా సాక్షి మీడియా, భారతీ సిమెంట్‌, లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌ అమ్మేసి ఇచ్చిన డబ్బులా? మరెందుకు పాలాభిషేకం చేశారు?’ అంటూనిగ్గదీయడంతో వారికి నోటమాట రాదు.

ఒక్కో కుటుంబం నుంచి దోచింది రూ.10 లక్షలు

మద్యం తాగే ఒక్కో వ్యక్తి నుంచి అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఎంత దోచిందో.. మందుబాబు నోటితోనే చెప్పించారు. ‘చూశారా? ధర పెంచడం ద్వారా మద్యం తాగే ఒక వ్యక్తి నుంచే అయిదేళ్లలో రూ.2.16 లక్షలు దోచుకున్నారు. పెట్రోలు, డీజిల్‌, ఇసుక ధరలు, బస్‌, విద్యుత్తు ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, రోడ్‌ ట్యాక్స్‌, ఫైబర్‌నెట్‌ ఛార్జీలు.. ఇలా పెంచినవన్నీ లెక్కేస్తే అయిదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి దోచింది అక్షరాలా రూ.10 లక్షలు.. నవరత్నాల పేరుతో కుటుంబానికి ఇచ్చింది రూ.లక్షే’ అని కథానాయకుడు చెప్పే సంభాషణలు జగన్‌ పాలనలో దోపిడీని కళ్లకు కట్టాయి. 


ఈ మాత్రం బటన్‌ నొక్కడానికి బామ్మ చాలదా?

‘అభివృద్ధి చేయడం రాదు, రాజధాని కట్టలేరు, పోలవరం పూర్తి చేయలేరు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు.. అలాంటి వారికి ఓటెలా వేస్తార్రా’ అని కథానాయకుడి పాత్రధారి వేసే ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘ఈ మాత్రం బటన్‌ నొక్కడానికి బామ్మ చాలదా? సీఎం అనేవారు ఒకరు కావాలా?’ అంటూ ముక్తాయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని