ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు

రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్‌ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు!

Published : 29 Apr 2024 05:19 IST

వైకాపా మ్యానిఫెస్టోలో పెట్టుబడులు, పరిశ్రమల మాటే లేదు
యువతకు ఉద్యోగాల కల్పన ప్రణాళికా శూన్యం
పెదవి విరుస్తున్న యువత

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్‌ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న ఆలోచన అంతకన్నా లేదు! పరిశ్రమల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న పట్టుదల అసలే లేదు! ఎంతసేపూ అందినకాడికి దండుకోవడం, ప్రజల్ని మభ్యపెట్టో, ప్రలోభపెట్టో మరోసారి అధికారంలోకి వచ్చేయాలనుకోవడం ఇదే ముఖ్యమంత్రి జగన్‌ ఎజెండా. ఆయన శనివారం ప్రకటించిన మ్యానిఫెస్టోనే దీనికి నిదర్శనం. రాజకీయ పార్టీ ప్రకటించే మ్యానిఫెస్టో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దంపట్టే దార్శనికపత్రంలా, భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రణాళికలా ఉండాలి. వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ లక్షణాలేమీ లేవు. ఐదేళ్లుగా విధ్వంసమే ఎజెండాగా పాలించిన ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించడం, యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన వంటివి ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తించారు. రాష్ట్రానికి దీర్ఘ కాలంలో ఉపయోగపడే ఆస్తుల కల్పనపై నిధులు వెచ్చించడం (మూలధన వ్యయం) అనే పదమే జగన్‌కు గిట్టదు. రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన అసలే నచ్చదు. జగన్‌ ఇప్పుడు ప్రకటించిన మ్యానిఫెస్టో కూడా ఐదేళ్ల విధ్వంసక పాలనకు కొనసాగింపులా ఉందే తప్ప.. చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, రాష్ట్రాభివృద్ధిని గాడిన పెట్టే ఆలోచన, తాపత్రయం ఏ కోశానా కనిపించడం లేదని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అమరావతిని చంపేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి?

రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రంగా నిలిచే రాజధాని అమరావతిని జగన్‌ ప్రభుత్వం ధ్వంసం చేసింది. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే ఈ ఐదేళ్లలోనే అక్కడ వేల మందికి ఉద్యోగాలు, కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చుపెట్టి, మరికొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రణాళికతో అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. మూడు రాజధానుల పేరుతో దాన్ని సర్వనాశనం చేసింది. ఆ దెబ్బతోనే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సడలిపోయింది. కార్యనిర్వాహక రాజధాని అంటూ ఊదరగొట్టిన విశాఖనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. తాజా మ్యానిఫెస్టోలోనూ జగన్‌ మూడు రాజధానుల పాటే పాడారు. కోర్టులో కేసు ఉన్న విషయాన్ని కూడా విస్మరించి.. మూడు రాజధానుల ప్రస్తావన చేశారు. ప్రభుత్వం తన విధ్వంసక విధానాల్ని ఇలా కొనసాగిస్తుంటే ఇక పెట్టుబడిదారులు ఎలా వస్తారు?

కొత్త పరిశ్రమలు తెస్తామన్న మాటే లేదే!

రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీలో పెట్టుబడుల్ని ఆకర్షించి, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితేనే యువతకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. సుదీర్ఘ తీరప్రాంతం, ఓడరేవులు, అపారమైన గనులు, ఖనిజాలున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఉవ్విళ్లూరేవారు. ప్రభుత్వం వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తే పెట్టుబడులతో తరలి వస్తారు. కానీ జగన్‌ ప్రభుత్వం  తన విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. తాజా మ్యానిఫెస్టోలోనూ అదే ధోరణి కనిపించింది. ‘2019 మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాం’ అన్న మాట తప్ప.. రాష్ట్రానికి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వ వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై ఒక్క మాటా ప్రస్తావించలేదు. గత ఐదేళ్లలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేసిందేమీ లేదు, కాబట్టే మ్యానిఫెస్టోలో ఎక్కడా ఆ ప్రస్తావన చేయలేదు.


పరిశ్రమల్ని ఆకర్షించే వ్యూహమేదీ?

వైకాపా ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల ఏకంగా రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. వీటిలో గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు చేసుకున్నవాటితోపాటు, అప్పటికే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు వల్ల పెట్టుబడుల విస్తరణ ఆలోచనలు మానుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన అమరరాజ బ్యాటరీస్‌ వంటి సంస్థలూ ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితిని జగన్‌ ప్రభుత్వం సృష్టించింది. పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపడం, పెట్టుబడిదారుల సదస్సులకు హాజరై రాష్ట్రంలో ఏపకప అవకాశాల గురించి వివరించడం, దేశ, విదేశీ పారిశ్రామిక బృందాల్ని రాష్ట్రానికి ఆహ్వానించడం వంటివేమీ జగన్‌కు పట్టవు. ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడాల్సిందే! ఆ సమావేశాలు కూడా చాలా మొక్కుబడిగా జరుగుతూ ఉంటాయి. గడిచిన ఐదేళ్లలో జగన్‌ ఒకే ఒక్కసారి దావోస్‌లోని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. అప్పుడు కూడా మన దేశానికి చెందిన, అంతకు ముందే అంగీకారం కుదిరిన.. గ్రీన్‌కో, అరబిందో, అదానీ వంటి సంస్థల్ని దావోస్‌ పిలిపించుకుని అక్కడ రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు కుదుర్చుకున్నట్టు గొప్పలు చెప్పి, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. దాదాపుగా అవన్నీ సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలే. వాటి వల్ల వచ్చే ఉద్యోగావకాశాలూ చాలా తక్కువే.


గత ప్రభుత్వ ఘనతను మీ ఖాతాలో వేసుకుంటే ఎలా?

జగన్‌ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా పెట్టుబడులపై అడ్డగోలు లెక్కలు చెప్పింది. 2019 జూన్‌ నుంచి 2022 ఆగస్టు వరకు రూ.46,280 కోట్ల పెట్టుబడులతో 99 కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, రూ.39,655 కోట్లతో మరో 55 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని కోతలు కోసింది. తాజా మ్యానిఫెస్టోలో కూడా ఐదేళ్లలో రూ.85,543 కోట్ల పెట్టుబడులు, 28.89 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ అబద్ధాలు వల్లె వేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకుని, నిర్మాణాలు ప్రారంభించిన పరిశ్రమల్నీ జగన్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తోంది. నిజంగా జగన్‌ ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు వచ్చి ఉంటే, వాటిలో కొన్ని పేర్లయినా చెప్పొచ్చు కదా?


ఐటీ రంగాన్ని చావుదెబ్బ తీయడమేనా ఎజెండా!

మన రాష్ట్రంలో బీటెక్‌ పూర్తి చేసిన యువత మరుక్షణం బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు పరుగులు తీస్తోంది ఐటీ ఉద్యోగం కోసమే. వేల మందికి ఉద్యోగాలిచ్చే అలాంటి రంగాన్ని జగన్‌ ప్రభుత్వం చావుదెబ్బ తీసింది. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిపై శీతకన్నేసింది. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని తన్ని తరిమేసింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖతో పాటు, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో ఏర్పాటైన అనేక ఐటీ పరిశ్రమలు జగన్‌ ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రం వదిలి పారిపోయాయి. విశాఖలో నిర్మించిన ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఖాళీ అయిపోయింది. ప్రముఖ ఐటీ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకోవడమే మానేశాయి. ఐటీ రంగ అభివృద్ధికి విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లూ కబుర్లతోనే నెట్టుకొచ్చింది. తాజా మ్యానిఫెస్టోలో ఐటీ ఊసే లేదు.


ఉపాధి కల్పనపై శ్రద్ధ ఇదేనా?

తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జగన్‌ ప్రకటించారు. తిరుపతి సమీపంలో ప్రభుత్వం 50 ఎకరాలు సేకరించింది. నిర్మాణానికి టెండర్లు పిలిస్తే పనిచేశాక బిల్లులివ్వరేమోనని గుత్తేదార్లు ముందుకు రాలేదు. లోక్‌సభ నియోజకవర్గానికో నైపుణ్య కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి, భవనాలు నిర్మించకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో నడిపించారు. వాటి నిర్వహణా మొక్కుబడిగా మారింది. శాసనసభ నియోజకవర్గానికో స్కిల్‌ హబ్‌ ఇప్పటికే ఏర్పాటు చేసినా.. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో చాలా వాటిని మూసేశారు. ఇప్పుడు వాటన్నింటినీ కొత్తగా మ్యానిఫెస్టోలో పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని