మాటల ఏలిక.. మీటలో మెలిక!

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్‌ లీవర్‌, పీఅండ్‌జీ, ఐటీసీ, రిలయన్స్‌, అమూల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.

Published : 29 Apr 2024 05:18 IST

మహిళలకు జగన్‌ చేయూత.. ఉత్తుత్తే
నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తామని నవరత్నాల కింద హామీ
బటన్‌ నొక్కినా చివరి విడత జాడే లేదు
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. గుత్తేదారులకు చెల్లింపులు
27 లక్షల మంది మహిళల నోట్లో మట్టి
లబ్ధిదారుల ఎంపికలోనూ కోతలే
ఈనాడు, అమరావతి

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్‌ లీవర్‌, పీఅండ్‌జీ, ఐటీసీ, రిలయన్స్‌, అమూల్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. అవి తయారు చేసే వస్తువులను వాటి ఏజెన్సీల కంటే తక్కువ ధరకే అందిస్తారు.
2020 ఆగస్టు 12న మొదటి విడత ‘చేయూత’ ఆర్థిక సాయం విడుదల సందర్భంగా సీఎం జగన్‌


చేయూత కింద వ్యాపారాలు ప్రారంభించిన మహిళలకు సరకులు సరఫరా చేసేందుకు హిందుస్థాన్‌ లీవర్‌, ఐటీసీ, పీఅండ్‌జీ సంస్థలు అంగీకరించాయి. అవసరమైతే మహిళలకు తామే రుణ సాయం చేస్తామని, సరకుల రవాణా ఖర్చులనూ భరిస్తామని, మూడు నెలల్లో అమ్ముడుపోని సరకులనూ వెనక్కి తీసుకుంటామని చెప్పాయి.

2020 సెప్టెంబరు 26న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి


కార్పొరేట్‌ సంస్థలతో 78 వేల మంది మహిళలు ఒప్పందం చేసుకుని కిరాణా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా సంస్థల సహకారంతో ఒక్కో మహిళ రూ.7 వేల నుంచి రూ.10 వేలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

2021 జూన్‌ 20న రెండో విడత ‘చేయూత’ సాయం విడుదల సమయంలో జగన్‌


రాష్ట్రంలో కిరాణా దుకాణాలు పెట్టిన మహిళల సంఖ్య 1.10 లక్షలకు చేరింది.

2022 సెప్టెంబరు 23న మూడో విడత సాయం విడుదల సందర్భంగా ప్రభుత్వం


బటన్‌ నొక్కాలి.. కానీ సాయం అందకూడదు..
హామీలివ్వాలి.. కానీ అమలు చేయకూడదు..
సంక్షేమం అనాలి.. కానీ షరతులు పెట్టాలి..
అక్కాచెల్లమ్మలందరికీ మేలు అనాలి..
లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలి..
ఇదీ.. ‘చేయూత’ విషయంలో చేతకాని వైకాపా ప్రభుత్వ తీరు.

‘చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తాం’ నవరత్నాల కింద జగన్‌ ఇచ్చిన హామీ ఇది. నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తామని చెప్పి..చివరి విడతను మాత్రం గాలికొదిలేశారు. ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున 27 లక్షల మందికి మొండిచెయ్యి చూపించారు. మొత్తం రూ.5,060 కోట్లు ఎగ్గొట్టారు. మొదటి మూడు విడతలనైనా తిన్నగా అమలు చేశారా అంటే అదీ లేదు. నిబంధనల కొర్రీలు వేసి ఎక్కడికక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. ఇక ఆ పథకం కింద మహిళలకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా జీవనోపాధి కల్పిస్తున్నామని నాలుగేళ్లపాటు ఊదరగొట్టారు. మహిళలు ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండానే వ్యాపారానికి అనువుగా కిరాణ వస్తువులు, ఇతర సామగ్రి అందిస్తామని వైకాపా ప్రభుత్వం గప్పాలు కొట్టింది. తీరా ఆ మాటలు నమ్మి వ్యాపారంలోకి అడుగు పెట్టినవారు అప్పులపాలయ్యారు.

మొదటి నుంచి ఎగ్గొట్టే ఎత్తుగడే..

చేయూత పథకం కింద లబ్ధిదారులకు నగదును గతేడాది సెప్టెంబరులోనే విడుదల చేయనున్నట్లు తొలుత 2023-24 సంక్షేమ క్యాలెండరులో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్తామన్నారు. తొలుత ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత 16కు, 21కి, 26కి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి మార్చి 7న బటన్‌ నొక్కినా డబ్బులు మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదు. ఎన్నికల కోడ్‌ దీనికి అడ్డు అనుకుంటే పొరపాటే. కోడ్‌ అమల్లో ఉన్న తర్వాత కూడా స్క్రీనింగ్‌ కమిటీ అనుమతి తీసుకోకుండానే అస్మదీయులకు, ఇతర గుత్తేదారులకు రూ.13 వేల కోట్లు చెల్లించారు. మహిళల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కుచ్చుటోపి పెట్టారు.


లబ్ధిదారుల ఎంపికలో కోతలు

చేయూత కింద ఆర్థికసాయం అందించిన ప్రతిసారీ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఎత్తుగడ వేశారు. వృత్తిని ప్రాతిపదికగా తీసుకుని ఒకరికి ఒక పథకం మాత్రమే వర్తింపచేస్తామంటూ ఇబ్బడిముబ్బడిగా కోత వేశారు. ఈ నిబంధన ఉందనేది అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. నేతన్ననేస్తం, రైతు భరోసా, ఇతర పథకాలు అందే వారికి చేయూత కింద ఆర్థికసాయం అందించలేదు. ఇదే కాదు.. నాలుగో విడత ఎంపికలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారని వారి దరఖాస్తులను పక్కనపెట్టారు. ఇక 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం, మూడు ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండటం, పట్టణాల్లో 1000 చ.అడుగుల విస్తీర్ణం గల ఇల్లు ఉందని, ఇలా నిబంధనలు వర్తింపచేసి ఏటా వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సాయం అందకుండా చేశారు.


సొమ్ము మహిళలదే.. ప్రచారం ప్రభుత్వానిది

జగనన్న చేయూత కింద జీవనోపాధి ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకుల ద్వారా ఒకేసారి రూ.75 వేలు (రూ.18,750 మొదటి విడత పోను మిగతా రూ.56,250 రుణం) అందిస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు బ్యాంకుల వద్ద తీసుకునే ఈ రుణాన్ని వాయిదాల్లో చెల్లించాలి. ఇలా బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించడం కొత్త విషయమేమీ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగుతున్నదే. రుణాలు పొంది సుస్థిర స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా మహిళలు లక్షల్లో ఉన్నారు. కానీ, చేయూత గురించి మాట్లాడినప్పుడల్లా తన హయాంలోనే బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతున్నట్టు తప్పుడు ప్రచారం చేశారు.


ఉత్పత్తుల సరఫరా కరవు

మొదట్లో ఈ పథకం కింద మండలానికి రెండు చేయూత దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటిలో ఒకరు తప్పనిసరిగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి. అది సాధ్యపడకపోవడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సుమారు 2,000 జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రం మొత్తం చేయూత దుకాణాలు ఏర్పాటు చేయాలకున్నారు. వీటికి బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే 3% మార్జిన్‌ ఉండేలా ఒప్పందం చేసుకున్న కార్పొరేట్‌ సంస్థలు తమ ఉత్పత్తులను అందించాలి. అమ్మకాలకు అనుగుణంగా వారానికి ఒకసారి సరకులను సరఫరా చేయాలి. 2021 జూన్‌ నాటికి 78 వేల మంది, 2022 సెప్టెంబరు నాటికి 1.10 లక్షల మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జగన్‌ చెప్పినట్టు దుకాణాల దగ్గరకు కార్పొరేట్‌ సంస్థలు సరకులు తీసుకువెళ్లడమూ లేదు. బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అందించడమూ లేదు.


మహిళా మార్టులకూ మొండిచెయ్యే

ఈ ప్రయోగం వికటించడంతో చేయూత ‘మహిళామార్ట్‌’లంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ములు ఇవ్వకుండా డ్వాక్రా మహిళల నుంచే రూ.150 నుంచి రూ.250 వరకు వాటాధనంగా వసూలు చేశారు. రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు రాబట్టాక.. మార్టులు ఏర్పాటు చేశారు. తొలి దశలో 100 ఏర్పాటు చేయాలనుకున్నా, ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 50 వరకు చేరింది. మొత్తం 100 ఏర్పాటు చేసినా రూ.60 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ ఆ మాత్రం కూడా జగన్‌ బడ్జెట్‌ నుంచి కేటాయించలేదు. మార్టుల ఏర్పాటు నుంచి అందులోని సరకుల కొనుగోలు వరకు అన్నింటికీ డ్వాక్రా మహిళల డబ్బే. అంతే కాదు...నష్టాలు వచ్చినా ఆ భారం వారి మీదే. మహిళల డబ్బుతో పెట్టించిన మార్టుల్లోని సరకుల్ని కూడా మళ్లీ మహిళలతోనే బలవంతంగా కొనిపించారు. ఇందుకు వీవోఏలను ఉపయోగించారు. కొనకపోతే పథకాలు అందించబోమని వారికి అదనపు బెదిరింపులు. అంటే నచ్చిన చోట.. కోరుకున్న సరకుల్ని కొనే స్వేచ్ఛ కూడా మహిళలకి లేకుండా చేశారు జగన్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని